=వృథాగా పోతున్న సరస్సు నీరు
=ధ్వంసమైన కింది కాల్వల షట్టర్లు
=పట్టించుకోని అధికారులు
=ఇబ్బందులు పడుతున్న రైతులు
గోవిందరావుపేట, న్యూస్‌లైన్: అధికారుల నిర్లక్ష్యం.. రైతుల పాలిట శాపంగా మారింది. వేలాది ఎకరాల పంటల సాగుకు ఉపయోగపడుతున్న సరస్సు నీటిని నిల్వ చేయాల్సిన అధికారులు పట్టించుకోవడంలేదు. ఫలితంగా పంటలకు అందాల్సిన నీరంతా వృథాగా పోతోంది. వివరాల్లోకి వెళితే.. లక ్నవరం సరస్సుకు సంబంధించిన షట్టర్లు కొన్ని నెలల క్రితం తుప్పు పట్టి ధ్వంసమయ్యాయి. దీంతో సరస్సులోని నీరంతా సద్దిమడుగుకు కాలువ నుంచి దయ్యాలవాగు ద్వారా మేడారంలోని జంపన్న వాగుకు వృథాగా వెళ్తుండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వాస్తవంగా ఖరీఫ్, రబీ సాగు కోసం నీటి పారుదలశాఖ అధికారులు లక్నవరం పరిసర ప్రాంత రైతుల కోసం సరస్సు నీటిని సద్దిమడుగుకు విడుదల చేస్తారు. అక్కడి నుంచి నీరు నర్సింహుల కాల్వ ద్వారా నర్సింహుల-1, నర్సింహుల-2కు, రంగాపురం కాలువ ద్వారా రంగాపురం, కోట కాలువకు, శ్రీరాంపతి కాలువ వరకు వెళ్తొంది. అయితే పై కాలువలకు సంబంధించిన షట్టర్లు కొన్నేళ్ల క్రితం ధ్వంసమవడంతో లక్నవరం తూముల నుంచి నీరు వృథాగా పోతోంది. లీకేజీని దృష్టిలో ఉంచుకుని నాటి కాకతీయులు సద్దిమడుగు నుంచి నీటి విడుదలకు రూపకల్పన చేశారు.
అయితే షట్టర్లు తుప్పు పట్టిపోయి ధ్వంసం కావడంతో సద్ది మడుగులో కనీసం 9 అడుగుల నీరు కూడా నిల్వ లేదు. దీంతో కింది కాలువలకు నీరు వెళ్లే పరిస్థితి కానరావడంలేదు. ఇదిలా ఉండగా, శ్రీరాంపతి కాలువ పరిధిలోని రెండు షట్టర్లలో ఒకటి పూర్తిగా పాడైపోయింది. అయితే గత ఏడాది రబీలో ఈ కాలువకు నీరు విడుదల కాకపోతే అధికారులు లీకేజీ వద్ద మట్టిబస్తాలు వేసి ద్వారాన్ని మూసివేశారు. కాగా, కొండల మూలల వద్ద గండి పడడంతో ప్రస్తుతం ఇదే కాలువకు వెళ్లే నీటిలోని సగభాగం రంగాపురం కాలువలోకి వెళ్లి పోతోంది.
దీంతో కాలువ పరిధిలోని చివరి ఆయకట్టు రైతులు సాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. షట్టర్లు ధ్వంసమై నీరంతా వృథాగా పోతుందని సంబంధిత నీటిపారుద ల శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడంలేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఇది లా ఉండగా, వచ్చే ఫిబ్రవరిలో జరిగే మేడారం జాతరకు లక్నవరం సరస్సు నుంచే నీటిని పంపిం చాల్సి ఉంటుంది. అయితే కొన్ని నెలల నుంచి నీరు వృథాగా పోతుండడంతో జాతర సమయంలో భక్తులకు కావాల్సిన నీటిని అందించే పరిస్థితి కానరావడంలేదు.
ఉన్నతాధికారులు ప్రత్యేక చొరవ చూపి సద్దిమడుగు వద్ద మరమ్మతులు చేసి, ధ్వంసమైన షట్టర్లను తొలగించి, కొత్తవాటిని ఏర్పాటు చేస్తే వందల ఎకరాలకు ఉపయోగపడే సాగునీటిని వృథాను అరికట్టవచ్చని రైతులు కోరుతున్నారు. అలాగే ప్రస్తుతం జరుగుతున్న దయ్యాలవాగు పనులకు ఎలాంటి అంతరాయం కలుగకుండా ఉండడంతోపాటు జాతరలో భక్తులకు కావాల్సిన నీటిని అందించవచ్చు.
మేడారంలో కొత్త బ్రిడ్జి స్థలాన్ని పరిశీలించిన అధికారులు..
రూ.3కోట్లతో మేడారంలో చేపట్టిన కొత్త బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన స్థలాన్ని ఆర్‌అండ్‌బీ అధికారులు శనివారం పరిశీలించారు. 8.5 మీటర్ల వెడల్పుతో బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు వారు తెలిపారు. అయితే లక్నవరం సరస్సు నుంచి వస్తున్న నీటితో పనులకు ఆటంకం ఏర్పడుతోందని, నీటిపారుదల శాఖ అధికారులు వృథాగా పోతున్న నీటిని అరికడితే వీలైనంత త్వరగా పనులను పూర్తి చేయొచ్చని తెలిపారు.
లక్నవరానికి లీక్
Published Mon, Dec 9 2013 2:33 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement