బీచ్‌రోడ్‌లో స్కూల్‌ బస్‌ బీభత్సం | school bus rams into children's park in Vizag | Sakshi
Sakshi News home page

బీచ్‌రోడ్‌లో స్కూల్‌ బస్‌ బీభత్సం

Published Mon, May 1 2017 10:23 AM | Last Updated on Tue, Sep 5 2017 10:08 AM

బీచ్‌రోడ్‌లో స్కూల్‌ బస్‌ బీభత్సం

బీచ్‌రోడ్‌లో స్కూల్‌ బస్‌ బీభత్సం

జనాలపైకి దూసుకెళ్లిన బస్సు
ఒకరు మృతి, 8 మందికి గాయాలు
ముగ్గురు పరిస్థితి విషమం


సమయం.. రాత్రి 8 గంటలు.. వేసవి సెలవులు, ఆపై ఆదివారం.. ఉదయం నుంచి భానుడు భగ్గుమనడంతో సేద తీరేందుకు పెద్దసంఖ్యలో జనం సాగరతీరానికి చేరుకున్నారు. అంతా ఉత్సాహంతో కేరింతలు కొడుతున్నారు. చిల్డ్రన్‌ పార్క్‌ ఎదురుగా బీచ్‌రోడ్డు గోడపై కూర్చొని కబుర్లు చెప్పుకొంటున్నారు. ఇంతలో.. నోవాటెల్‌ డౌన్‌ నుంచి ఓ ప్రైవేట్‌ స్కూల్‌ బస్సు మృత్యుశకటంలా దూసుకొచ్చింది. ఎదురుగా ఉన్న వారిని ఢీకొట్టింది.. కేరింతలు కాస్తా.. హాహాకారాలుగా మారిపోయాయి. బీచ్‌ రోడ్డు భీతావహంగా మారిపోయింది. సాగరతీరం కన్నీటి సంద్రమైంది. ప్రమాదానికి కారణమైన బస్సు ఒకరిని పొట్టన పెట్టుకోగా, ముగ్గురు మృత్యువుతో పోరాడుతున్నారు. మరో ఐదుగురు గాయపడ్డారు.  

విశాఖ సిటీ/బీచ్‌రోడ్‌/జగదాంబ : బీచ్‌రోడ్డులో ఆదివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఘోర ప్రమాదం సంభవించింది. శ్రీ ప్రకాష్‌ విద్యాసంస్థకు చెందిన బస్సు నోవాటెల్‌ డౌన్‌ నుంచి వేగంగా దూసుకొచ్చి బీచ్‌ రోడ్డు గట్టుపై కూర్చొన్న వారిపైకి వెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులకు కేజీహెచ్‌లో చికిత్స అందిస్తుండగా, పరిస్థితి విషమంగా ఉన్నవారిని మెరుగైన వైద్యం కోసం సెవెన్‌హిల్స్‌ ఆస్పత్రికి తరలించారు. మరణించిన వ్యక్తి విజయవాడ అదనపు ఎస్పీ దూసి నందకిశోర్‌ తండ్రి దూసి ధర్మారావు(85)గా గుర్తించారు. నందకిశోర్‌ గృహప్రవేశం కావడంతో కుటుంబమంతా విశాఖ వచ్చారు. బంధువులతో కలసి సాయంత్రం అంతా బీచ్‌కు రాగా ఈ దుర్ఘటన సంభవించింది. గాయపడిన వారిలో ఏడీఎస్పీ నందకిశోర్‌ సహా, ఆయన కుమారుడు దేవగురు, కుమార్తె మంజీర కూడా ఉన్నారు. వీరిలో కుమారుడు దేవగురు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. గాయపడిన వారిలో విజయవాడకు చెందిన దేవరగట్టు పద్మావతి, దేవరగట్టు ప్రసాదరావు, ఒకే కుటుంబానికి చెందిన పైడిపాల వెంకట్, పైడిపాల సునీత, పైడిపాల వేణుగోపాల్, అన్నపూర్ణ ఉన్నారు. వీరితో సహా గాజువాకు చెందిన తీడ శ్రీకర్‌ అనే తొమ్మిదో తరగతి విద్యార్థికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్‌ పల్లి కృష్ణారావు, కింజరాపు కేశవకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద తీవ్రత ధాటికి బీచ్‌ గోడ ధ్వంసం కాగా.. అక్కడే పార్క్‌ చేసి ఉన్న నాలుగు ద్విచక్ర వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి.

రచయితను కోల్పోయిన ఉత్తరాంధ్ర
విశాఖ సిటీ : బీచ్‌రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన దూసి ధర్మారావు ప్రముఖ రచయిత. శ్రీకాకుళం జిల్లా దూసి గ్రామానికి చెందిన రిటైర్డ్‌ ఇంగ్లిష్‌ అధ్యాపకుడు ధర్మారావు. ప్రస్తుతం జిల్లాలో ఇంటాక్‌ శ్రీకాకుళం ఛాప్టర్‌ కన్వీనర్‌గా పని చేస్తూ జిల్లాలోని ప్రాచీన సాహితీ, సాంస్కృతిక పరిరక్షణకు సేవలు అందిస్తున్నారు. ఇటీవల ఆయన రచించిన ‘సామ్రాట్‌ చోడ గాంగ’ చారిత్రాత్మక నాటకం ఆకాశవాణి నాటకోత్సవాల్లో మార్చి 23వ తేదీన ఉదయం 9.30 గంటలకు ప్రసారమైంది. ఆయన తాళపత్ర గ్రంథాల సేకరణకు చాలా కృషి చేశారు. సుమారు 15 వరకూ రచనలు చేశారు. శ్రీకాకుళం జిల్లా విశేషాలు, సామాజిక వ్యవహారాలు, చరిత్ర పై ధర్మారావు రాసిన పుస్తకాలు ప్రశంసలు అందుకున్నాయి. ఈయన మృతితో ఉత్తరాంధ్ర కలం మూగబోయింది.

కుమారుడి గృహప్రవేశానికి వచ్చి.. మృత్యుఒడి చేరిన దూసి ధర్మారావు
కొద్దిగంటల క్రితం వరకు మామిడి తోరణాలతో కళకళలాడిన ఆ ఇల్లు శోకనిలయమైంది. కుమారుడి గృహప్రవేశానికి ఎంతో ఆనందంగా వచ్చిన ఆ తండ్రి మృత్యుశకటానికి బలయ్యారు. రెప్పపాటులో జరిగిన ప్రమాదం ఆ ఇంటి పెద్దను మృత్యుఒడికి చేర్చింది. బంధువులతో కలసి సరదాగా సాగరతీరానికి వెళ్లిన శ్రీకాకుళానికి చెందిన ప్రముఖ కవి, రచయిత దూసి ధర్మారావు (85) తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.

ధర్మారావు కోరికపైనే..
విజయవాడలో అదనపు ఎస్పీగా పని చేస్తున్న నంద కిశోర్‌ మధురవాడలో కొత్త ఫ్లాట్‌ కొనుగోలు చేశారు. శనివారం గృహప్రవేశం చేశారు. బంధువులంతా ఉండడంతో బీచ్‌కు వెళ్దామని ధర్మారావే కోరారు. దీంతో కుటుంబ సభ్యులంతా బీచ్‌కు వచ్చారు. మొదట వేరే స్థలంలో కూర్చున్న కుటుంబసభ్యులు వారి పక్కన నీరు ఉందని, అక్కడి నుంచి గోడ వద్దకు వచ్చి కూర్చున్నారు.

చిన్నాన్న బతికించాడు
వేసవి సెలవులకు శ్రీకర్‌ ఇక్కడికి వచ్చాడు. సోమవారం విజయనగరం వెళ్లవలసి ఉంది. బీచ్‌కు వెళ్దామని కోరడంతో గాజువాక నుంచి మేం కుటుంబం అంతా కలసి బీచ్‌కు వచ్చాం. బస్సు దూసుకు వస్తున్న సమయంలో శ్రీకర్‌ చిన్నాన్న చూసి వెంటనే అతన్ని పక్కకి లాగటంతో తీవ్ర గాయాలైనా, బతికి బయటపడ్డాడు. – జి.సత్యవతి, టి.శ్రీకర్‌ బంధువు

పరిశీలించిన కమిషనర్‌
ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే నగర పోలీస్‌ కమిషనర్‌ æయోగానంద్‌ ఘటనా స్థలిని పరిశీలించారు. ఆదివారం కావడంతో బీచ్‌ రోడ్డులో పోలీస్‌ బందోబస్తు ఎక్కువగా ఉండటంతో, ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు స్పందించి క్షతగాత్రులను హుటాహుటిన 108 వాహనంలో ఆస్పత్రికి తరలించగలిగారు. ప్రమాద తీవ్రతను పరిశీలించిన సీపీ, బస్సు కండిషన్‌ను పరిశీలించాలని రవాణాశాఖ అధికారులకు సూచించారు. రవాణాశాఖ అధికారులు బస్సుని పరిశీలించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement