పౌష్టికాహారం అంటే కుళ్లిన గుడ్లా?
Published Fri, Aug 9 2013 4:11 AM | Last Updated on Fri, Sep 1 2017 9:44 PM
అధికారుల నిర్లక్ష్యంతో కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడు. అతను ఆడిందే ఆట ఇచ్చిందే నాణ్యమైన ఆహారంగా చలామణి అవుతోంది. దీనికి నిదర్శనమే అంగన్‌వాడీ కేంద్రాలకు కుళ్లిన గుడ్లు సరఫరా కావడం. ఈ గుడ్లు తింటే ఇంకేమైనా ఉంటుందా..పౌష్టికాహారం మాట దేవుడెరుగు కానీ రోగాలు రావడం ఖాయం. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం దారుణమని అంగన్‌వాడీ కేంద్రాల నిర్వాహకులు పేర్కొంటున్నారు.
శివ్వంపేట, న్యూస్‌లైన్: పౌష్టికాహారం మాట దేవుడెరుగు ఇలాంటి గుడ్లు తింటె కొత్త రోగాలు రావడం ఖాయం. అంగన్‌వాడీ కేంద్రాలకు నాణ్యమైన సరుకులు పంపిణీ చేయాల్సి ఉండగా సదరు కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో కుళ్లిన గుడ్లు సరఫరా అవుతున్నాయి. దీంతో అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులకు పౌష్టికాహారాన్ని అందించాలన్న ప్రభుత్వ సంకల్పం నీరుగారిపోతోంది. మండల కేంద్రమైన శివ్వంపేటతోపాటు పలు కేంద్రాలకు వారం రోజుల క్రితం సరఫరా చేసిన గుడ్లు కుళ్లిపోయి ఉన్నాయి. పంపిణీలో ఎక్కువ శాతం గుడ్లు పాడైపోయి తీవ్ర దుర్వాసన వస్తుంది. ఇలాంటి గుడ్లను గర్భిణులు, బాలింతలు, పిల్లలకు పెడితె కొత్త రోగాలు రావా మరి!. నాణ్యమైన గుడ్లను సరఫరా చేయాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా చాలాకాలం నిల్వ ఉన్న గుడ్లను సరఫరా చేస్తుండడంతో ఇలాంటి పరిస్థితి నెలకొంది. గుడ్లు కూడా చిన్న సైజులో ఉంటున్నాయి.
గుడ్లు పంపిణీ చేస్తున్న వారిపై అధికారులు ఉదాసీనతవైఖరి అవలంబిస్తుండడంతో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. కేంద్రాలకు వచ్చిన కుల్లినగుడ్లను గుర్తించిన కార్యకర్తలు పక్కన బెట్టారు. ఉన్నత స్థాయి అధికారులకు సమాచారం ఇస్తే చూడకుండా గుడ్లను ఎలా తీసుకున్నారంటూ అడుగుతారనే భయంతో కొందరు వాటిని పాడేయడం జరిగింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు చేప్టకుంటే గర్భిణులకు పౌష్టికాహారం కాదు కదా నాసిరకం ఆహారమే దిక్కవుతుందని చెప్పవచ్చు.
తిప్పిపంపుతాం
కుల్లిపోయిన గుడ్లు వచ్చిన విషయాన్ని ఐసీడీఎస్ సూపర్‌వైజర్ సరళాదేవిని ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా ప్రతి కేంద్రానికి తాజా గుడ్లు సదరు కాంట్రాక్టర్ ఇవ్వాల్సిందే అన్నారు. నాణ్యతగా లేని గుడ్లను మరలా తిప్పిపంపుతామని, వాటిని పంపిణీ చేయకుండా కార్యకర్తలకు ఆదేశిస్తానని చెప్పారు.
Advertisement