'చిత్తూరు ఎన్కౌంటర్పై 10లోగా నివేదిక ఇవ్వండి'
హైదరాబాద్: చిత్తూరు జిల్లా శేషాచల అడవుల్లో ఎర్రచందనం కూలీలను ఎన్కౌంటర్ చేసిన ఘటనపై హైకోర్టు.. ఆంధ్రప్రదేశ్ డీజీపీ జేవీ రాముడుకు నోటీసులు జారీ చేసింది. ఎన్కౌంటర్ ఘటనపై ఈ నెల 10 లోగా నివేదిక సమర్పించాలని డీజీపీని ఆదేశించింది.
చిత్తూరు జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో 20 మంది ఎర్రచందనం కూలీలు మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై హైకోర్టులో లంచ్మోషన్ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ను న్యాయవాది రఘునాథ్ బుధవారం హైకోర్టులో దాఖలు చేశారు. ఈ పిటిషన్ను విచారించిన న్యాయస్థానం డీజీపీకి నోటీసు జారీచేసింది.
ఈ కేసును శుక్రవారం మళ్లీ విచారణ జరగనుంది. మృతదేహాలను సరైన పద్ధతిలో సంరక్షించి పోస్టుమార్టం చేయాలని హైకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు గౌరవ ప్రదంగా అప్పగించాలని సూచించింది. శవ పరీక్ష చేసే డాక్లర్ల వివరాలను కోర్టుకు సమర్పించాలని పేర్కొంది. అసహజ మరణాలుగా కేసులు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశించింది.