ఓడిపోయిన మమ్మల్ని ఎందుకు ఆహ్వానిస్తారు ?
హైదరాబాద్: ఎన్నికల్లో ఓడిపోయిన మమ్మల్ని బీజేపీ ఎందుకు ఆహ్వానిస్తుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ విలేకర్లను ప్రశ్నించారు. బీజేపీలో చేరాల్సిందిగా ఆ పార్టీ నేతలు ఎవరూ తమను సంప్రదించలేదని స్పష్టం చేశారు. సోమవారం హైదరాబాద్లో బొత్స సత్యనారాయణ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతుండగా మీరు త్వరలో కాషాయం తీర్థం పుచ్చుకుంటారని ప్రచారం జరగుతుందని.. దీనిపై మీ స్పందన ఏమిటని ఆయన్ని విలేకర్లు ప్రశ్నించారు.
దాంతో బొత్స పై విధంగా స్పందించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... ఏపీ రాజధాని నిర్మాణం కోసం ఎంపిక చేసిన గ్రామాల్లో పంట పొలాలను ధ్వంసం చేయడం సంఘ విద్రోహచర్య అని బొత్స అభివర్ణించారు. ఈ దుశ్చర్యకు బాధ్యులెవరన్నది వెంటనే బయటపెట్టాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.లేదంటే ఈ దురగతానికి పాల్పడింది ప్రభుత్వమే అని భావించాల్సి ఉంటుందని బొత్స అభిప్రాయపడ్డారు.