లైన్ క్లియర్
- గుంటూరు రైల్వేలైను డబ్లింగ్‌కు మోక్షం
- రూ.20కోట్ల విడుదలకు అనుమతులు
- రాజధానికి పెరగనున్న కనెక్టివిటీ
తెనాలి-గుంటూరు మధ్య రైల్వేలైను డబ్లింగ్ పనులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. మూడేళ్ల జాప్యం తర్వాత ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసిన కొద్దిరోజులకే పనుల ప్రారంభానికి రూ.20 కోట్ల నిధులు విడుదల చేసింది. గుంటూరు, చెన్నై- విజయవాడ మార్గంలోని తెనాలి జంక్షన్ మధ్య రెండోలైను నిర్మాణంతో సీఆర్‌డీఏ పరిధిలోని పట్టణాలు, న గరాల మధ్య ప్రయాణ సౌకర్యాలు మెరుగవుతాయి. గుంటూరుకు కొత్తరైళ్ల రాక పోకలకు, మెట్రో నగరాలకు వెళ్లే పలు రైళ్లను తెనాలికి పొడిగించే అవకాశ మూ ఏర్పడుతుంది.
ప్రయాణ సౌకర్యాలు విస్తృతం
రైల్వేలైను డబ్లింగ్ ఫలితంగా ప్రయాణ సౌకర్యాలు విస్తృతం కానున్నాయి. విజయవాడ-గుంటూరు-తెనాలి మధ్య ఇప్పటికే పరిమితంగా సర్క్యులర్ రైళ్లు నడుస్తున్నాయి. డబ్లింగ్ తర్వాత మరికొన్ని సర్క్యులర్ రైళ్లు అందుబాటులోకి వస్తాయి. విజయవాడలో మెట్రో రైల్వే ప్రాజెక్టు రానున్నందున సర్క్యులర్ రైలు నుంచి విజయవాడలో మెట్రోను అందుకుని అక్కడ ఏ ప్రాంతానికైనా తక్కువ వ్యయంతో చేరుకునేలా ప్రయాణ సౌలభ్యం సమకూరుతుంది. రాజధానికి కొత్తరైళ్లు నడిపేందుకు వెసులుబాటూ చిక్కుతుంది. గుంటూరుకు వచ్చే బెంగళూరు-విజయవాడ ఎక్స్‌ప్రెస్ రైళ్ల వంటివి తెనాలి వరకు పొడిగించవచ్చు. ఎప్పటి నుంచో పెండింగులో ఉన్న రేపల్లె-తెనాలి రైల్వేలైన్‌ను డబ్లింగ్ చేయగలిగితే తీరప్రాంతం నుంచి కనెక్టివిటీ పెరుగుతుంది.
స్థల సేకరణకు నోటిఫికేషన్
తెనాలి : తెనాలి నుంచి 24.38 కిలోమీటర్ల దూరంలోని గుంటూరుకు ఉన్న సింగిల్ లైనుకు అదనంగా మరో లైను నిర్మాణానికి ఎప్పటినుంచో ప్రతిపాదనలు ఉన్నాయి. దీనికి రైల్వేశాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చి ఎంతో కాలమైనా పరిపాలన అనుమతుల్లో జాప్యం జరుగుతూ వచ్చింది. మొత్తం రూ.147 కోట్లతో రెండోలైను నిర్మాణానికి నిబంధనల ప్రకారం రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆర్‌వీఎన్‌ఎల్), రాష్ర్ట ప్రభుత్వం చెరి సగం భరించాల్సి ఉంది. రోశయ్య సీఎంగా ఉండగా, తెనాలి-గుంటూరు, శ్రీకాళహస్తి-నడికుడి మధ్య డబ్లింగ్ పనులకు 50 శాతం నిధులు ఇచ్చేందుకు సుముఖత చూపారు. ఆ తరువాత అది కార్యరూపం దాల్చలేదు. అప్పటి నుంచి పెండింగ్‌లో ఉన్న ఈ పనులకు గుంటూరు రాజధానిగా ఎంపిక చేశాక కదలిక వచ్చింది.
తెనాలి-గుంటూరుతోపాటు విజయవాడ-గుడివాడ-నరసాపురం-భీమ వరం-మచిలీపట్నం రైల్వేలైను డబ్లింగ్, విద్యుద్దీకరణ పనులకు రూ.120 కోట్లకు కార్యనిర్వాహక అనుమతులు మంజూరు చేస్తూ మే నెలాఖరులో ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ రెండు ప్రాజెక్టుల మొత్తం వ్యయం రూ.1,140 కోట్లు అంచనా. ఇందులో విజయవాడ-మచిలీపట్నం రైలుకు రూ.100 కోట్లు కేటాయించారు. తెనాలి-గుంటూరు మధ్య గతంలోనే అవసరమైన భూమిని సేకరించగా, ప్రస్తుతం మరో 10 ఎకరాల స్థలసేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది. అంగలకుదురు, సంగంజాగర్లమూడి, వడ్లమూడి, శేకూరు, వేజండ్ల గ్రామాలకు చెందిన 89 మంది రైతుల నుంచి ఈ స్థలాన్ని సేకరించాల్సి ఉంది. న్యాయమైన పరిహారం ఇస్తే సమ్మతిస్తామని ఇటీవల సంబంధిత రైతులు జిల్లా జాయింట్ కలెక్టర్ (2)తో ఏర్పాటైన సమావేశంలో అంగీకరించారు.