ఫెయిలవుతాననే భయంతో..
సికింద్రాబాద్, న్యూస్‌లైన్: ‘ఎంత చదివినా గుర్తుండటం లేదు. గతేడాది పరీక్షలు ఫెయిలయ్యాను. ఈసారి పరీక్షలకు హాజరైనా పాస్ అవుతానో లేదో అని భయంగా ఉంది. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నాను’ అని సూసైడ్ నోట్ రాసి.. ఓ పీజీ వైద్య విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నారు. సెలైన్ బాటిల్‌కు ఎక్కువ మోతాదులో మత్తు ఇంజెక్షన్లు(ఆపరేషన్ చేసే సమయంలో ఇచ్చేవి) ఇచ్చి.. దాన్ని తన రెండు చేతుల నరాలకు ఎక్కించుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు.
పంజాబ్‌కు చెందిన సుఖ్‌దర్శన్ కుమార్తె శైలజాశర్మ(31) సికింద్రాబాద్‌లోని దక్షిణమధ్య రైల్వే కేంద్రీయ ఆసుపత్రిలో పీజీ(కంటి వైద్యం) కోర్సులో చేరారు. పంజాబ్‌లోనే ఎంబీబీఎస్ పూర్తి చేసిన శైలజ గతేడాదిగా మహేంద్రహిల్స్ త్రిమూర్తి కాలనీలోని ఓ ఫ్లాట్‌లో ఒంటరిగా నివసిస్తున్నారు. గతేడాది డిసెంబర్‌లో ఉస్మానియా వైద్య కళాశాలలో నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామ్స్ నిర్వహించిన డీఎన్‌బీ పరీక్షలో శైలజ ఫెయిలయ్యారు. ఆ తర్వాత ఇంట్లోనే ఉంటూ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 6, 7 తేదీల్లో ఆ పరీక్షలు మళ్లీ జరగనున్నాయి. శనివారం మధ్యాహ్నం తాను చదువుకోవాలని చెబుతూ.. శైలజ పనిమనిషిని వెంటనే పంపించేశారు. తర్వాత సెలైన్ బాటిల్‌కు మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి.. రెండు ఐవీ సెట్ల ద్వారా రెండు చేతుల నరాలకు దాన్ని ఎక్కించుకుని మరణించారు.
ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో పనిమనిషి తలుపు తట్టగా జవాబు రాలేదు. తలుపుకు గడియ పెట్టకపోవడంతో ఆమె లోపలికి వెళ్లి చూసింది. శైలజ విగతజీవిగా పడి ఉండటాన్ని గమనించి, ఇంటి యజమానికి సమాచారమిచ్చింది. సోమవారం ఆమె కుటుంబ సభ్యులు నగరానికి చేరుకునే అవకాశముందని పోలీసులు తెలిపారు. కాగా, పరీక్షల్లో ఫెయిల్ అవుతాననే భయంతోనే తాను ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని తన స్నేహితులకు చెప్పరాదని శైలజా శర్మ సూసైడ్ నోట్‌లో కుటుంబ సభ్యులను కోరారు. ‘నా చావుకు ఎవరూ కారణం కాదు. మళ్లీ పరీక్షల్లో ఫెయిల్ అవుతాననే భయం, అవమానంతో మాత్రమే చనిపోతున్నా. నేను చనిపోయిన విషయాన్ని ప్రచారం చేయకుండా.. ఫ్రెండ్స్‌కు నేను పిరికిదాన్నని తెలియకుండా ఉంచండి’ అని ఆమె కోరారు.