వచ్చిన రాష్ట్రాన్ని ఇక దేవుడు కూడా ఆపలేడు | No one can stop the state | Sakshi
Sakshi News home page

వచ్చిన రాష్ట్రాన్ని ఇక దేవుడు కూడా ఆపలేడు

Published Sun, Nov 24 2013 3:48 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

No one can stop the state

కోయిల్‌కొండ, న్యూస్‌లైన్: అమరవీరుల త్యాగాల ఫలితమే తెలంగాణ వచ్చిందని, తెలంగాణ రాష్ట్రాన్ని సీమాంధ్ర నాయకులు కాదు..ఆ దేవుడు కూడా వచ్చి ఆపలేడని టీఆర్‌ఎస్ జనరల్ సెక్రటరీ కే.కేశవరావు తేల్చిచెప్పారు. శనివారం మండలకేంద్రంలో జరిగిన పార్టీ మండలస్థాయి శిక్షణ తరగతుల్లో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నాయిని నర్సింహారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేకే మాట్లాడుతూ..గత పదేళ్లకాలంలో తెలంగాణ సాధనకోసం చేసిన యువకుల త్యాగాలను సువర్ణఅక్షరాలతో లిఖించాల్సి ఉందన్నారు. తెలంగాణ ఏర్పాటు జరిగే సమయంలో సీమాంధ్ర నాయకులు అనేక కుట్రలు పన్నుతున్నారని అన్నారు. ఎలాంటి షరతులు లేని తెలంగాణ ఏర్పాటు చేయకుంటే మరోమారు మహోద్యమం తప్పదని హెచ్చరించారు. సీమాంధ్ర నాయకులు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న తమ ఆస్తులను కాపాడుకోవడానికే అనేక నాటకాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు.
 
 హైదరాబాద్‌ను యూటీ చేస్తే సహించం
 తెలంగాణ ఇచ్చి హైదరాబాద్‌ను యూటీ చేస్తే మాత్రం సహించేది లేదని నాయిని నర్సింహారెడ్డి హెచ్చరించారు. హైదరాబాద్‌తో కూడిన 10 జిల్లాల తెలంగాణ రాష్ట్రం కావాలని ఆయన డిమాండ్‌చేశారు. సీమాంధ్రులు వెళ్లిపోతే ఈ ప్రాంతంలో 1.50లక్షల ఉద్యోగాలు ఈ ప్రాంత యువకులకు దొరుకుతాయన్నారు. తెలంగాణ రాష్ట్ర పునర్‌నిర్మాణంలో భాగంగా టీఆర్‌ఎస్ అధికారంలోకిరాగానే ప్రతి నియెజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగునీరు, అమరవీరుల కుటుంబానికి ఐదెకరాల పొలం, ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని తెలిపారు.
 
 తెలంగాణ అభివృద్ధి సాధించాలంటే టీఆర్‌ఎస్ పార్టీకి రాష్ట్రంలో 10 ఎంపీ సీట్లు, 100 ఎమ్మెల్యే సీట్లను దక్కించుకోవాలని పిలుపునిచ్చారు. అప్పుడే కేంద్రప్రభుత్వం దిగొచ్చి అధిక నిధులు కేటాయిస్తుందన్నారు. టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు విఠల్‌రావు ఆర్యా అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పార్టీ పొలిట్‌బ్యూరోసభ్యులు ఎస్. నిరంజన్‌రెడ్డి, ఏపీ జితేందర్‌రెడ్డి, మాజీమంత్రి పి.చంద్రశేఖర్, నాయకులు ఇబ్రహీం, ఆపార్టీ మండల అధ్యక్షులు గోపాల్‌గౌడ్, మండల నాయకులు వాయిద్, లక్ష్మారెడ్డి, విష్ణు, మోహన్, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.
 
 అంగుళం కూడా వదులుకోం..
 జెడ్పీసెంటర్, న్యూస్‌లైన్: తెలంగాణలో అంగుళం కూడా వదులుకోమని టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యులు నాయిని నర్సింహారెడ్డి తేల్చిచెప్పారు.   హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాలతో కూడిన ప్రత్యేకరాష్ట్రం ఇవ్వాలని డిమాండ్ చేశారు. శనివారం ఆయన స్థానిక ఆర్‌అండ్‌బీ అథితిగృహంలో విలేకరులతో మాట్లాడారు.  సీడబ్ల్యూసీ నిర్ణయానికి భిన్నంగా తెలంగాణ ఇస్తే మహోద్యమాన్ని నిర్మించేందుకు పార్టీని, కార్యకర్తలను ప్రజలను సన్నద్ధం చేసేందుకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇదే సమయంలో వచ్చే ఎన్నికలకు పార్టీని సిద్ధంచేస్తున్నామని చెప్పారు. సమావేశంలో టీఆర్‌ఎస్ జిల్లా కో కన్వీనర్ బెక్కెం జనార్దన్, నాయకులు మోహన్‌బాబు, కోట్లకిషోర్, కృష్ణముదిరాజ్, మిట్టే నర్సింహా, రవి, ఆంజనేయులు, మహేష్, చెన్నకేశవ్ తదితరులు పాల్గొన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement