శ్రీకాళహస్తి, న్యూస్‌లైన్ : దక్షిణకాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తి వాయులింగేశ్వరుని ఆలయానికి రాజకీయ గ్రహణం పట్టుకుంది. సీడీల పంపిణీ, భూ ముల కేటాయింపులో వ్యతిరేకంగా ఉన్నం దునే ఈవో శ్రీరామచంద్రమూర్తిని రాజకీయ పెద్దలు బదిలీ చేయించినట్లు తెలుస్తోంది. ఈ అంశాలపై ముందుగా ఒప్పందం కుదుర్చుకునే ఇన్‌చార్జి ఈవోగా విజయకుమార్‌ను తీసుకొచ్చినట్లు ప్రచారం సాగుతోంది. శ్రీకాళహస్తీశ్వరాలయ మహత్యం పేరిట 2006లో సీడీలను రూపొందించి రాహుకేతు పూజలు, రుద్రాభిషేకాలు, చండీహోమం చేసుకున్న భక్తులకు అందజేశారు. కాంట్రాక్టర్లు ఒక్కో సీడీని 65 రూపాయలకు ఆలయానికి విక్రయించారు. పదిహేను రూపాయలూ చేయని సీడీకి 65 రూపాయలను ఆలయాధికారులు చెల్లించారు. సీడీల పంపిణీ ఏడాది వరకు సాగింది.
ఈ వ్యవహారంలో ఆలయానికి రెండు కోట్ల రూపాయలపైనే నష్టం వాటిల్లినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఫలితంగా సీడీల పంపిణీని రద్దు చేశారు. అయితే కొందరు నాయకులు తమకున్న రాజకీయ అండదండలతో సీడీల పంపిణీని ఇటీవల తెరపైకి తెచ్చారు. ఈ అంశంపై ఈవో శ్రీరామచంద్రమూర్తిపై ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. ఒక మంత్రి సైతం పలుమార్లు ఒత్తిడి తెచ్చి విఫలమైనట్లు సమాచారం. ఈ వ్యవహారంపై ఆలయ ట్రస్టుబోర్డు మాజీ చైర్మన్ పీఆర్ మోహన్ ఇటీవల ప్రచారం చేశారు. కొందరు సీడీల పంపిణీని మళ్లీ తెరపైకి తేనున్నారని, ఈ ప్రతిపాదనను అడ్డుకుని ఆలయ సంపదను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ ఓ కారణం
తమిళనాడులోని గుమ్మిడిపూండి సమీపంలో ఉన్న పొన్నేరి వద్ద శ్రీకాళహస్తీశ్వరాలయానికి 27 ఎకరాల భూములు ఉన్నాయి. వీటి విలువ రూ.54 కోట్లకు పైమాటే. వీటి మధ్యగా తన భూముల్లోకి రోడ్డు వేసుకునేందుకు తమిళనాడుకు చెందిన ఓ మంత్రి ఇటీవల సన్నాహాలు ప్రారంభించారు. ఈ విషయంపైనా ఈవో శ్రీరామచంద్రమూర్తిపై తీవ్ర ఒత్తిళ్లు వచ్చాయి. అయితే భూముల మధ్య రోడ్డు వేస్తే వాటి విలువ పడిపోతుందనే కారణంతో ఈవో విముఖత చూపినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారాల్లో సహకరించని ఈవోను బదిలీ చేసేందుకు ఓ మంత్రి, ఆయన అండదండలు ఉన్న నాయకులు పావులు కదిపినట్లు సమాచారం. ఇందులో భాగంగానే ఆలయంలోని అక్రమాలను వారు వెలుగులోకి తెచ్చారని చెబుతున్నారు.
విచారణ పేరుతో ఇటీవల కాలంలో హైడ్రామా నడిపారు. ఆలయంలో అక్రమాలు చోటుచేసుకున్నప్పటికీ ఈవో బదిలీ వ్యవహారంలో సీడీలు, భూముల వ్యవహారం ప్రధాన భూమిక పోషించినట్లు తెలుస్తోంది. సీడీలు, భూముల వ్యవహారంలో తమకు అనుకూలంగా ఆమోదముద్ర వేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నాకే ఇన్‌చార్జి ఈవోగా విజయకుమార్‌ను సదరు వ్యక్తులు తీసుకువచ్చినట్లు ప్రచారం సాగుతోంది. జిల్లాలో ఇద్దరు రీజనల్ జాయింట్ కమిషనర్లు (ఆర్‌జేసీ) ఉన్నప్పటికీ ఎక్కడో కృష్ణా జిల్లాలోని తిరుపతమ్మ ఆలయం నుంచి విజయకుమార్ రావడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది.
ముక్కంటి ఆలయానికి రాజకీయ గ్రహణం
Published Thu, Dec 26 2013 5:13 AM | Last Updated on Mon, Sep 17 2018 4:56 PM
Advertisement