పార్వతమ్మను కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్న గాలివీడు ఎస్‌ఐ మంజునాథ్
సాక్షి కడప : అమ్మకోసం ఎదురుచూపులు.. కళ్లు కాయలు కాస్తున్నా కనిపించడం లేదు..అమ్మ రాక..నాన్న లేక..అనుక్షణం పిల్లలు తల్లిదండ్రులను తలుచుకుంటూ పడిన వేదన వర్ణణాతీతం. ‘సాక్షి’లో వరుసగా కథనాలు రావడం... స్పందించిన అధికారులు కదలడం... దేవుడి ఆశీర్వాదంతో ఎట్టకేలకు ఆ తల్లి సొంత ఊరుకి చేరుకున్నారు. చిన్నారులు తన్మయత్వంతో ఒకరినొకరు ఆలింగనం చేసుకుని మురిసిపోయారు. చెప్పడానికి... పంచుకోవడానికి కూడా మాటలు రాని ఆనందంలో ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు. కుటుంబం కోసం సౌదీలో ఎన్నో కష్టాలు పడిన తల్లి పార్వతమ్మ స్వగ్రామంలో కుటుంబ సభ్యులను చూడగానే పడిన ఆనందం అంతా ఇంతా కాదు.గాలివీడు మండలం రెడ్డివారిపల్లెకు చెందిన పార్వతమ్మ సరిగ్గా మూడేళ్ల క్రితం కుటుంబ జీవనం కోసం కువైట్‌కు వెళ్లింది. రెండేళ్ల వరకు ఒక్క ఫోన్‌కాల్ లేదు. అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలియదు.
పార్వతమ్మ ఎలా ఉందో తెలియని పరిస్థితి. కుటుంబ సభ్యులు తల్లడిల్లుతూనే ఆమె ఆచూకీ కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు. పార్వతమ్మ కువైట్‌కు వెళ్లినప్పటి నుంచి చిన్నారులను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్న రామసుబ్బమ్మ 2017 జూన్ ప్రాంతంలో కడపకు వచ్చి కలెక్టర్, ఎస్పీలను కలిసింది. ఈ ఏడాది జూన్ మాసంలో ఆమె పాముకాటుతో మృతి చెందింది. అంతకుముందు పార్వతమ్మ భర్త నాగేంద్రనాయుడు కూడా తనువు చాలించారు. అప్పటినుంచి ఐదుగురు పిల్లలను వెంకట రమణనాయుడు చూసుకుంటూ వస్తున్నారు. నడవడం కష్టంగా ఉన్నా చిన్నారులను మాత్రం కంటికి రెప్పలా కాపాడుకుంటూవచ్చారు. ఈ క్రమంలో 2018లో వెంకట రమణనాయుడు మనవళ్లు మనవరాళ్లతో కలిసి కడపలోని డీఆర్‌డీఏ అధికారులు,ఎస్పీని కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. ఎస్పీ బాబూజీ అట్టాడ బంధం యాప్ ద్వారా ప్రత్యేకంగా రప్పించేందుకు తమవంతుగా ప్రయత్నం చేశారు. అలాగే గాలివీడు ఎస్‌ఐ రఘునాథ్ కూడా స్థానిక ఏజెంటును పిలిపించి గట్టిగా మందలించడం, రెండు నెలల్లోపు పార్వతమ్మను పిలిపించాలని ఆదేశాలు ఇవ్వడంతో ఎట్టకేలకు పార్వతమ్మను సొంతూరికి పిలిపించారు.
ఎమ్మెల్యే గడికోట చొరవ
పార్వతమ్మ కువైట్‌కు వెళ్లి మూడేళ్లయినా ఆచూకీ లేని నేపథ్యంలో ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి విషయం తెలుసుకుని చొరవ చూపారు. కువైట్‌లో ఉన్న వైఎస్సార్ సీపీ గల్ఫ్ కన్వీనర్ బీహెచ్ ఇలియాస్‌తోపాటు మరికొందరితో మాట్లాడారు. పలుమార్లు కువైట్‌లో ఉన్న తెలుగు వారితో చర్చిస్తూ పార్వతమ్మను రప్పించడంలో తనవంతు పాత్ర పోషించారు.
కదిలించిన ‘సాక్షి’కథనాలు
కువైట్‌కు వెళ్లిన పార్వతమ్మ ఆచూకీ దొరకని విషయాన్ని తెలుసుకున్న సాక్షి వరుస కథనాలతో కదలిక తెచ్చింది. అంతేకాకుండా ‘సాక్షి’ప్రతినిధి మానవీయ కోణంలో ఆలోచనచేస్తూ సంబంధిత డీఆర్‌డీఏ అధికారులతో మాట్లాడటంతోపాటు జిల్లా పోలీసు అధికారులకు ప్రతిసారి గుర్తుచేస్తూ వచ్చారు. 2017 నుంచి ‘అమ్మకోసం, ఏదీ పార్వతమ్మ, అమ్మలేదు–అవ్వరాదు, అమ్మ కావాలి, ఎదురుచూపులు’శీర్షికలతో సాక్షిలో కథనాలు ప్రచురితమయ్యాయి. పోలీసులు కూడా స్పందించి ఏజెంట్ల ద్వారా చర్చించారు. పార్వతమ్మ సొంతూరికి రావడంలో సాక్షి ఎనలేని కృషిని గ్రామస్తులు అభినందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment