'ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడి సభకు అనుమతి తెచ్చుకుంటాం'
సభలకు అనుమతి మంజూరు చేసే విషయంలో రాష్ట్ర పోలీసులు అవలంభిస్తున్న వైఖరి విమర్శలకు తావిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్లో నిర్వహించదలచిన 'సమైక్య శంఖారావం' సభకు శాంతి భద్రతల సమస్య సాకుతో అనుమతి నిరాకరించారు. ప్రభుత్వం, పోలీసులు కలసి ప్రజాస్వామ్య హక్కులను కాలరాశారని వైఎస్ఆర్ సీపీ నేత జూపూడి ప్రభాకరరావు విమర్శించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడి సభకు అనుమతి తెచ్చుకుంటామని స్పష్టం చేశారు.
రాష్ట్ర విభజన ప్రకటన వచ్చిన తర్వాత హైదరాబాద్లో నాలుగు సభలకు అనుమతిచ్చారని, జగన్ సభకు శాంతిభద్రతల సమస్య పేరుతో అనుమతి నిరాకరించడం విడ్డూరమని ధ్వజమెత్తారు. బీజేపీ నేత నరేంద్ర మోడీ, ఏపీఎన్జీవోల సమావేశాలు నిర్వహించినపుడు వైసీపీకి ఎందుకు అనుమతివ్వరని జూపూడి ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి సమైక్యవాది ముసుగులో ఉన్న విభజన వాదని, కుట్రలో భాగంగానే శాంతియుత పద్ధతిలో నిర్వహించదలచిన సభను అడ్డుకున్నారని మరో నేత ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.