![People Successfully Completed Diya Jalao In AP Against Covid-19 - Sakshi](/styles/webp/s3/article_images/2020/04/6/jjjj.jpg.webp?itok=sU0T4Si8)
తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో క్యాండిల్ వెలిగించి కరోనాపై పోరుకు సంఘీభావం తెలుపుతున్న సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: కరోనాపై పోరుకు సంఘీభావంగా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునకు.. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మన సమైక్యతను చాటాలని సీఎం వైఎస్ జగన్ విజ్ఞప్తికి.. రాష్ట్రం యావత్తూ సానుకూలంగా స్పందించింది. వాడవాడలా ప్రజలు ఆదివారం రాత్రి దీప ప్రజ్వలన చేశారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కూడా గుంటూరు జిల్లా తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో దీపాలు వెలిగించి కరోనా వైరస్‌పై పోరుకు సంఘీభావాన్ని తెలిపారు. ఆయనతోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్‌తోపాటు ఇతర ఉన్నతాధికారులు, సిబ్బంది కూడా దీపాలు వెలిగించారు. అలాగే, రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ దంపతులు కూడా రాజ్‌భవన్‌లో దీప ప్రజ్వలన చేశారు. అనంతరం ఆయన ఓ ప్రకటన విడుదల చేస్తూ.. కరోనాపై పోరుకు సంఘీభావంగా ప్రజలు దీపాలు వెలిగించడం ద్వారా తమ ఐక్యతను చాటారని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు అందరూ దీపాలు వెలిగించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా హైదరాబాద్‌లోని తన నివాసంలో దీపం వెలిగించారు. ఆయనతోపాటు కుమారుడు లోకేష్, మనుమడు దేవాన్‡్ష దీపాలు వెలిగించి పట్టుకున్నారు.
ప్రజల నుంచి విశేష స్పందన
కరోనా వైరస్‌పై పోరుకు సంఘీభావంగా దీప ప్రజ్వలన కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు స్వచ్ఛందంగా దీపాలు వెలిగించి తామంతా ఒక్కటేనని చాటి చెప్పారు. ఆదివారం రాత్రి సరిగ్గా 9 గంటలకు ప్రజలు తమ ఇళ్లల్లో కరెంటు లైట్లు ఆర్పి వేశారు. నూనె దీపాలు, కొవ్వొత్తులు వెలిగించారు. ‘దీప ప్రజ్వలన’ కార్యక్రమం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రభుత్వ యంత్రాంగం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది.
కరోనాపై పోరులో అందరం ఒక్కటిగా నిలుద్దాం
దీపాలు వెలిగించి మన ఐక్యతను చాటడం ద్వారా కరోనా మహమ్మారిపై పోరులో దేశమంతా ఒక్కటిగా నిలిచింది. ఇక ముందు కూడా ఈ పోరులో అందరం ఒక్కటిగా నిలుద్దాం.
– ఆదివారం రాత్రి సీఎం వైఎస్ జగన్ ట్వీట్
Comments
Please login to add a commentAdd a comment