భర్త ఇంటి ఎదుట జూనియర్‌ ఆర్టిస్ట్‌ హేమ ధర్నా | Junior Artist Protest Infront of Husband House in Nellore | Sakshi
Sakshi News home page

భర్త ఇంటి ఎదుట జూనియర్‌ ఆర్టిస్ట్‌ ధర్నా

Published Tue, Dec 18 2018 1:04 PM | Last Updated on Tue, Dec 18 2018 1:04 PM

Junior Artist Protest Infront of Husband House in Nellore - Sakshi

హేమ, నవతేజ (ఫైల్‌)

నెల్లూరు, ఆత్మకూరు: భర్త ఇంటి ఎదుట హేమ అనే జూనియర్‌ ఆర్టిస్ట్‌ ధర్నా చేసిన ఘటన ఆత్మకూరు పట్టణంలో సోమవారం చోటుచేసుకుంది. బాధిత మహిళ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. అనంతపురం జిల్లా గుంతకల్‌కు చెందిన కూకట్ల హేమ టీవీ సీరియళ్లలో, చిన్న బడ్జెట్‌ చిత్రాల్లోనూ నటిస్తోంది. హేమ తల్లిదండ్రులు ఆమెను సమీప బంధువు, మేనమామకు ఇచ్చి వివాహం చేశారు. వారికి ఇద్దరు పిల్లలు. అయితే వివిధ కారణాల రీత్యా ఆమె భర్త నుంచి విడాకులు తీసుకుంది. నటనపై ఇష్టంతో హైదరాబాద్‌కు వెళ్లింది. ఆత్మకూరు క్రిస్టియన్‌పేటకు చెందిన నవతేజ 2015 నుంచి టీవీలు, సినిమాల్లో చేస్తున్నాడు. ఈ క్రమంలో అతను హేమతో పరిచయం పెంచుకున్నాడు. ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నవతేజ వేధించినట్లు హేమ చెబుతోంది. గతేడాది ఆగస్ట్‌ 4వ తేదీన ఇద్దరూ హైదరాబాద్‌లో పెద్దమ్మగుడిలో వివాహం చేసుకున్నారు. సంవత్సరంపాటు కాపురం చేసిన నవతేజ ఈ ఏడాది జూన్‌లో ఆమెను వదిలి ఆత్మకూరుకు వచ్చాడు.

దీంతో గర్భిణిగా ఉన్న హేమ ఆత్మకూరుకు చేరుకుంది. నవతేజ తల్లిదండ్రులతో తాము వివాహం చేసుకున్న విషయాన్ని చెప్పింది. ఈ క్రమంలో వారి మధ్య వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. తనపై నవతేజ చేయి చేసుకున్నాడని, దీంతో గర్భస్రావమైందని హేమ వాపోయింది. అప్పట్లో ఆత్మకూరు పోలీసుల వద్దకు వెళ్లగా వారి సలహా మేరకు హైదరాబాద్‌ సిటీలోని ఖైరతాబాద్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. అనంతరం నవతేజ, తల్లిదండ్రులు సూచనప్రాయంగా వారిద్దరూ ఉండేందుకు ఒప్పుకోవడంతో తిరిగి హైదరాబాద్‌లో కలిసి ఉంటున్నారు. రెండునెలల క్రితం భర్త నవతేజ 15 రోజుల్లో వస్తానని ఆత్మకూరుకు వచ్చాడు. హేమతో ఫోన్‌లో కూడా మాట్లాడటం మానేయడంతో సోమవారం ఆమె ఆత్మకూరులోని నవతేజ ఇంటి ఎదుట తనకు భర్తే కావాలంటూ బైఠాయించింది. సమాచారం అందుకున్న ఆత్మకూరు ఎస్సై పి.నరేష్‌ నవతేజ, హేమ, వారి తల్లిదండ్రులను స్టేషన్‌కు పిలిపించి విచారించారు. దీని విషయమై ఇప్పటికే హైదరాబాద్‌ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు కావడంతో అక్కడకు వెళ్లి విషయం తేల్చుకోవాలని ఆయన వారికి సర్దుబాటు చేసి పంపించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement