వృద్ధురాలికి పాదాభివందనం చేసిన జడ్జి | jude feels sad for delay justice in visakapatnam | Sakshi
Sakshi News home page

వృద్ధురాలికి పాదాభివందనం చేసిన జడ్జి

Published Sun, Jul 9 2017 8:27 AM | Last Updated on Tue, Sep 5 2017 3:38 PM

jude feels sad for delay justice in visakapatnam

34 ఏళ్లకు న్యాయం లభించిందని ఆ తల్లి మురిసిపోయింది.. కానీ దాన్ని అందించినందుకు న్యాయదేవత ఏమాత్రం గర్వపడలేదు.. పైగా సిగ్గు పడింది.. ఆలస్యమైనందుకు మన్నించమని శిరసు వంచి వేడుకుంది. మురిసిపోయిన ఆ తల్లి ఓ రిటైర్డ్‌ ప్రిన్సిపాల్‌ సతీమణి కాగా.. న్యాయం చేసిన ఆ న్యాయాధికారిణి జిల్లా ప్రధాన న్యాయమూర్తి వెంకట జ్యోతిర్మయి.

జాప్యానికి మన్నించమ్మా..!
ఒకటా.. రెండా దాదాపు మూడున్నర దశాబ్దాల పోరాటం. తమకు ప్రభుత్వం నుంచి న్యాయంగా రావలసిన సొమ్ము కోసం న్యాయస్థానం చుట్టూ ప్రదక్షిణలు చేశారు వృద్ధ దంపతులు. ఈలోగానే భర్త కాలం చేసినా.. ఆమె కోర్టు వాయిదాలకు తిరుగుతూనే ఉన్నారు. ఎట్టకేలకు ఆమె వ్యధ ఓ న్యాయమూర్తిని కదిలించింది. ఇక ఆ న్యాయమూర్తి విశ్రమించలేదు.. ప్రభుత్వ యంత్రాంగాన్ని పరుగులు తీయించారు. వృద్ధురాలికి సత్వర సాయంతో పాటు గడువులోపు పూర్తిఫలం అందేలా చేశారు. అంతేనా ఇన్నాళ్ల జాప్యాన్ని మన్నించమంటూ తన హోదాను మరిచి ఆ మాతృమూర్తి పాదాలకు అభివందనం చేశారు. ఆమె ..జిల్లా ప్రధాన న్యాయమూర్తి జ్యోతిర్మయి. జిల్లా కోర్టులో శనివారం నిర్వహించిన మెగా లోక్‌ అదాలత్‌లో ఆవిష్కృతమైన దృశ్యమిది..

విశాఖపట్నం ‌:
జిల్లా కోర్టులో 34 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఓ కేసును పరిష్కరించి ఓ మాతృమూర్తికి సాంత్వన కలిగించారు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జ్యోతిర్మయి. ఉద్యోగ విరమణ అనంతరం రావలసిన సొమ్ము సక్రమంగా అందక కోర్టులో మగ్గుతున్న కేసుకు రాజీ చేసి అందర్నీ ఆకర్షించారు. వివరాలివి.. రాజేశ్వరి భర్త పార్వతీశం హిందూస్థాన్‌ షిప్‌యార్డ్‌ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌. మేనేజ్‌మెంట్‌ జోక్యాన్ని సహించలేక విధులకు దూరంగా ఉన్న పార్వతీశంను యాజయాన్యం సర్వీసు ఉండగానే అకారణంగా 1982లో పదవి నుంచి తొలగించింది.

న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో వాదనలు విన్న కోర్టు పార్వతీశంకు అనుకూలంగా తీర్పునిచ్చింది. విధుల్లో చేరేలోగానే 1984లో రిటైర్‌ అయ్యారాయన. రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ కోసం న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చినా వివిధ కారణాలు చూపుతూ ఆయనకు రావలసిన బెనిఫిట్స్‌ నిలుపుదల చేసింది. ఇందులో జిల్లా విద్యాశాఖ పాత్ర సింహభాగం. 1984 నుంచి జిల్లా కోర్టులోనే వివాదం పెండింగ్‌లో ఉంది. ఆ ప్రతిఫలం అందకుండానే 2004లో పార్వతీశం మరణించారు.  అప్పటి నుంచి ఆయన భార్య రాజేశ్వరి (86) కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఈ కేసు విషయం జిల్లా జడ్జి జ్యోతిర్మయి దృష్టికి వచ్చింది. ఆమె విద్యాశాఖ అధికారులతో మాట్లాడారు. ఫిర్యాదికి రావలసిన బకాయిలు, ఇతర ప్రతిఫలాన్ని తక్షణమే చెల్లించే విధంగా చేశారు. న్యాయమూర్తి సూచనలతో దిగివచ్చిన అధికారులు పూర్తి ఫలాలు అందించేందుకు 30 రోజుల గడువు కోరారు. ముందుగా కొంతమొత్తాన్ని బాధితురాలికి శనివారం అందించారు.

86ఏళ్ల జిల్లా కోర్టు చరిత్రలో ప్రథమం
న్యాయస్థానం చుట్టూ దశాబ్దాల తరబడి తిరిగిన రాజేశ్వరికి పాదా భివందనం చేశారు జడ్జి జ్యోతిర్మయి. జాప్యాన్ని మన్నించాలని కోరారు. 1931లో జిల్లా కోర్టు ఏర్పాటు చేసిన తర్వాత ఇన్నేళ్ళలో ఇటువంటి సంఘటన జరగడం ఇదే తొలిసారి. ఈ దృశ్యం కోర్టు ప్రాంగణంలో ప్రతీ ఒక్కరినీ కదిలించడమే కాదు.. ఆలోచింపజేసింది. మరోవైపు వృద్ధురాలు కన్నీటి పర్యంతమయ్యారు. తన జన్మలో ఇలాంటి రోజు వస్తుందని ఊహించలేదన్నారు. జడ్జికి కృతజ్ఞతలు తెలిపారు.  

న్యాయఫలం.. అందరికీ సమం
సమాజంలో ఆర్థిక అసమానతలు సాధారణమని.. అయితే న్యాయవ్యవస్థ ఫలాలు మాత్రం అందరికీ సమానంగా అందుతాయని విశాఖ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.వెంకట జ్యోతిర్మయి అన్నారు. జిల్లా కోర్టు ఆవరణలో జాతీయ న్యాయ సేవ సాధికార సంస్థ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన మెగా లోక్‌ అదాలత్‌ను శనివారం ఆమె ప్రారంభించారు. జడ్జి మాట్లాడుతూ వివిధ కేసుల్లో రాజీ అనేది కక్షిదారులకు గుదిబండ కాకూడదన్నారు. రాజీ సత్వర ఫలాలను అందించాలని ఆకాంక్షించారు. మెట్రోపాలిటిన్‌ సెషన్స్‌ జడ్జి ఎస్‌.నాగార్జున మాట్లాడుతూ ఉభయులు తమ వ్యాజ్యాల సత్వర పరిష్కారానికి లోక్‌ అదాలత్‌ని ఆశ్రయించడం వల్ల శాశ్వత ఫలాలు పొందవచ్చన్నారు. విశాఖ జాయింట్‌ కలెక్టర్‌ సృజన మాట్లాడుతూ వివాదాలను ఆమోదయోగ్యంగా రాజీ చేసుకోవడానికి లోక్‌ అదాలత్‌లో శాశ్వత, చట్టబద్ధమైన తీర్పులు వస్తాయన్నారు.


పౌరశిక్షస్మృతి పరిధిలోని కేసుల, ప్రభుత్వ వివాదాల పరిష్కారానికి తమవంతు సహాయం అందిస్తామన్నారు. లోక్‌ అదాలత్‌ కార్యదర్శి సనపల దామోదరరావు, కుటుంబ న్యాయస్థానం న్యాయమూర్తి కె.సాయి రమాదేవి, 2వ అదనపు జిల్లా న్యాయమూర్తి యు.సత్యారావు, సీపీ  టి.యోగానంద్, అదనపు పోలీస్‌ సూపరింటెండెంట్‌ శ్రీకాంత్, జాయింట్‌ పోలీస్‌ కమిషనర్‌ నాగేంద్రకుమార్, విశాఖ న్యాయవాదుల సం ఘం అధ్యక్షుడు పూసర్ల బాలకృష్ణ, ప్రధాన కార్యదర్శి కాం డ్రేగుల జగదీశ్వరరావు, రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ సభ్యులు, న్యాయసేవా అధికార సంస్థ సీనియర్‌ సభ్యులు హెచ్‌వీఎస్‌ ప్రసన్నకుమార్, జాతీయ శిక్షకుడు ఆర్‌.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 8 వేలకు పైగా కేసులు రాజీకి వచ్చాయి.  

కేసుల రాజీలో ఏపీలో నంబర్‌ వన్‌
విశాఖ జిల్లాలో జరిగిన మెగా లోక్‌ అదాలత్‌లో అత్యధిక సంఖ్యలో కేసులు రాజీ అయ్యాయి. రాష్ట్రంలో నంబర్‌ వన్‌ స్థానంలో నిలిచింది. శనివారం జరిగిన ఈ అదాలత్‌లో పౌర శిక్షాస్మృతి పరిధిలోని 538, క్రిమినల్‌ కేసులు 7,181, పూర్వ, ప్రాథమిక వివాదాలకు సంబంధించి 76 కేసులు రాజీ అయ్యాయి. జిల్లాలో అన్ని న్యాయస్థానాల్లో కలిపి 7,795 కేసులు రాజీ చేసి రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. దీనికి సంబంధించి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.వెంకట జ్యోతిర్మయి మాట్లాడుతూ న్యాయవాదులు, న్యాయమూర్తులు, కక్షిదారులు, సిబ్బంది, అధికారుల సహకారంతోనే ఈ స్థాయిలో నిలిచామన్నారు. ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. కక్షిదారులకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యంగా పనిచేయడంవల్ల ఈ ఫలితం లభించిందన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement