గుడివాడలో ‘అందరికీ పక్కా ఇళ్లు’
రూ.182కోట్లతో ప్రాజెక్టు పనులు3312 మందికి అవకాశం
డీపీఆర్‌తో ఢిల్లీకి బయలుదేరి అధికారులు
గుడివాడ : గుడివాడ పట్టణంలోని అందరికీ పక్కాఇళ్లు పథకం మరో అడుగు ముందుకేసింది. మల్లాయిపాలెం సమీపంలో ఉన్న 77 ఎకరాల్లో జీ ప్లస్-2 గృహ సముదాయం నిర్మాణానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. మరో వైపు డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్)తో గృహ నిర్మాణశాఖ అధికారులు ఢిల్లీకి బయలుదేరి మంజూరుకు రంగం సిద్ధం చేస్తున్నారు. మరోవైపు 3312 మంది లబ్ధిదారుల వివరాల సేకరణకు బుధవారం నుంచి సర్వే చేపట్టనున్నాను. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. హౌసింగ్ ఫర్ ఆల్... కేంద్ర ప్రభుత్వం మున్సిపాల్టీల్లో నివసించే వారందరికీ పక్కాఇళ్ల నిర్మాణం కోసం ‘అందరికీ ఇళ్లు-ప్రధానమంత్రి ఆవాస్ యోజన’ పథకం చేపట్టింది. పథకం కింద గుడివాడ పట్టణానికి రూ.182కోట్లు అంచనా వ్యయంతో 3312 మంది లబ్ధిదారులకు జీప్లస్-2 నిర్మాణంతో భవంతులు నిర్మించి ఇవ్వనున్నారు. గుడివాడ పట్టణం శివారులో ఉన్న 77.46 ఎకరాలు ప్రభుత్వ భూమిలో ఈ భవంతులు నిర్మించనున్నారు. 138 బ్లాకులుతో ఒక్కొబ్లాకులో 24 ఇళ్లు ఉంటాయని చెబుతున్నారు. ఒక్కొ ఇంటికి సుమారు రూ.4.80 లక్షలు వ్యయం అవుతుండగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వాటాలతోపాటు లబ్ధిదారుని వాటా, బ్యాంకు రుణం ఉంటుందని అధికారులు చెప్పారు. జిల్లాలోని అన్ని మున్సిపాల్టీల కన్నా ముందుగానే డీపీఆర్‌ను సిద్ధం చేసిన అధికారులు బుధవారం ఢిల్లీ బయలుదేరుతున్నారు.
నేటి నుంచి సర్వే
గుడివాడ పట్టణంలో 3312 మంది లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. గతంలో ఇంది రమ్మ పథకం ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు ఈ జాబితాలో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. లబ్ధిదారులు ఎంపిక చేసి దాదాపు మూడేళ్లు గడుస్తున్నందున ఎవరెవరు ఎక్కడ ఉంటున్నారు. వారి వివరాలు సేకరించేందుకుగాను మున్సిపల్ అధికారులు బుధవారం నుంచి సర్వే నిర్వహించనున్నారు. లబ్ధిదారుల ఆధార్‌కార్డునెం బ రు, బ్యాంకు ఖాతా నెంబరు, రేషన్‌కార్డు, సామాజిక వివరాలు, ఆదాయ ధ్రువీకరణ వంటివి సేకరిస్తారు. ఎవరైనా చనిపోతే వారి వారసులకు ఇచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
అధికారులతో చైర్మన్ సమీక్ష
మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు మంగళవారం అధికారులతో సమీక్షించారు. లబ్ధిదారుల జాబితాను మున్సిపల్ కార్యాలయం నోటీసు బోర్డులోను, ఆయా వార్డుల్లో కౌన్సిలర్లుకు అందిస్తామని చెప్పారు. ప్రతి ఒక్కరూ దీనిపై సర్వే బృందానికి సమగ్ర సమాచారం అందించాలని కోరారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, టీపీవో శేషగిరిరావు, ఎంఈ చౌదరి, కౌన్సిలర్లు చోరగుడి రవికాంత్, బాజీబాషా, పొట్లూరి కృష్ణారావు పాల్గొన్నారు.