నెల్లూరు బాంబు పేలుడు అల్ ఉమా పనే?
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు జిల్లా కోర్టు ఆవరణలో సోమవారం జరిగిన బాంబు పేలుడు అల్ ఉమా ఉగ్రవాద సంస్థ పనేనా? పోలీసు వర్గాల్లో ఈ అభిప్రాయం వినిపిస్తోంది. చిత్తూరు, కేరళలోని కొల్లం, పుదుచ్చేరి కోర్టుల ప్రాంగణాల్లో ఇటీవలి కాలంలో జరిగిన బాంబు పేలుళ్లకు ఇది కొనసాగింపనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల ను భయభ్రాంతులు చేయడానికే ఈ చర్యకు పాల్ప డి ఉంటారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల చిత్తూరు, కొల్లం, పుదుచ్చేరి కోర్టుల ఆవరణాల్లో బాంబు పేలుళ్లు జరిగిన తీరు, అందులో వాడిన పేలుడు పదార్థాలు, వాటిని పేల్చిన తీరు గురించి ప్రత్యేక బృందం వివరాలు సేకరించింది.
ఈ పేలుళ్లకు నెల్లూరు పేలుడుకు దగ్గరి పోలికలు ఉండటంతో ఈ విధ్వంసం కూడా అల్‌ఉమా ఉగ్రవాద సంస్థ పనే అయిఉండొచ్చని పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి. డీఎస్పీ, ఇద్దరు సీఐలతో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం దర్యాప్తు సాగిస్తోంది. ఈ ఘటనకు సంబంధించి ఆధారాలు సేకరించడానికి కౌంటర్ ఇంటెలిజెన్స్, జాతీయ నేరపరిశోధన సంస్థలు రంగంలోకి దిగాయి. కౌంటర్ ఇంటెలిజెన్స్ బృందం మంగళవారం నెల్లూరుకు చేరుకుని ఘటన స్థలాన్ని పరిశీలించింది. స్థానిక అధికారులతో సమావేశమై వారి వద్ద ఉన్న సమాచారాన్ని సేకరించింది.