తమ్ముళ్లకు ఝలక్
సాక్షి ప్రతినిధి, విజయనగరం: మా రాజని మనవి చేసుకున్న తమ్ముళ్లకు ఝలక్ తగిలింది. ఎమ్మెల్సీ పదవి కావాలని కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజును కోరిన వారికి అశోక్ చెప్పిన మాటలు విని దిమ్మ తిరిగిపోయింది. జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి నాయకత్వం వహిస్తున్న మాజీలు, గడిచిన ఎన్నికల్లో ఓటమి చెం దిన వారు ఎప్పుడో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నిక కోసం ఇప్పటి నుంచే పదవిని ఆశి స్తున్నారు. ఇప్పటికే ఈ పదవిని తనకే ఇవ్వాలని కోరుతూ జిల్లాలోని ఆరుగురు నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా కలిశారు. ఈ నేపథ్యంలో ఆదివారం జిల్లాకు వచ్చిన కేంద్ర మంత్రి పి.అశోక్ గజపతిరాజును ఎమ్మెల్సీ ఆశావహులంతా వెళ్లి కలిశారు. ఆశల ముడి విప్పాల్సిన అశోక్ తిరి గి పీటముడి వేసే మాటలు చెప్పడంతో వారం తా అవాక్కయ్యారు.
జిల్లా పార్టీ అధ్యక్షుడు డి.జగదీష్, ప్రధాన కార్యదర్శి ఐవీపీ రాజు, అరకు పార్లమెంటు ఇన్‌ఛార్జి జి. సంధ్యారాణి, బొబ్బిలి నియోజకవర్గ ఇన్‌చార్జి తెంటు లక్ష్ము నాయుడు, చీపురుపల్లి మాజీ ఎమ్మెల్యే గద్దే బాబూరావు, అక్కడి పార్టీ ఇన్‌చార్జి కె.త్రిమూర్తులరాజులు ఈ పదవినాశిస్తున్నారు. వీరంతా ఎమ్మెల్సీ పదవి తనకే ఇవ్వాలని ఎవరి మానాన వారు కోరినట్టు తెలిసింది. ఈ అభ్యర్ధనను విన్న అశోక్ గజపతిరాజు మీరే ఒకర్ని నిర్ణయించుకోండి! లేకుంటే అధిష్టానానికి వదిలేయండని చెప్పడంతో వెళ్లిన నాయకులంతా అవాక్కయ్యారు. ఇప్పటికే ఎవరి మానాన వారు ఎమ్మెల్సీ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్ని చేసినా పూజారి వరమిచ్చే చందంగా అశోక్ గజపతిరాజు నోటి వెంట ఆమోద ముద్ర వేసుకుంటే సరిపోతుంది కదానని వెళ్లిన ఆశావహులు పెద్ద పితలాటకాన్నే ఎదుర్కొన్నామని వాపోతున్నారు.
మరో మాట లేకుండా అధిష్టాన నిర్ణయానికే కట్టుబడి ఉంటామని వారంతా చెప్పేశారు. ఇప్పటికే చంద్రబాబును కలిసి తమ సేవలు, ఎమ్మెల్సీ పదవికి తామెలా అర్హులమో ఎవరికి వారు చెప్పుకున్నారు. పార్వతీపురం డివిజన్‌లో పార్టీకి పెద్ద దిక్కుగా ఉండాలంటే తనకు ఎమ్మెల్సీ పదవి అవసరమని ద్వారపురెడ్డి జగదీష్ చెబుతున్నారు. ఈ విషయాన్నే చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి తన ఆధ్వర్యంలో పార్టీ ఎలా పుంజుకుందో చెప్పుకున్నారు. ఐవీపీ రాజు జిల్లా కేంద్రంలో పార్టీ బలాన్ని తగ్గనీయకుండా ఎన్నికల సమయానికి పార్టీకి సుదీర్ఘంగా అందించిన సేవలను దృష్టిలో పెట్టుకుని తనకు పదవినివ్వాలని అభ్యర్ధించారు.
అరకు పార్లమెంటు నియోజకవర్గ ఇన్‌చార్జి గుమ్మిడి సంధ్యారాణి మూడు జిల్లాల్లో ఎస్టీ వర్గానికి ఎమ్మెల్యే లేరనీ తనకు ఎమ్మెల్సీ పదవినిస్తే మూడు జిల్లాల్లోని గిరిజన ప్రజలకు సేవ చేస్తూ ఏజెన్సీ అభివృద్ధికి పాటుపడ గలనని, దీని వల్ల ఎస్టీ వర్గానికి ప్రాతినిధ్యం కల్పించినట్టు అవుతుందని కోరారు. బొబ్బిలి నియోజకవర్గంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ధాటిని తట్టుకోవాలంటే తనకు ఎమ్మెల్సీ పదవిని తప్పనిసరిగా ఇవ్వాలనే కోరికను వెల్లడించారు. ఇక గద్దే బాబూరావు తన చుట్టూ ఉన్న కోటరీని, సామాజిక వర్గ లాబీయింగ్‌తో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇన్‌చార్జి కె. త్రిమూర్తు లురాజు తాను గడచిన ఎన్నికల్లో టిక్కెట్ కోసం ఆశిస్తే తనకు ఎమ్మెల్సీ పదవినిస్తానని హామీ ఇవ్వడంతోనే టిక్కెటు రేసు నుంచి తప్పుకున్నానని.. ఇప్పుడా హామీని అమలు చేయాలన్న దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా ఎవరి బాసలు వారు చెప్పుకున్నప్పటికీ అశోక్ వేసిన పీటముడికి అంతా కిక్కుమనలేకపోయారు. ఇక అధిష్టానం ఎవరికి నిర్ణయిస్తే వారిదే అదృష్టమన్న భావనలో వారంతా మిన్నకుండిపోయూరు.