మెడికోలను కాటేసిన మృత్యువు
Published Sun, Feb 2 2014 1:52 AM | Last Updated on Tue, Oct 16 2018 2:57 PM
ఏలూరు (టూటౌన్), న్యూస్‌లైన్ :ఆ ఇద్దరూ చదువుల తల్లి ముద్దుబిడ్డలు. అన్ని తరగతుల్లోనూ ప్రథమ స్థానంలో నిలుస్తూ వచ్చారు. వైద్య విద్యను అభ్యసిస్తున్న ఆ విద్యార్థుల్లో ఒకరు వైద్యుల కుటుంబానికి చెందిన వాడు కాగా, మరో విద్యార్థి రైతు కుటుంబం నుంచి వచ్చాడు. ఇద్దరూ రెండేళ్లలో డాక్టర్ డిగ్రీలు అందుకుని తమ కలలను సాకారం చేసుకోవాలనుకున్నారు. సరస్వతీ దేవీ ముద్దు బిడ్డలైన ఆ స్నేహితులు మొదటినుంచీ అన్ని క్లాసుల్లో ప్రథమంగా నిలుస్తూ వచ్చారు. సరదాగా సినిమా చూసొద్దామని వెళ్లిన ఆ విద్యార్థుల్ని గుర్తు తెలియని వాహనం రూపంలో వచ్చిన మృత్యువు బలి తీసుకుంది. వారిపైనే ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకు పుత్రశోకాన్ని మిగిల్చింది.
విజయవాడ నుంచి వస్తుండగా...
గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం బుజ్జి పాపన్నపాలెంకు చెందిన పోతునూరి మహేంద్రరెడ్డి (19), తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన దామరాజు సాయినాథ్ (19) ఏలూరు ఆశ్రం మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతున్నారు. వీరిద్దరూ స్నేహితులు. మహేంద్రరెడ్డి సత్రంపాడులో అదే కళాశాలకు చెందిన మరికొందరి మిత్రులతో కలసి ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. సాయినాథ్ మాత్రం కాలేజీ హాస్టల్‌లోనే ఉంటున్నాడు.
శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో వారిద్దరూ తమ స్నేహితుడైన సుధీర్‌కుమార్‌కు చెందిన బైక్ తీసుకుని సెకండ్ షో సినిమా చూసేందుకు విజయవాడ వెళ్లారు. తిరిగి అదే బైక్‌పై ఏలూరు బయలుదేరారు. పెదపాడు మండలం వట్లూరు సమీపంలోని శౌరీపురం వద్దకు వచ్చేసరికి రాత్రి ఒంటిగంట సమయంలో ఎదురుగా వస్తున్న గుర్తు తెలియని వాహనం బైక్‌ను ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందారు. బైక్ నుజ్జరుు్యంది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఏలూరు త్రీటౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. విద్యార్థుల జేబులో ఉన్న ఐడెంటిటీ కార్డుల ఆధారంగా వారు ఆశ్రం కళాశాల విద్యార్థులని గుర్తించారు. మృతదేహాలను ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో ఆశ్రం కళాశాలలో విషాద ఛాయలు అలముకున్నారుు. కేసును త్రీటౌన్ ఎస్సై ఎ.శ్రీనివాస్ దర్యాప్తు చేస్తున్నారు.
సాయినాథ్ తల్లిదండ్రులు వైద్యులే
కాకినాడలోని భానుగుడి సెంటర్ ప్రాంతానికి చెందిన దామరాజు సాయినాథ్ తండ్రి డాక్టర్ శేషగిరిరావు అక్కడి ప్రభుత్వ ఆసుపత్రిలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. తల్లి డాక్టర్ శైలజ గైనిక్ సర్జన్. సాయినాథ్‌కు పదోతరగతి చదువుతున్న తమ్ముడు హరి ఉన్నాడు. తల్లిదండ్రుల బాటలోనే వైద్యుడు కావాలనే లక్ష్యంతో చిన్నప్పటి నుంచి చదువులో ముందుండేవాడు.
రైతు కుటుంబం నుంచి వచ్చి..
మరో విద్యార్థి పోతూనూరి మహేంద్రరెడ్డి తండ్రి సుబ్బారెడ్డి వ్యవసాయం చేస్తుంటారు. ఆయనకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు వెంకటరెడ్డి బీటెక్ పూర్తి చేయగా, రెండో కుమారుడైన మహేంద్రరెడ్డి చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలనే లక్ష్యంతో కష్టపడి చదివేవాడు. ఎంసెట్‌లో 1000 ర్యాంకు సాధించి మెడికల్ సీటు సంపాదించినట్టు అతని స్నేహితులు తెలిపారు.
Advertisement
Advertisement