గ్రీన్ జర్నీ
- ‘వన్ మేన్ వన్ లేక్ సీడ్స్’ నినాదంతో..
- విశాఖ నుంచి కేరళ వరకు విత్తనాల పంపిణీ
- కేరళీయుడి సామాజిక బాధ్యత
పచ్చని ప్రకృతి ఒడిలో పుట్టిన ప్రభావమో...
చిన్నప్పటి అశోకుడి పాఠం బాగా వంట బట్టిందో...
ఓ కేరళ యువకుడు పర్యావరణ పరిరక్షణకు
నడుం బిగించాడు. అందరూ మొక్కలు నాటితే భవిష్యత్తు బంగారమవుతుందని ఆశిస్తున్నాడు.
‘వన్ మేన్ వన్ లేక్ సీడ్స్’ నినాదంతో మంగళవారం ‘గ్రీన్ జర్నీ’ ప్రారంభిస్తున్నాడు. విశాఖ నుంచి కేరళలోని అలప్పుఝా వరకు రెండు వేల కిలోమీటర్ల మేర మోటార్ బైక్‌పై ప్రయాణించి, వివిధ ప్రాంతాలలో ప్రజలకు లక్ష విత్తనాలను పంపిణీ చేయ
నున్నాడు.
ఏయూ క్యాంపస్: కేరళ రాష్ట్రానికి చెందిన లీజిన్ రాజు ఉద్యోగరీత్యా విశాఖలో ఉంటున్నారు. చిన్నతనం నుంచి ప్రకృతిపై ఉన్న మమకారం అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేలా చేసింది. తన గ్రామంలోని పాఠశాల విద్యార్థులతో మొక్కలు నాటించడం, తన పరిసరాలలో పక్షులకు అవసరమైన గూళ్లు ఏర్పాటు చేయడం అలవాటుగా చేసుకున్నారు రాజు. విషసర్పాలు కనిపిస్తే వాటిని చంపకుండా దూరంగా అడవులలో విడిచి పెట్టడం, గాయపడిన జంతువులకు సపర్యలు చేయడం అతనికి అలవాటు. చెట్లు కొట్టి ఊళ్లను కాంక్రీట్ జంగిల్‌గా మారుస్తున్నారని, ఈ పరిస్థితిని మార్చడం కోసం తన వంతు కృషిగా లక్ష విత్తనాలను పంచాలని ఆయన తలపెట్టారు.
ఇందుకోసం తన కుటుంబ సభ్యులు, స్నేహితుల సహకారంతో విశాఖ పరిసరాలలో లభించే దేవకాంచనం (మౌంటెన్ ఎబోని) చెట్టు విత్తనాలను లక్షకుపైగా సేకరించారు. తనగ్రీన్ జర్నీని మంగళవారం ఉదయం ఏయూ నుంచి ప్రారంభిస్తున్నారు. ఉదయం 9 గంటలకు ఏయూ వీసీ ఆచార్య జి.ఎస్.ఎన్.రాజు ఏయూ వృక్ష శాస్త్ర విభాగం వద్ద ఈ పచ్చని ప్రయాణాన్ని జెండా ఊపి ప్రారంభిస్తారు.
గ్రీన్ జర్నీ సాగేదిలా..
విశాఖ, విజయవాడ, చెన్నై మీదుగా కేరళ వరకు ద్విచక్ర వాహనంపై ఈ ప్రయాణం సాగుతుంది. మధ్యలో రహదారి పొడవునా ఉండే గ్రామాలను సందర్శిస్తూ, అక్కడ ప్రజలకు పర్యావరణంపై అవగాహన కల్పిస్తూ దేవకాంచనం విత్తనాలను పంపిణీ చేస్తారు. ఇలా గ్రామాలను సైతం కలుపుకుంటూ పది రోజులపాటు రెండు వేల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తున్నారు.
ఇటీవల జరిగిన పర్యావరణ దినోత్సవం రోజున తన కార్యక్రమాన్ని ఆరంభించారు. ప్రత్యేకంగా కరపత్రాలను ముద్రించి నగరంలో పంచారు. దాంతోపాటు మూడు విత్తనాలకు సైతం బహుమతిగా అందించారు. త్వరలో సౌతిండియా, కన్యాకుమారి నుంచి లేహ్ వరకు పర్యావరణ చైతన్యం పెంచుతూ యాత్ర చేయాలని చూస్తున్నాడు. రాజు కృషిని గుర్తించి కేరళ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అవార్డును సైతం అందించింది. మడ అడవుల సంరక్షణకు చేసిన కృషికి ఈ పురస్కారం లభించింది.