త్వరలో మెడికల్ ‘ప్రైవేటు’ నోటిఫికేషన్! | near to Medical notification | Sakshi
Sakshi News home page

త్వరలో మెడికల్ ‘ప్రైవేటు’ నోటిఫికేషన్!

Published Wed, Jul 30 2014 12:29 AM | Last Updated on Tue, Oct 9 2018 7:05 PM

త్వరలో మెడికల్ ‘ప్రైవేటు’ నోటిఫికేషన్! - Sakshi

త్వరలో మెడికల్ ‘ప్రైవేటు’ నోటిఫికేషన్!

ఇంటర్ మార్కుల ఆధారంగానే 85 శాతం సీట్లు భర్తీ చేసుకుందాం 
ప్రైవేటు వైద్య కళాశాలల యాజమాన్యాల నిర్ణయం

 
ఎంబీబీఎస్ నోటిఫికేషన్‌కు సన్నాహాలు..
సెప్టెంబర్ 1లోగా క్లాసులు ప్రారంభం కావాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులు

 
హైదరాబాద్: మెడికల్(ఎంబీబీఎస్) ఫీజులు, ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఎటూ తేల్చకుండా నాన్చుతున్న నేపథ్యంలో సొంతంగా ప్రవేశాలు జరుపుకోవడమే ఉత్తమమన్న నిర్ణయానికి ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు వచ్చాయి. ఎంబీబీఎస్ అడ్మిషన్లకు ఇప్పట్లో కౌన్సెలింగ్ నోటిఫికేషన్ జారీ చేసే పరిస్థితులు కనిపించట్లేదని, పరిస్థితి ఇలాగే కొనసాగితే మంజూరైన సీట్లను కూడా కోల్పోవాల్సి వస్తుందని ఆందోళన వెలిబుచ్చాయి. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు సెప్టెంబర్ ఒకటిలోగా తరగతులు ప్రారంభించాల్సి ఉండగా.. ఇప్పటివరకు ఫీజులు, రీయింబర్స్‌మెంట్, కౌన్సెలింగ్‌పై ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయానికి రాలేకపోతున్న పరిస్థితిపై ఆయా కాలేజీల యాజమాన్యాలు ప్రత్యేకంగా సమావేశమై పరిస్థితిని సమీక్షించాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రైవేటుగా నోటిఫికేషన్ జారీ చేసి సీట్లను భర్తీ చేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చాయి. ఏమాత్రం జాప్యం చేసినా సీట్లు కోల్పోవాల్సి వస్తుందని అభిప్రాయపడుతూ.. ప్రభుత్వ వైఫల్యానికి యాజమాన్యాలు ఎందుకు బలికావాలని, సుప్రీంకోర్టు ఆదేశాలు, ఎంసీఐ మార్గదర్శకాల ఆధారంగా సీట్ల భర్తీ ప్రక్రియ చేపడదామని సమావేశంలో మెజారిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వాలను ధిక్కరించి వెళ్లడం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయని కొందరు ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ సీట్ల భర్తీ విధానంలో హైకోర్టు, సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం నడుచుకోవాలని, అలా చేయడం వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తవన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఈ విషయాలపై మరోసారి సమావేశమై మెజారిటీ సభ్యుల అభిప్రాయం మేరకు సొంతంగా నోటిఫికేషన్ జారీ చేసి అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు.

ఇంటర్ మార్కుల ఆధారంగా భర్తీ చేద్దాం

ప్రస్తుతం కన్వీనర్ కోటాలో 50 శాతం, బి కేటగిరీలో 10 శాతం సీట్లను ప్రభుత్వానికి ఇస్తున్నామని, మిగతా 40 శాతంలో 25 శాతం యాజమాన్య, 15 శాతం ప్రవాస భారతీయ(ఎన్‌ఆర్‌ఐ) కోటా ఉందని, అయితే మనమే నోటిఫికేషన్ ఇచ్చుకుంటున్నాం కాబట్టి 15 శాతం ఎన్‌ఆర్‌ఐ కోటా మినహాయించి మిగతా 85 శాతం సీట్లను ఇంటర్ మార్కుల ఆధారంగా భర్తీ చేసుకుందామన్న ఆలోచనకు ప్రైవేటు వైద్య కళాశాలల యాజమాన్యాలు వచ్చాయి. ప్రభుత్వాల జాప్యం కారణంగా ఎలాగూ ప్రైవేటు ప్రవేశ పరీక్షకు కూడా అవకాశం లేకుండా చేశారు కాబట్టి ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఇంటర్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా 85 శాతం సీట్లను భర్తీ చేద్దామని సభ్యులు అభిప్రాయపడ్డారు. ఇక ఫీజుల విధానం ఎలాగూ ఏఎఫ్‌ఆర్సీ(అడ్మిషన్ ఫీ రెగ్యులేటరీ కమిటీ) నిర్ణయించినందున.. ఈ ఏడాదికి ఆ లెక్కప్రకారమే (కాలేజీల స్థాయిని బట్టి రూ.3.10 లక్షల నుంచి రూ.3.75 లక్షల వరకు) భర్తీ చేసుకుందామని, వచ్చేఏడాది మార్పులేమైనా ఉంటే అప్పుడు ఆలోచిద్దామని యాజమాన్యాలు సమాలోచన జరిపాయి. రెండ్రోజుల్లో కీలక నిర్ణయం తీసుకునే వీలుందని ఓ వైద్య కళాశాల యజమాని తెలిపారు. ఈ విషయంలో కొన్ని విద్యార్థి సంఘాల అభిప్రాయాలు కూడా తీసుకున్నామని, ప్రభుత్వ వైఖరులను వారికి వివరిస్తున్నామని ఆయన చెప్పారు.

ప్రభుత్వమే భర్తీ చేసుకోవచ్చు...

ప్రవాస భారతీయ కోటా 15 శాతం మినహాయించి మిగతా 85 శాతం ప్రైవేటు సీట్లను ఇంటర్ మార్కుల ఆధారంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో భర్తీ చేసుకున్నా తమకేమీ అభ్యంతరం లేదనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేశారు. అన్ని ప్రముఖ దినపత్రికల్లో నోటిఫికేషన్ ఇస్తామని, దీని ఆధారంగా ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుమేరకే పారదర్శకంగా భర్తీ చేయాలనే భావనను వెలిబుచ్చారు. ఆగస్ట్ 1 నుంచే తరగతులు మొదలు కావాల్సి ఉందని, ఎన్నికలు జరిగిన దృష్ట్యా ఈ ఏడాది సుప్రీంకోర్టు ఒక నెల అదనంగా గడువిచ్చిందని, సెప్టెంబర్ 1లోగా తరగతులు ప్రారంభం కావాలంటే ఈపాటికి కౌన్సెలింగ్ జరగాలని, అయితే ఇప్పటికీ నోటిఫికేషన్ రాలేదు కాబట్టే ప్రైవేటు నోటిఫికేషన్‌కు వెళ్లే యోచనలో ఉన్నామని ప్రైవేటు వైద్య కళాశాలల యాజమాన్యం అభిప్రాయపడింది. ఒకవేళ నిజంగా ప్రైవేటు కళాశాలలు నోటిఫికేషన్ జారీ చేసి సీట్లు భర్తీ చేస్తే... చాలామంది మంచి ర్యాంకులు పొందిన విద్యార్థులు ప్రభుత్వ కళాశాలల్లో సీట్లు వస్తాయో రావో, ఒకవేళ ఇంటర్ మార్కుల ఆధారంగా ప్రైవేటు కళాశాలలో చేరితే ప్రభుత్వ కళాశాలలో వస్తుందేమో అనే సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement