మిన్నంటిన నిరసనలు | Protests All over Andhra Pradesh On TDP And Chandrababu | Sakshi
Sakshi News home page

మిన్నంటిన నిరసనలు

Published Sat, Jan 25 2020 4:30 AM | Last Updated on Sat, Jan 25 2020 4:30 AM

Protests All over Andhra Pradesh On TDP And Chandrababu  - Sakshi

రాయదుర్గంలో..

పాలన వికేంద్రీకరణ, అన్ని జిల్లాల్లోనూ సమతుల అభివృద్ధి సాధించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు అడ్డు తగులుతున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, టీడీపీ తీరుపై రాష్ట్ర వ్యాప్తంగా వెల్లువెత్తిన ఆగ్రహ జ్వాలలు శుక్రవారం కూడా కొనసాగాయి. పలుచోట్ల చంద్రబాబు దిష్టి బొమ్మలను, ఆయన ఫొటోతో కూడిన ఫ్లెక్సీలను దహనం చేశారు. మేధావులు, విద్యార్థులు, యువత, వివిధ వర్గాల ప్రజలు చంద్రబాబు అండ్‌ కో తీరుపై తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేశారు.     
–సాక్షి, నెట్‌వర్క్‌

సాక్షి నెట్‌వర్క్‌: చంద్రబాబు, టీడీపీ నేతల తీరుపై విశాఖపట్నం జిల్లాలో శుక్రవారం కూడా ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తాయి. 15 నియోజకవర్గాల్లో చంద్రబాబు దిష్టిబొమ్మలను ఊరేగించి దహనం చేశారు. రాస్తారోకోలు, మానవ హారాలు, టీడీపీ ప్రజాప్రతినిధుల ఇళ్ల ముట్టడి వంటి ఆందోళనలు మిన్నంటాయి. టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు దిష్టిబొమ్మను నగరమంతా ఊరేగించి శవయాత్ర జరిపి దహనం చేశారు. ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న దిష్టి బొమ్మను కూడా తగులబెట్టారు. విశాఖ తూర్పు, పెందుర్తి, పాడేరు, అరకు, చోడవరం నియోజకవర్గాల్లో విద్యార్థులు, యువకులు రాస్తోరోకో చేసి చంద్రబాబు దిష్టిబొమ్మలను దహనం చేశారు.

ఆంధ్రా వర్సిటీలో ట్రేడ్‌ యూనియన్, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు జరిగాయి. ఏయూ ఉద్యోగుల సంఘం పరిపాలనా భవనం ఎదురుగా నిరసన తెలిపి, చంద్రబాబు ఫొటోతో కూడిన ఫ్లెక్సీని తగులబెట్టారు. ఏయూ రాజనీతి శాస్త్ర విభాగంలో విశ్రాంత ఉప కులపతులు, ఆచార్యులు, మేధావులు రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. వైఎస్సార్‌ ట్రేడ్‌ యూనియన్‌ నాయకులు అర్ధనగ్న ప్రదర్శన, కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి, టీడీపీ విధానాలను, బాబు వైఖరిని ఖండించారు. కాగా, పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు ద్వారకాతిరుమలలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.

దళిత ద్రోహి, అభివృద్ధి వ్యతిరేకి చంద్రబాబు
చంద్రబాబు వైఖరిని ఎండగడుతూ గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండల పరిషత్, తహసీల్దార్‌ కార్యాలయాల సముదాయం ఎదుట ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. దళితుల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కృషి చేస్తుంటే చంద్రబాబు దళిత ద్రోహిగా మారారని ధ్వజమెత్తారు. గుంటూరు శంకర విలాస్‌ సెంటర్‌లో మహిళలు చంద్రబాబు చిత్రపటాన్ని చీపుర్లతో కొట్టి, ఇకనైనా ఆయన బుద్ధి తెచ్చుకోవాలంటూ నినదించారు. 

రాయలసీమ ద్రోహి చంద్రబాబు
వికేంద్రీకరణను అడ్డుకుంటున్న బాబు సీమ ద్రోహి అని వైఎస్సార్‌సీపీ నాయకులు మండిపడ్డారు. కర్నూలు జిల్లావ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. నియోజకవర్గాల్లో రాస్తారోకోలు, చంద్రబాబు దిష్టిబొమ్మ దహనాలు, ర్యాలీలు నిర్వహించారు. కొండారెడ్డి బురుజు నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ చేశారు.

చంద్రబాబు 420గా మిగిలిపోయారు
రాయలసీమలో పుట్టిన చంద్రబాబు తన స్వార్థం కోసం సీమకే ద్రోహం చేస్తున్నారని అనంతపురం జిల్లా ప్రజానీకం మండిపడింది. చంద్రబాబు ద్రోహాన్ని నిరసిస్తూ రాయదుర్గంలో శుక్రవారం బైక్‌ ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు దిష్టిబొమ్మతో వినాయక సర్కిల్‌ వరకు ర్యాలీ జరిపారు. వైఎస్సార్‌ సీపీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌని ఉపేంద్రరెడ్డి మాట్లాడుతూ.. మండలిలో వికేంద్రీకరణ బిల్లు అడ్డుకున్న చంద్రబాబు రాయలసీమ వాసుల మదిలో 420గా మిగిలిపోయారన్నారు.

చంద్రబాబు శకునిలా తయారయ్యారు
తిరుపతిలో ఎస్వీయూ పరిపాలన భవనం వద్ద రాయలసీమ మేధావుల ఫోరం, వైఎస్సార్‌ విద్యార్థి, యువజన విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులు, మేధావులు చంద్రబాబు తీరుకు నిరసనగా ధర్నా చేశారు. చిత్తూరు నగరంలోని దుర్గమ్మ ఆలయం నుంచి కలెక్టరేట్‌ వద్దనున్న వైఎస్సార్‌ విగ్రహం వరకు మహిళా సంఘాల నాయకులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబు శకునిలా తయారయ్యారని దుయ్యబట్టారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement