వేటు..లే టు! | Rajampeta MPP suharlata face disqualification | Sakshi
Sakshi News home page

వేటు..లే టు!

Published Tue, Aug 19 2014 3:43 AM | Last Updated on Tue, May 29 2018 4:15 PM

Rajampeta MPP suharlata face disqualification

ఎర్రగుంట్ల మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక సమయంలో విప్ ధిక్కరించిన ఎనిమిది మంది వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లపై అనర్హత వేటు వేసేందుకు అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన ఇద్దరు నేతల దెబ్బకు భయపడి వేటుకు వెనుకంజ వేస్తున్నట్లు తెలుస్తోంది.
 
సాక్షి ప్రతినిధి, కడప: ఆయన పేరు రంగన్న. యర్రగుంట్ల మున్సిపల్ ఛెర్మైన్ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా విధులు నిర్వర్తించారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యతాయుతమైన వ్యక్తి. చట్టాన్ని అమలు చేయాల్సిన ఆయన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. విప్ ధిక్కరించిన 8 మంది కౌన్సిలర్లపై వేటు వేసే విషయంలో ఉదాసీనతతో వ్యవహరిస్తున్నారు.
 
యర్రగుంట్ల మున్సిపాలిటీలో 18మంది కౌన్సిలర్ స్థానాలను వైఎస్సార్‌సీపీ గెల్చుకుంది. కేవలం 2 స్థానాలు మాత్రమే టీడీపీ దక్కించుకుంది. అధికారం అండతో 8 మంది వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లను స్థానిక ‘దేశం’ నేతలు ప్రలోభాలకు గురిచేశారు. దాంతో వైఎస్సార్‌సీపీ తరపున గెలిచిన కౌన్సిలర్లు పచ్చ కండువాలు కప్పుకున్నారు. ఆ మేరకు ఛెర్మైన్, వైస్ ఛెర్మైన్ ఎన్నికలకు లాటరీ అనివార్యమైంది. కాగా వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు విప్ ధిక్కరించడంతో ఆ పార్టీ నేతలు రిటర్నింగ్ అధికారి రంగన్నకు ఫిర్యాదు చేశారు.
 
ఆ మేరకు నోటీసులు సైతం జారీ చేశారు. అయితే చర్యలు తీసుకునేందుకు జంకుతున్నారు. ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల్ని అమలు పర్చేందుకు సైతం వెనుకంజ వేస్తున్నారు. కేవలం ఇద్దరు నేతలను సంతృప్తిపర్చేందుకేనని పలువురు అభిప్రాయపడుతున్నారు.

అధికారపార్టీ మెప్పుకోసమే..
అలాంటి పరిస్థితే రాయచోటి మున్సిపాలిటీలోనూ తలెత్తింది. 18 మంది వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు గెలుపొందారు. వారిలో ముగ్గురు ఆ పార్టీ విప్ ధిక్కరించారు. ఆ కారణంగా అక్కడ కూడా లాటరీనే అనివార్యమైంది. విప్ ధిక్కరించిన వారిపై అక్కడి ఆర్‌ఓ అనర్హతవేటు వేశారు. రాజంపేట ఎంపీపీ సుహర్లతపై విప్ ధిక్కారం కారణంగా అనర్హత వేటు పడింది.

తెలుగుదేశం పార్టీ విప్ ధిక్కరించారని వీరపునాయునిపల్లె ఎంపీపీ పద్మలతపై అన ర్హత వేటు వేశారు. జిల్లా వ్యాప్తంగా విప్ ధిక్కరించిన వారిపై చర్యలున్నా యర్రగుంట్లలో 8 మంది కౌన్సిలర్లపై మాత్రమే ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అందుకు కారణం రిటర్నింగ్ అధికారి రంగన్నే అని ఉన్నతాధికారులు సైతం వివరిస్తున్నారు. అధికార పార్టీ నేతలనుంచి ఉన్న ఒత్తిడి ఫలితంగానే చర్యలు తీసుకోవడంలో నాన్చుడు ధోరణి ప్రదర్శిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.  
 
కక్కుర్తితోనే పదవులకు ఎసరు..
జిల్లాలో 11 మంది కౌన్సిలర్లు కాసులకు కక్కుర్తి పడ్డారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులుగా పోటీ చేసి గెలుపొంది టీడీపీ నేతల ప్రలోభాలకు లొంగారు. ఇప్పడు వారందరి పదవులకు ఎసరు వచ్చింది. రాయచోటిలో ముగ్గురు కౌన్సిలర్లపై వేటు పడింది. అలాగే రాజంపేట ఎంపీపీ సుహర్లత అనర్హతకు గురయ్యారు. యర్రగుంట్లలో 8 మంది కౌన్సిలర్లపై తర్వలో అనర్హత వేటు పడనుంది. ఇప్పటికే చర్యలు తీసుకోవాల్సి ఉండగా అధికార పార్టీ ప్రభావంతో కొంత ఆలస్యం అవుతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. కేవలం అధికార పార్టీ వారిచ్చే కాసులకు ఆశపడి పదవులు కోల్పోవాల్సిన దుస్థితి ఏర్పడుతోంది.
 
ఆర్వో రంగన్న ఏమన్నారంటే....
యర్రగుంట్ల మున్సిపాలిటీ పరిధిలో 8మంది కౌన్సిలర్లు వైఎస్సార్‌సీపీ విప్ ధిక్కరించారు. వారిపై అందిన ఫిర్యాదు మేరకు నోటీసులు జారీ చేశాం. ఆమేరకు ఆ కౌన్సిలర్ల నుంచి వివరణ కూడా తీసుకుని ఎన్నికల కమిషన్‌కు వివరించాం. అక్కడి నుంచి ఆదేశాల కోసం వేచి చూస్తున్నాం. ఆదేశాలు అందగానే వేటు వేస్తాం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement