సాక్షి, అమరావతి : దేశంలోని ఏ రాష్ట్రంలో అమలుచేయని విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్‌పై అదనపు పన్ను వేసి వినియోగదారుల నడ్డివిరుస్తోంది. రాష్ట్రంలో ఏటా సుమారు 450 కోట్ల లీటర్ల డీజిల్, 115 కోట్ల లీటర్ల పెట్రోలు వినియోగిస్తున్నట్లు అంచనా. పెట్రోల్, డీజిల్‌పై వేసే వ్యాట్ కాకుండా ప్రతి లీటరుకు అదనంగా వినియోగదారుల జేబులో నుంచి మరో నాలుగు రూపాయలు లాగేస్తున్నారు. దీంతో 450 కోట్ల లీటర్ల డీజిల్‌పై రూ.1,800 కోట్లు, అదేవిధంగా 115 కోట్ల లీటర్ల పెట్రోలుపై రూ. 460 కోట్లు.. మొత్తం కలిపి రూ.2260 కోట్ల మేరకు ప్రతి ఏటా వినియోగదారుల నుండి రాష్ట్ర ప్రభుత్వం ముక్కు పిండి వసూలు చేస్తోంది. ఈ లెక్కన వినియోగదారులకు తెలియకుండానే నెలకు రూ. 188.33 కోట్లు వారి జేబుకు చిల్లు పడుతోంది. ఇలా మూడేళ్లుగా నాలుగు రూపాయల అదనపు పన్ను వసూలు చేస్తుండటంతో ఆ ప్రభావం నిత్యావసర వస్తువుల ధరలపై కూడా కన్పిస్తోంది. చమురు ధరల్లో మన రాష్ట్రానికి, పొరుగునున్న కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా తదితర రాష్ట్రాల్లో వ్యత్యాసం ఎక్కువగా ఉండటంతో అమ్మకాలు లేక రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న సుమారు 600 బంకులకు గాను 200–300 వరకు మూతబడినట్లు సమాచారం. మనకు, పక్క రాష్ట్రాల్లో లీటరుకు రూ.4 తేడా ఉండటంతో సరిహద్దు ప్రాంతాల్లోని వాహనదారులు అక్కడకు వెళ్లి పెట్రోలు, డీజిల్ కొనుగోలు చేస్తున్నారు. దీంతో మన రాష్ట్రం సరిహద్దుల్లోని బంకుల్లో దాదాపు 30 నుంచి 35 శాతం అమ్మకాలు తగ్గాయని అక్కడి బంకుల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ముందు ధరలు తగ్గిస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. హామీని మరచిపోయి అదనపు పన్ను వేయడం అన్యాయమని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయంగా తగ్గిన క్రూడాయిల్ ధరలను పరిశీలిస్తే రాష్ట్రంలో లీటరు పెట్రోల్ రూ.35 ప్రకారం విక్రయించాల్సి ఉండగా రూ.76.27లకు విక్రయించడం ఏ మేరకు సబబమని వారు ప్రశ్నిస్తున్నారు.
అదనపు పన్నుతో తీవ్ర నష్టం
రాష్ట్రంలో పెట్రోలు, డీజిల్‌పై లీటర్‌కు రూ.4 అదనపు పన్ను వేయడంవల్ల వాటి అమ్మకాలపై తీవ్ర ప్రభావం పడింది. సరిహద్దు రాష్ట్రాలో ధరలు తక్కువగా ఉన్నందున అక్కడకెళ్లి కొనుగోలు చేస్తున్నారు. ఈ ప్రభావంతో రాష్ట్రంలో ఈ ఏడాది 16 శాతం కొనుగోళ్లు తగ్గాయి. దీంతో ఒక్కొక్కరు పెట్రోలు బంకులు మూసివేస్తున్నారు. అదనపు పన్ను వసూలు చేస్తున్నందున ఇతర రాష్ట్రాల నుండి వచ్చే లారీలు, ఇతర వాహనదారులు మన రాష్ట్ర సరిహద్దులోని బంకుల్లో డీజిల్, పెట్రోలు నింపుకోవడం లేదు. దీంతో ఇటు ప్రభుత్వానికి అటు బంకుల నిర్వాహకులు, లారీ ట్రాన్స్‌పోర్టు యజమానులు తీవ్రంగా నష్టం వాటిల్లుతోంది. ఈ విషయమై పునరాలోచించాలని ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేసినా స్పందన కన్పించడం లేదు. దీంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా అన్ని వర్గాలపై తీవ్ర ప్రభావం పడుతోంది.
– రావి గోపాలకృష్ణ, రాష్ట్ర పెట్రోలియం ట్రేడర్స్ అధ్యక్షులు.