గుంటూరు మెడికల్: వైద్య ఆరోగ్యశాఖ లక్ష్యాల సాధనకు ప్రత్యేక ప్రణాళికతో పనిచేస్తున్నామని, అందుకోసం మార్చి 2వ తేదీనుంచి జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక మెడికల్ క్యాంపులు ఏర్పాటుచేసి కుటుంబనియంత్రణ ఆపరేషన్లు చేస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ తిరుమలశెట్టి పద్మజారాణి చెప్పారు. ఆమె సోమవారం సాక్షితో మాట్లాడారు. గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలోని పీపీ యూనిట్‌లో మార్చి2న డీపీఎల్ ట్యూబెక్టమీ ప్రత్యేక మెడికల్ క్యాంపు నిర్వహించామని, జీజీహెచ్‌లో మార్చి 9న, 16న ప్రత్యేక వైద్య శిబిరాలు ఉంటాయని తెలిపారు.
రేపల్లె సామాజిక ఆరోగ్య కేంద్రంలో మార్చి3న, మాచర్ల సామాజిక ఆరోగ్య కేంద్రంలో మార్చి30న, బాపట్ల ఏరియా హాస్పటల్‌లో మార్చి10న , అమరావతి సామాజిక ఆరోగ్య కేంద్రంలో 13న, నరసరావుపేట ఏరియా హాస్పటల్‌లో 17న, గురజాల సామాజిక ఆరోగ్య కేంద్రంలో 24న, తెనాలి జిల్లా ఆసుపత్రిలో 31న ప్రత్యేక వైద్యశిబిరాలు జరుగుతాయని వెల్లడించారు. ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యసాధనలో ఈ ఏడాది మార్చి నాటికి 32,500 కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయాల్సి ఉండగా జనవరి నె ల వరకు 31,666 ఆపరేషన్లు చేసి 96.57 శాతం లక్ష్యాలను చేరుకున్నామని పేర్కొన్నారు.
వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమంలో భాగంగా వివిధ రకాల టీకాలను 78,321 మందికి వేయాల్సి ఉండగా నూరుశాతం లక్ష్యాలను ఇప్పటికే సాధించినట్లు తెలిపారు. మార్చి నెలాఖరులోగా ప్రభుత్వం తమకు నిర్ధే శించిన అన్ని లక్ష్యాలను నూరుశాతం సాధించి జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తామన్నారు. మాతాశిశు వైద్యసేవల ఆన్‌లైన్ ప్రక్రియలో గతంలో జిల్లా 9వ స్థానంలో ఉండగా జనవరి నాటికి మూడోస్థానంలోకి వచ్చిందని, మార్చి నెలాఖరుకల్లా మొదటిస్థానంలోకి వచ్చేలా పనిచేస్తామని చెప్పారు.
రాష్ట్ర విభజన అనంతరం తొలిసారిగా జరిగే వైద్య ఆరోగ్యశాఖ లక్ష్యసాధన అవార్డుల కార్యక్రమంలో జిల్లాను రాష్ట్రంలో ప్రథమస్థానంలో నిలబెడతామన్నారు. డీఎంహెచ్‌ఓగా తాను గత ఏడాది నవంబర్ 24న బాధ్యతలు తీసుకున్నానని, మూడు నెలల కాలంలో జిల్లా అంతటా పర్యటించి లక్ష్యాల సాధనకు అనుసరించాల్సిన విధి విధానాలపై వైద్య సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ పనిచేస్తున్నట్లు వెల్లడించారు.
వైద్య ఆరోగ్యశాఖ లక్ష్యాల సాధనకు ప్రణాళిక
Published Tue, Mar 3 2015 1:29 AM | Last Updated on Sat, Sep 2 2017 10:11 PM
Advertisement