ప్రత్యేక అవసరాల గల పిల్లలకు బోధిస్తున్న ఉపాధ్యాయులు
విజయనగరం, రామభద్రపురం, (బొబ్బిలి) :విద్యాహక్కు చట్టం ప్రకారం అందరూ చదవాలి.. అయితే సాధారణ విద్యార్థులతో పాటు ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులను ఒకేలా చూడకుండా ప్రత్యేక సడలింపులు ఇస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది. పాఠశాలల్లో ప్రత్యేక అవసరాలు గల పిల్లల హాజరు శాతం పెంచేందుకు... పరీక్షల గండం నుంచి గట్టెక్కడానికి చేయూత అందించనుంది. ఉత్తీర్ణత మార్కులను తగ్గించడంతో పాటు ప్రతి గంటకూ 20 నిమిషాల అదనపు సమయం కేటాయిస్తూ తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. దీంతో ప్రతి విద్యార్థీ ఉత్తీర్ణతను సాధించాలన్న విద్యాచట్టం, సమగ్ర శిక్షాభియాన్ ఆశయాలు నెరవేరుతాయని ఆయా శాఖల అధికారులు చెబుతున్నారు.
శారీరక, మానసిక వైకల్యాల కారణంగా ప్రత్యేక అవసరాలు గల పిల్లలు అధికశాతం చదువు మధ్యలో మానేస్తున్నారు. తరగతులు పెరిగే కొద్ది బడి మానేసే వారి సంఖ్య ఎక్కువవుతోంది. ముఖ్యంగా తొమ్మిది, పది తరగతుల్లో వీరి సంఖ్య ఎక్కువగా ఉంటుందోన్న విషయం పలు సర్వేల్లో వెల్లడైంది. ఆసక్తి ఉన్నప్పటికీ ఉత్తీర్ణతకు అవసరమైన మార్కులను సాధించలేక మరికొందరు పదో తరగతి తర్వాత చదువులను కొనసాగించలేకపోతున్నారు. జిల్లాలోని 4,789 మంది ప్రత్యేక అవసరాల పిల్లలు పాఠశాలల్లో చేరగా వారిలో 712 మంది పదో తరగతి చదువుతున్నారు. గతంలో ఆరు నుంచి ఇంటర్ వరకు చదువుతున్న అన్ని రకాల వైకల్యాలు ఉన్న విద్యార్థులకు ఉత్తీర్ణతను 35 మార్కుల నుంచి 20 కి తగ్గించారు. అలాగే ఫీజు మినహాయిస్తూ 2001, 04, 11లలో పలు జీఓలతో మార్గదర్శకాలు ఇచ్చింది. అయితే ఎస్‌ఎస్‌ఏ విలీనవిద్య యంత్రాంగం, విద్యార్థుల తల్లిదండ్రులు చేసిన విజ్ఞప్తుల మేరకు ఇప్పుడు మానసిక వైకల్యం గల పిల్లలు, ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్, పక్షవాతం ఉన్నవారికి ఉత్తీర్ణతను పది మార్కులకు తగ్గిస్తూ పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ చేసినట్లు అధికార సమాచారం.
ఉత్తీర్ణతకు ఇవీ మార్గదర్శకాలు...
ఆరు నుంచి పదో తరగతి చదువుతున్న ప్రత్యేకావసరాల గల విద్యార్థులకు అధిక శాతం విభాగాల కు మూల్యాంకనం చేసేటప్పుడు వ్యాకరణ దోషా లు, వాక్య నిర్మాణ లోపాలపై పట్టింపు ఉండదు. కాలిక్యులేటర్లు, జామెట్రీ బాక్సులు, తదితర పరీక్షలకు అవసరమైన మార్కుల శాతాన్ని అంధత్వం ఉన్న విద్యార్థులకు ఉత్తీర్ణత మార్కులను 35 నుంచి 20కు తగ్గించారు. దీంతోపాటు వినికిడి లోపం ఉన్న వారు తెలుగు, హిందీ, ఆంగ్లంలో ఏదైనా ఒక సబ్జెక్ట్ చదివితే సరిపోతుంది. ప్రత్యేక అభ్యసన లోపం గల విద్యార్థులకైతే తృతీయభాష ఆంగ్లం సబ్జెక్ట్‌ను మినహాయించారు. వీరి ఉత్తీర్ణత కోసం చిన్న లోపాలను పట్టించుకోనవసరం లేదు. బుద్ధిమాంద్యం ( మెంటల్ రిటార్డెడ్), ఎదుగుదల లోపం (ఆటిజం), మస్కిష్క పక్షపాతం (సెరిబ్రల్‌పాల్స్‌తో)తో బాధపడుతున్న విద్యార్థులకు పది మార్కులు.. మిగిలిని దృష్టిలోపం.. వినికిడి లోపం ఉన్నవారు మాత్రం 20 మార్కులు సాధించాలి. వీరికి జవాబులను రాయడానికి ప్రత్యేకమైన మందం గలిగిన జవాబుపత్రాలు ఇస్తారు. పఠనైపుణ్యం, గ్రాఫులు గీయడంతో పాటు వ్యాకరణ, వాక్యనిర్మాణ లోపాలపై మినహాయింపు ఇచ్చారు. ఎముకల బలహీనత (ఆర్థోపెడికల్ ఇంపెయిడ్) బాధితులకు పరీక్షలను రాసేందుకు సహాయకుడిని కేటాయించడంతో పాటు ప్రత్యేక బల్ల, కుర్చీ ఇస్తారు. అలాగే దృష్టి లోపంతో బాధపడుతున్నవారికి పరీక్షలకు అవసరమైన సామగ్రిని వెంట తీసుకెళ్లేందుకు మినహాయింపు ఇచ్చారు. పదో తరగతి చదువుతున్న ప్రత్యేక అవసరాలు గల పిల్లలందరికీ పరీక్ష ఫీజు ఉచితం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment