సాక్షి ప్రతినిధి, నెల్లూరు: శేషాచలంలో ఎర్రచందనం కూలీల ఎన్‌కౌంటర్.. తర్వాత నెలకొన్న ఉద్రిక్త పరిణామాలతో స్మగ్లర్ల మూలాలపై ఉన్నతాధికారులు దృష్టిసారించారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌లో జిల్లాకు చెందిన 150 మంది అధికారుల పాత్ర ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. పోలీసులు, అటవీ, మీడియా ప్రతినిధుల పాత్ర కూడా ఉన్నట్లు తెలిసింది. ఆ కోణంలో విచారణ ప్రారంభించినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. చిత్తూరు, వైఎస్సార్ కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లా అటవీ ప్రాంతంలో ఉన్న ఎర్రచందనం చెట్లను నరికి కొందరు అక్రమంగా తరలించి సొమ్ముచేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ అక్రమ రవాణాలో ఓ ఎమ్మెల్యే, పోలీసు, అటవీ అధికారుల హస్తం ఉన్న ట్లు సమాచారం. నెల్లూరు జిల్లాలో ఉన్న ఎర్రచందనం చెట్లు స్మగ్లర్ల దెబ్బకు దాదా పు కనిపించకుండా పోయాయి. అయితే పక్క జిల్లాల నుంచి ఎర్రచందనం దుంగలను తీసుకొచ్చి జిల్లా సరిహద్దుల్లో దాచి ఉంచి.. అధికారుల సహకారంతో ఇతర రాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.
శేషాచలంలో జరిగిన కూలీల ఎన్‌కౌంటర్‌తో ఉన్నతాధికారులు స్మగ్లింగ్ మూలాలపై దృష్టిసారించారు. అందులో భాగంగా చిత్తూరు జిల్లా గుడిపాల వద్ద ఎర్రచందనం ప్రధాన స్మగ్లర్ శరవణన్‌ను పట్టుకున్న విషయం తెలిసిందే. అతని ద్వారా ఇంటిదొంగల గురించి ఆరా తీస్తున్నట్లు తెలిసింది. అధికారుల సమాచారం మేరకు జిల్లాలో అధికారపార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే, అటవీ, పోలీసు, విలేకరులపై విచారణ ప్రారంభించినట్లు తెలిసింది.
ఆ నాలుగు సర్కిళ్ల పరిధిలోనే...
జిల్లాలో వెంకటగిరి, ఆత్మకూరు, సూళ్లూరుపేట, నాయుడుపేట సర్కిళ్ల పరిధిలోనే ఎక్కువగా ఎర్రచందనం అక్రమరవాణాకు అవకాశాలు ఉన్నాయి. అందుకే ఆ ప్రాంతానికి చెందిన అధికారులపై ప్రధానంగా దృష్టిసారించినట్లు విశ్వసనీయ సమాచారం. గతంలో పనిచేసిన అధికారుల పాత్రపైనా ఆరా తీస్తున్నట్లు తెలిసింది.
అటవీశాఖకు చెందిన డీఆర్వోను ఒకరిని ఎర్రచందనం అక్రమరవాణా కేసులో ఐదునెలల క్రితం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే అతన్ని ఒకటో ముద్దాయి నుంచి ఏ 30కి చేర్చినట్లు సమాచారం. అదే విధంగా మర్రిపాడుకు చెందిన ఓ టీడీపీ కార్యకర్త ఒకరు పట్టుబడితే అతన్ని 14వ ముద్దాయిగా చూపించినట్లు సమాచారం. ఓ మామిడితోటలో ఎర్రచందనం డంప్ దొరికితే ఆ రైతు నుంచి పోలీసు అధికారి ఒకరు రూ.1.60 లక్షలు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎర్రచందనం దుంగలు దొరికింది ఓ చోట అయితే.. మరోచోట దొరికినట్లు చూపించి రివార్డులు అందుకున్న పోలీసులు కొందరు ఉన్నట్లు విమర్శలు ఉన్నాయి.
ఇలా జిల్లాలో నాలుగు సర్కిళ్ల పరిధిలో పోలీసులు కేసులను తారుమారు చేసి పెద్దమొత్తంలో ముడుపులు పుచ్చుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందులో జిల్లాకు చెందిన అధికారులు, నాయకుల పాత్ర ఉందనే కోణంలో ఉన్నతాధికారులు విచారణ చేస్తున్నట్లు తెలియటంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు తప్పించుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. ఎర్రచందనం అక్రమరవాణాకు సంబంధించిన మూలాలన్నీ నెల్లూరు జిల్లాలోనే ఉన్నాయని బహిర్గతం కావటంతో జిల్లా పోలీసు యంత్రాంగం ఉలిక్కిపడింది. ఇంటిదొంగలను బయటపెట్టి పోలీసుశాఖను పూర్తిగా ప్రక్షాళన చేసే దిశగా ఎస్పీ గజరావు భూపాల్ చర్యలు చేపట్టినట్లు సమాచారం. అందులో భాగంగా ఎస్పీ బుధవారం జిల్లాలో నాలుగు సర్కిళ్ల పరిధిలో పనిచేస్తున్న వారిపై రహస్య విచారణ జరుగుతున్నట్లు తెలిసింది.
ఇంటి దొంగలపై కన్ను
Published Thu, Apr 23 2015 3:48 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
Advertisement
Advertisement