ముద్రగడను బేషరతుగా విడుదల చేయాలి
► కాపు నేతల ర్యాలీ... అరెస్టు..
► కాపు సంఘాల నేతల డిమాండ్
కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అరెస్టుకు నిరసనగా శుక్రవారం గుంటూరులో తెలగ అభ్యుదయ సంఘం జేఏసీ, పలు కాపు సంఘాల నేతలు నిర్వహించిన ప్రదర్శనను పోలీసులు అడ్డుకున్నారు. 144 సెక్షన్, 30 పోలీసు యాక్ట్ అమలులో ఉన్నాయని, ఎటువంటి ప్రదర్శనలకు అనుమతి లేదంటూ అడ్డగించారు. బలవంతంగా కాపు ఉద్యమ నేతలను అరెస్టు చేసి నగరంపాలెం పోలీసు స్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.
పట్నంబజారు(గుంటూరు) : కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అరెస్టుపై తెలగ అభ్యుదయ సంఘం జేఏసీ, పలు కాపు సంఘాల నేతలు మండిపడ్డారు. కాపు జాతికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ద్రోహిలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలగ అభ్యుదయ సంఘం జేఏసీ, పలు కాపు సంఘాల నేతృత్వంలో శుక్రవారం నగరంపాలెంలోని కేకేఆర్ ఫంక్షన్ ప్లాజా నుంచి నిరసన కార్యక్రమం చేపట్టారు.
నెలకొన్న ఉద్రిక్తత
నోటికి నల్లరిబ్బన్లు ధరించి, కంచాలు మోగించుకుంటూ ప్రదర్శన ప్రారంభించారు. ఫంక్షన్ హాలు నుంచి బయటకు రాగానే భారీగా మోహరించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. 144 సెక్షన్, 30 పోలీసు యాక్ట్ అమలులో ఉన్నాయని, ఎటువంటి ప్రదర్శనలకు అనుమతి లేదంటూ అడ్డగించారు. ప్రదర్శన ఎట్టి పరిస్థితుల్లో ఆపేదిలేదని కాపు నేతలు పట్టుబట్టడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రదర్శనను అడ్డుకున్న పోలీసులు బలవంతంగా కాపు ఉద్యమ నేతలను అరెస్టు చేసి నగరంపాలెం పోలీసు స్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.
ఈ సందర్భంగా జేఏసీ నేత కిలారి రోశయ్య మాట్లాడుతూ ఆరు నెలల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని చెప్పిన ప్రభుత్వ పెద్దలు అక్రమ కేసులు పెట్టించడం సబబు కాదన్నారు. తక్షణమే కాపు ఉద్యమనేత ముద్రగడను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాపు నేత మాదా రాధాకృష్ణ మాట్లాడుతూ కేసులు పెట్టినంత మాత్రాన వెనకడుగు వేసే ప్రసక్తి లేదన్నారు. జేఏసీ నేత కావటి విక్రమ్ నాయుడు మాట్లాడుతూ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు కాపులు సిద్ధంగా ఉన్నారన్నారు.
కార్యక్రమంలో కాపుసంఘాల నేతలు మలిశెట్టి సుబ్బారావు, దాసరి రాము, శ్రీకాంత్, ఆళ్ళ హరి, అడపా కాశీవిశ్వనాధం, ఇర్రి సాయి, ఐలా శ్రీను తదితరులు పాల్గొన్నారు.