సాక్షి, హైదరాబాద్: ఐఏఎస్ అధికారి అనంతరాము రాష్ట్రప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు. రవాణా శాఖ కమిషనర్‌గా ఉన్న తనను సాంఘిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేయడాన్ని సవాలు చేస్తూ క్యాట్‌ను ఆశ్రయించారు. దీనిపై ఆయనకు అనుకూలంగా క్యాట్ ఉత్తర్వులు వెలువరించింది. ముఖ్యమంత్రి పదవికి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి రాజీనామా చేయడానికి రెండు రోజుల ముందు పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేశారు. రవాణా శాఖ కమిషనర్‌గా ఉన్న అనంతరాము ఆ పోస్టులోకి వచ్చి 15 నెలలు పూర్తికాకుండానే సాంఘిక సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శిగా బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో తనను ఎక్కడా సరిగా బాధ్యతలు నిర్వహించకుండా తరచూ బదిలీ చేస్తుండడంతో మనస్తాపానికి గురైన అనంతరాము శుక్రవారం కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్(క్యాట్)ను ఆశ్రయించారు.
ఒక అధికారి బదిలీ అయ్యాక రెండేళ్లపాటు మరోచోటకు బదిలీ చేయరాదంటూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఆయన ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. బదిలీలపై ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఒక ఐఏఎస్ అధికారి క్యాట్‌ను ఆశ్రయించడం ఇదే తొలిసారి. ఈ మధ్యనే కర్నూలు జిల్లా ఎస్పీ మూడు నెలలు కూడా తిరగకముందే అక్కడ నుంచి బదిలీ చేయడంపై క్యాట్‌ను ఆశ్రయించడంతో ఆయనకు అనుకూలంగా క్యాట్ తీర్పునివ్వడం విదితమే. తాజాగా ఐఏఎస్ అధికారి అనంతరాము తన బదిలీ అక్రమమంటూ క్యాట్‌ను ఆశ్రయించడంతో.. ఆయనకు అనుకూలంగా క్యాట్ ఉత్తర్వులు వెలువరించింది. ఆయన్ను బదిలీ చేయకుండా స్టే ఉత్తర్వులిచ్చింది.