సాక్షి, నెల్లూరు: విద్యుత్ జేఏసీ సమ్మెతో జిల్లాలో ప్రజలకు సోమవారం రెండో రోజూ విద్యుత్ కష్టాలు తప్పలేదు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచి పోయింది. పగలంతా వ్యాపార వాణిజ్య సంస్థలు, చిన్న, పెద్ద పరిశ్రమలు, హోటళ్లలో పనిచేసేవారితో పాటు అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా తాగునీటికి జనం తిప్పలు పడాల్సి వచ్చింది. విద్యుత్ లేకపోవడంతో వాటర్ ప్లాంట్లలో సైతం నీరు దొరక లేదు. ఒకటి రెండు చోట్ల దొరికినా అధిక రేట్లు విక్రయించారు. అక్కడ కూడా నీటి కొనుగోలుకు క్యూ కట్టాల్సి వచ్చింది. ఇక జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న తాగునీటి పథకాలు పనిచేయలేదు. నీటి కోసం ఇతర ప్రాంతాలకు సైతం వెళ్లాల్సి వచ్చింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులలో విద్యుత్ లేక రోగులు, బాలింతలు, వృద్ధులు, చిన్న పిల్లలు నరక యాతన అనుభవించారు.
ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రులలో రోగుల ఇక్కట్లు వర్ణణాతీతం. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో ఇదే పరిస్థితి నెలకొంది. నెల్లూరు నగరంతో పాటు నియోజక వర్గ, మండల కేంద్రాల్లో ప్రజలు పగలంతా ఉక్క పోతతో ఇళ్లల్లో ఉండలేక వీధుల్లోకి చేరుకోవాల్సి వచ్చింది. పలువురు వృద్ధులు, చిన్న పిల్లలు చెట్లు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఉండి పోయారు. గూడూరు ఏరియా ఆసుపత్రిలో ఉదయం నుంచి 7 గంటల వరకు రోగులు ఇక్కట్లు పడ్డారు. పలు రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇక్కట్లు పడ్డారు. విద్యుత్ లేక పెట్రోలు బంకులు మూత పడ్డాయి. జనరేటర్లు ఉన్నచోట క్యూలు కట్టారు. ఆక్వా రైతులు కరెంటు లేక జనరేటర్లు మీధ ఆధార పడి ఇబ్బందులు పడ్డారు. డీజిల్ సైతం దొరకలేదు. ముత్తుకూరులో నిర్మాణంలో ఉన్న విద్యుత్ ప్రాజెక్టులు, రైల్వే లైన్‌కు, కృష్ణ పట్నం ఓడరేవుకు మధ్యాహ్నం 12 గంటల నుంచి విద్యుత్ నిలిపి వేశారు. రైల్వే లైన్‌కు, కృష్ణ పట్నం ఓడరేవుకు మాత్రం సాయంత్రం 6 గంటలకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. ఉదయగిరి నియోజకవర్గంలోని ప్రతి పల్లెల్లో రక్షిత నీటి పథకాలు పనిచేయకపోవడంతో తాగునీటికి ఇక్కట్లు పడ్డారు.
వ్యవసాయానికి విద్యుత్ సరఫరా లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. చిన్న తరహా పరిశ్రమలు, వ్యాపారులు కరెంటు కష్టాలు ఎదుర్కొన్నారు. ఉదయగిరి పీహెచ్‌సీలో విద్యుత్ లేకపోవడంతో బాలింతలు, గర్భిణులు, చిన్నారులు ఇక్కట్లు ఎదుర్కొన్నారు. కావలి నియోజకవర్గంలో నీటి ఇక్కట్లు తప్పలేదు. ఏరియా ఆసుపత్రుల్లో రోగులు ఇక్కట్లు ఎదుర్కొన్నారు. జెరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లు మూతపడ్డాయి. ఆలయాల వద్ద జనరేటర్లు పెట్టుకోవాల్సి వచ్చింది. విద్యుత్ కోతలతో సోమవారం సైతం రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విజయవాడ నుంచి చెన్నై నుంచి వెళ్లాల్సిన జనశతాబ్ధి, పినాకినీ ఎక్స్ ప్రెస్‌లు రద్దయ్యాయి. చెన్నై నుంచి విజయవాడ వైపు నడిచే జనశతాబ్ధి, పినాకినీ ఎక్స్ ప్రెస్‌లు యథాతథంగా నడిచాయి. రైల్వేలైనుకు విద్యుత్ సరఫరా చేసే కోవూరు ఎన్‌టీఎస్, కావలి, సూళ్లూరుపేట, గూడూరు విద్యుత్ ఉపకేంద్రాల నుంచి విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో జిల్లాలో రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపింది.
చీకట్లో సింహపురి
Published Tue, Oct 8 2013 7:27 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement