‘కల్లు’కు కొత్త టెక్నిక్
వినూత్న విధానం కల్లు గీత కార్మికుల నుదుట లాభాల ‘గీత’ రాస్తోంది. కల్లు తీసేందుకు ఎక్కిన చెట్టు దిగకుండానే మరోదానిపైకి వెళ్లేందుకు టెంకాయ తాళ్లను వారధిగా వినియోగిస్తున్నారు. చెట్టు నుంచి మరో చెట్టుకు తాళ్లు కట్టి వాటిపై నడుస్తూ వెళ్లి వందలాది చెట్ల నుంచి కల్లు తీస్తున్నారు. శ్రీలంకలో అవలంబిస్తున్న ఈ విధానం చెన్నైకి విస్తరించింది.
అక్కడ పనిచేసే కొందర్లు గీత కార్మికులు తర్ఫీదు పొంది ప్రస్తుతం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వాకాడులోని టెంకాయ తోపులో ఈ పద్ధతిలో కల్లుతీస్తున్నారు. తమిళనాడుకు చెందిన గీత కార్మికుడు రాజా వాకాడులో టెంకాయ తోపును లీజుకు తీసుకుని కల్లు గీస్తున్నారు. ఆయన మాట్లాడుతూ చెట్లకు తాళ్లు కట్టి దానిపై నడిచి వెళ్లడంతో శ్రమ తగ్గుతోందన్నారు. గతంలో ఒకరు పది చెట్లు ఎక్కేవారని, ఇప్పుడు ఒకొక్కరు సులువుగా 30 చెట్ల నుంచి కల్లు తీయవచ్చన్నారు.
- వాకాడు