ఉక్కిరిబిక్కిరి | Intensive power cuts in villages | Sakshi
Sakshi News home page

ఉక్కిరిబిక్కిరి

Published Wed, Oct 23 2013 2:02 AM | Last Updated on Tue, Sep 18 2018 8:28 PM

Intensive power cuts in villages

సాక్షి, రంగారెడ్డి జిల్లా : లోడ్ రిలీఫ్(ఎల్‌ఆర్) పేరిట ట్రాన్స్‌కో తలపెట్టిన కరెంటు కోతలు సామాన్యుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వారం రోజులుగా కరెంటుకోతలు విపరీతమయ్యాయి. మూడు రోజులక్రితం ఈ కోతలను అధికారికంగా ప్రకటించినప్పటికీ.. అనధికారికంగా మరింత సమయం కోతలు పెట్టడంతో రోజువారీ కార్యకలాపాలకు ఆటంకం కలుగుతోంది. మరోవైపు చిన్నతరహా, కుటీర పరిశ్రమలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. విద్యుత్తు ఉత్పత్తి తగ్గడంతో ఈ కోతలు పెడుతున్నట్లు ట్రాన్స్‌కో పేర్కొంటుండగా.. వనరుల వినియోగంలో సర్కారు ఉదాసీనత ఫలితంగానే కరెంటు కటకట తలెత్తిందని స్పష్టమవుతోంది.
 
జిల్లాలో 15,13,024 విద్యుత్ కనెక్షన్లున్నాయి. వీటిలో 83,229 వ్యవసాయ కనెక్షన్లు, గృహాలకు 12.46 లక్షలు, వాణిజ్య పరమైనవి 1.49లక్షల కనెక్షన్లు ఉన్నాయి. అదేవిధంగా 20,659 పరిశ్రమ కనెక్షన్లున్నాయి. వీటికి సగటున 21.5 మిలియన్ యూనిట్ల విద్యుత్తు అవసరం. అయితే ప్రస్తుతం దాదాపు 18 మిలియన్ యూనిట్ల విద్యుత్తు మాత్రమే సరఫరా చేస్తున్నట్లు ట్రాన్స్‌కో అధికారులు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం ఇంతకు తక్కువగా సరఫరా అవుతోంది. దీంతో అధికారిక కోతలకు మించి కరెంటు సరఫరా నిలిచిపోతోంది. బొగ్గు సరఫరాలో అంతరాయంతో థర్మల్ ప్రాజెక్టుల్లో విద్యుత్ ఉత్పత్తి తగ్గగా.. జల విద్యుత్ ప్రాజెక్టుల్లో సరఫరాను నిలిపివేయడంతో విద్యుత్‌లోటు ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు.
 
అనధికారిక కోతలు
ట్రాన్స్‌కో గణాంకాల ప్రకారం పట్టణ ప్రాంతాలు, మండల కేంద్రాల్లో నాలుగు గంటలు మాత్రమే సరఫరా నిలిపివేయాలి. ఇందులో రెండు దఫాలుగా రెండుగంటల చొప్పున కోతలు విధించాల్సి ఉంటుంది. అయితే ఏకధాటిగా  మూడు గంటలపాటు కోతలు పెట్టడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. అధికారికంగా రెండుగంటలే అయినప్పటికీ.. అప్రకటితంగా వరుసగా మూడు గంటలు సరఫరా లేకపోవడం ఇబ్బందులకు గురిచేస్తోంది. మంగళవారం ఇబ్రహీంపట్నం నగర పంచాయతీ పరిధిలో ఉదయం 9గంటల నుంచి 12గంటల వరకు సరఫరా నిలిపివేశారు. మధ్యాహ్నం 2గంటల నుంచి దఫదఫాలుగా పలుమార్లు సరఫరాలో కోతలు పెట్టారు. అధికారికంగా నాలుగు గంటలే అయినప్పటికీ.. అనధికారిక కోతలతో జనాలు బెంబేలెత్తుతున్నారు. ఇక గ్రామాల్లో పగటిపూట సరఫరా పూర్తిగా నిలిచిపోతోంది.
 
కూలీలు కుదేలు..
కరెంటు కోతలు అన్నివర్గాల ప్రజలను ఇబ్బందుల్లో పడేస్తున్నాయి. ప్రస్తుతం రబీ సీజన్ ఊపందుకుంది. వరి నాట్లువేసే సమయం కావడంతో పొలాలకు అవసరమైనంత నీరు పెట్టాల్సి ఉంటుంది. అయితే తాజా కోతలతో మడికి తడి పెట్టలేని పరిస్థితి ఉందని, గత ఏడాదిన్నరగా బోరు ఎండిపోవడంతో సాగు పనులే మానేశానని, ఇప్పుడు కూడా సాగు చేయడం కష్టమేనని యాచారం మండలం చింతపట్ల గ్రా మానికి చెందిన యాదయ్య అనే రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. సాగు పనులు స్తంభించిపోవడంతో కూలీల కు సైతం పని దొరకడం లేదు. మరోవైపు విద్యు త్ ఆధారిత వర్క్‌షాప్‌లు, ఇంటర్నెట్, మీసేవ కేంద్రాలు, నూర్పి డి యంత్రాలు నడిపే వ్యాపారులు నష్టపోతున్నారు. కరెంటు లేని సమయం లో కొందరు జనరేటర్లను నమ్ముకుం టున్నారు. ఇంధన వ్యయాన్ని కలిపి వినియోగదారుడి నుంచి వసూలు చేస్తున్నారు. పరిగి మండల కేంద్రంలో ఒక్క కాపీ జీరాక్స్‌కు ఏకంగా రూ.3 వసూలు చేస్తుండడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement