ఫైన్‌గా దోపిడీ! | In raismillu steam rice | Sakshi
Sakshi News home page

ఫైన్‌గా దోపిడీ!

Published Tue, Jun 24 2014 2:04 AM | Last Updated on Sat, Sep 2 2017 9:16 AM

ఫైన్‌గా దోపిడీ!

ఫైన్‌గా దోపిడీ!

అనంతపురానికి చెందిన నిరంజన్ ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగి. మధ్యాహ్నం విధులు ముగించుకుని ఇంటికి వచ్చి భోజనం వడ్డించమన్నాడు భార్య లక్ష్మిని. ప్లేట్లో అన్నం పెట్టగానే నిరంజన్ చేత్తో కలపగా ముద్దముద్దగా అనిపించింది. ‘ఇదేంటి.. అన్నం ఇలా ఉంది.. ఇలా వండావేంటి’ అంటూ భార్యపై చిందులేశాడు. ‘అరే నాపై చిందులేస్తారేంటండీ.. పాత బియ్యమంటూ తెచ్చింది మీరే కదా? అప్పటికీ నీళ్లు తక్కువగా పోసి వండాను.. అయినా ఇలా అయ్యింది.. దానికి నన్నేమి చేయమంటారు’ అంటూ నిట్టూర్చింది లక్ష్మి. జిల్లాలో పలువురు వ్యాపారులు ఈ తరహా బియ్యం అంటగడుతుండటం వల్ల నిత్యం పెద్ద సంఖ్యలో ప్రజలు మోసపోతున్నారు.
 
అనంతపురం :  
కొందరు వ్యాపారులు-మిల్లర్లు ధనార్జనే ధ్యేయంగా కొత్త ధాన్యాన్ని ఆవిరిపట్టి (స్టీమ్) సోనామసూరి పాత బియ్యంగా మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఈ బియ్యంలో కొంత పాత బియ్యం కూడా కల్తీ చేయడంతో అన్నం ముద్దముద్దగా అవుతోంది. ఇదంతా తెలీని వినియోగదారులు గృహిణులపై చిర్రుబుర్రులాడుతున్నారు. మరోవైపు భోజన హోటళ్లన్నీ ఈ బియ్యం కోసం ఎగబడుతుండడం గమనార్హం. జిల్లా వ్యాప్తంగా బోరు, బావుల కింద రబీలో 15,124 హెక్టార్లు, ఖరీఫ్‌లో 30వేల హెక్టార్లలో వరి సాగు చేస్తారు. గత ఏడాది ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో సాగైన వరిని ఈ ఏడాది జనవరి, మార్చి నెలల్లో కోత కోశారు. అయితే తీవ్రవర్షాభావ పరిస్థితులతో భూగర్భ జలాలు అడుగంటి దిగుబడి దారుణంగా పడిపోయింది. సాధారణంగా ఎకరాకు 35 బస్తాల ధాన్యం రావాల్సి ఉండగా 20 బస్తాలకే పరిమితమైంది. పంట దిగుబడులు పెద్దగా లేకపోవడంతో జిల్లాలో 90 రైస్ మిల్లుల్లో దాదాపు 60 మూతపడ్డాయి. జిల్లాలో సన్నబియ్యం  వాడకం దారులు దాదాపు 20 లక్షల నుంచి 25 లక్షల మంది ఉన్నారు. రేషన్‌షాపుల నుంచి తీసుకుంటున్న బియ్యాన్ని అల్పాహారాల (ఇడ్లీ, దోసె, పొంగల్, వడియాలు ఇతరత్రా) తయారీకి వాడుకుంటున్నారు. అన్నం కోసం సన్నబియ్యాన్ని మార్కెట్‌లో కొనుగోలు చేస్తున్నారు. సన్న బియ్యం వాడకం దారులు ఎక్కువ కావడం, జిల్లాలో పంట సరిగా లేకపోవడంతో ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు.

మద్దతు ధర లేక కర్ణాటకలో విక్రయం

గత రబీలో జిల్లాలో కల్లూరు, డీ హీరే హాళ్, మడకశిర, ధర్మవరం, కణేకల్లు, పామిడి, గుత్తి, కళ్యాణదుర్గం ప్రాంతాల్లో రైతులు పండించిన వరి ఈ ఏడాది జనవరి, మార్చి, ఏప్రిల్ మాసాల్లో కోత కోశారు. అయితే రైతులు వరిని తూర్పువేసి ధాన్యం బస్తాలను విక్రయాలకు సిద్ధం చేసుకోగా మద్దతు ధర లభించక పోవడంతో చేసేది లేక 70 శాతం మంది పొరుగునే ఉన్న కర్ణాటక ప్రాంతానికి తరలించారు. రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ఐకేపీ ఆధ్వర్యంలో కణేకల్లు, కల్లూరు, ధర్మవరం, కళ్యాణదుర్గం, వేములపర్తి (బ్రహ్మసముద్రం మండలం), నీలకంఠాపురంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. క్వింటాలు ధాన్యం (సన్నరకం)కు రూ.1310 మద్దతు ధరగా నిర్ణయించారు. ఈ ధర రైతులకు ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదు. కేవలం కణేకల్లులో మాత్రమే గడిచిన నెల రోజుల్లో 1020 క్వింటాళ్లు మాత్రమే రైతులు విక్రయించారు. మిగిలిన కేంద్రాలు రైతులు లేక వెలవెలబోయాయి. ధాన్యం సన్న రకానికి బహిరంగ మార్కెట్‌లో మిల్లర్లు, వ్యాపారులు రూ.1500 చెల్లిస్తున్నారు. అయితే కర్ణాటకలోని బళ్లారిలో క్వింటాలుకు రూ.1900 వరకు చెల్లిస్తుండడంతో కణేకల్లు, డీ హీరేహాళ్, మడకశిర, కళ్యాణదుర్గం ప్రాంతాలకు చెందిన రైతులు ఎక్కువగా బళ్లారికి వెళ్లి ధాన్యాన్ని విక్రయించారు. పామిడి, కల్లూరు, ధర్మవరం, గుత్తి తదితర ప్రాంతాల రైతులు మాత్రం స్థానికంగానే క్వింటాలు రూ.1500 చొప్పున వ్యాపారులు, మిల్లర్లకు విక్రయిస్తున్నారు.

స్టీమ్ బియ్యం దిగుమతి ఇలా

 రైతుల నుంచి కొనుగోలు చేసిన బియ్యాన్ని వ్యాపారులు, మిల్లర్లు కలసి పాతబియ్యంలాగా మార్చేస్తున్నారు. గార్లదిన్నెలోని ఓ రైస్‌మిల్లులో స్టీమ్ బియ్యం (ధాన్యాన్ని ఆవిరి ద్వారా బియ్యంగా మార్చడం) సిద్ధం చేస్తున్నారు. అయితే జిల్లా ప్రజలు, హోటళ్ల అవసరాలకు ఈ బియ్యం సరిపోకపోవడంతో కర్నూలు జిల్లా కర్నూలు, నంద్యాల, ఆదోనితో పాటు గుంటూరు, వరంగల్, మిర్యాలగూడ, పొద్దుటూరు, తాడేపల్లి గూడెం నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. జిల్లాకు బియ్యం డిమాండ్ ఎక్కువగా ఉండడంతో అక్కడి మిల్లర్లు సైతం స్టీం బియ్యాన్నే జిల్లాకు ఎగుమతి చేస్తున్నారు.

ఈ బియ్యాన్ని జిల్లాలోని మిల్లర్లు, వ్యాపారులు కిలో రూ.25 నుంచి రూ.30 మధ్య కొనుగోలు చేస్తున్నారు. బియ్యం కొనుగోలు, రవాణా, ఇతరత్రా ఖర్చులు కలుపుకుని ఫైన్ బియ్యం అంటూ కిలో రూ.34 నుంచి 35 వరకు విక్రయిస్తున్నారు. మరి కొందరు ఈ స్టీమ్ బియ్యంలోకి కొద్ది మోతాదులో ఏడాది క్రితం పాత బియ్యాన్ని కలుపుతూ మొదటి రకం (పాత) అంటూ కిలో రూ.44-45 మధ్య విక్రయిస్తున్నారు. దీనిపై అధికారుల నిఘా లేకపోవడంతో వ్యాపారులు చెలరేగిపోతున్నారు.  
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement