బిజినేపల్లి, న్యూస్‌లైన్: అమ్మా...నేను పుట్టి ఇరవై రోజులే అయ్యింది. తనివితీరా నీ పొ త్తిళ్లలో బజ్జున్న దాఖలాలూ లేవు. ప్రేమతో నీవిచ్చే స్తన్యాన్ని ఆకలితో జుర్రుకుందీ లేదు. అప్పుడే నేనంటే నీకు విరక్తా...లేకుంటే ఆడబిడ్డనని భారమయ్యానా..? నా బదులు ఓ బాబు నీ కడుపున పుట్టి ఉంటే ఇలా వదిలించుకోవాలనుకునే దానివా..? నువ్వు సమాధానం చెప్పలేవు. బదులిచ్చే జవాబులు లేవు.
ఇదీ ఓ పసికందు హృదయస్పందనలు. తనకు తెలీకుండానే అమ్మకానికి పెట్టిన తల్లిని నిలదీస్తూ వినిపించిన ఘోష. స్థానికులను కదిలించిన ఈ సంఘటన ఇలా... శనివారం మధ్యాహ్నం..అంతా ఎవరి పనుల్లో వారున్నారు. ఇక్కడ వారికి పెద్ద దిక్కుగా ఉన్న దవఖానా ముందు ఓ కారు సరిగ్గా 3.30 గంటల సమయంలో ఆగింది. అందులోనుంచి దిగిన ఒకామెకు ఆసుపత్రి సిబ్బంది ఎదురొచ్చి కాసేపు ఆగమని చెప్పారు. వారి రాక కోసమే నిరీక్షిస్తున్న ఓ తల్లి తన 20 రోజుల బిడ్డతో సహా అక్కడికి వచ్చింది.
వారితో బిడ్డ అమ్మమ్మ కూడా వచ్చింది. ముందనుకున్న ఒప్పందం మేరకు ఆ బిడ్డ అమ్మకానికి బేరం కుదిరింది. ఆమెను కన్నతల్లి పేరు రజియా బేగం. భర్తతో విభేదాల కారణంగా అతను లేడు. ఆమె ఇదే ఆసుపత్రిలో ఆ చిన్నారిని ప్రసవించింది. అప్పుడే తాను పేద కూలీనని బిడ్డను పెంచే స్థోమత లేదని ఆసుపత్రి సిబ్బందికి చెప్పుకుంది. ఆమె కథను విన్న ఓ ఎన్‌ఎం ఆ శిశువును పిల్లలు లేని వారికి అప్పగిస్తే బాగుంటుందని చెప్పి ఆ అన్వేషణలో పడింది.
ఇంతలో ఎలా తెలుసుకుందో అచ్చెంపేటకు చెందిన మహిళ ( ఆమె మాత్రం తనది హైదరాబాదని చెప్తోంది) ఆ చిన్నారిని కొనేందుకు ముందుకు రావడంతో పీహెచ్‌సీ ముందే ఈ తతంతగం శనివారం బాహాటంగానే సాగింది. అయితే ఈ వ్యవహారాన్ని అక్కడికి సమీపంలోనే ఉండి గమనిస్తున్న స్థానిక మహిళలు మణెమ్మ, బౌరమ్మ, పార్వతమ్మలు కార్లో చంటిపాపను తీసుకెళ్తుండగా వెంటనే స్పందించి అడ్డుకున్నారు. విషయాన్ని కాస్తా ఫోన్‌ద్వారా పోలీసులకు తెలియచేశారు. దీంతో ప్రొబిషనరీ డీఎస్పీ బాషా చంటిపాపతో సహా రజియాను, ఆమె తల్లిని ,కొనుగోలుకు వచ్చిన మహిళను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించారు.
వారిని గట్టిగా హెచ్చరించారు. ఆర్థిక స్తోమత లేని కారణంగానే అమ్మకానికి తెగించినట్లు రజియా చెప్పడంతో బిడ్డను ఐసీడీఎస్ ద్వారా సోమవారం శిశువిహార్‌కు తరలించేందుకు ఏర్పాట్లు పోలీసులు చేశారు. ఈ సందర్భంగా వెళ్లిన విలేకరులపైనా ‘ మా బిడ్డను మేం అమ్ముకుంటే మీకేం’ అని విరుచుకు పడడం విశేషం. మొత్తానికి ఇలా లోకం పోకడే తెలియని ఆ పసికందు అందరూ ఉండి అమ్మ ఒడినుంచి అనాథల ఖాతాలోకి వెళ్లిపోయింది. ఆ తల్లికి పోషణ భారాన్ని దించేసినా మారుతున్న ధోరణులు అద్దంపడుతోంది. అనేక ప్రశ్నలు మౌనంగానే సంధిస్తోంది.
తప్పెవరిదమ్మా...!
Published Sun, Jan 19 2014 3:56 AM | Last Updated on Tue, Aug 21 2018 9:20 PM
Advertisement
Advertisement