పురందేశ్వరి
అప్పుడే అత్యాచారాలను అడ్డుకోవచ్చు: కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి
కిస్ ఆఫ్ లవ్‌ను కమ్యూనిస్టులే ప్రోత్సహిస్తున్నారు: ఏబీవీపీ జాతీయ అధ్యక్షుడు
సాక్షి, విజయవాడ బ్యూరో: దేశంలో అత్యాచారాలు ఆగాలంటే సమాజంలో మార్పు రావాలని, ఈ మార్పు ప్రతి ఇంటి నుంచి ప్రారంభం కావాలని కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ఆడపిల్లలను మగపిల్లలతో సమానంగా చూడాల్సిన బాధ్యత అమ్మలదేనన్నారు. విజయవాడలో 2 రోజులుగా జరుగుతున్న ఏబీవీపీ రాష్ట్ర స్థాయి మహిళా సమ్మేళనం ముగింపు సభలో శనివారం ఆమె ప్రసంగించారు.
ఆడపిల్లలకు 18 ఏళ్ల వయసులోపు పెళ్లిళ్లు నిరోధించడం, వరకట్న నిరోధం, గృహ హింస, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు వంటి అనేక చట్టాలు అమల్లో ఉన్నా వాటిని యథేచ్ఛంగా ఉల్లంఘిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు ఏటా 9 శాతం చొప్పున పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అత్యాచారాలకు పేదరికం కూడా మరో ప్రధాన కారణమని, పేదరిక నిర్మూలనకు జాతీయ మిషన్‌ను ఏర్పాటు చేయాల్సివుందని అన్నారు.
రాజధానికి భూ సమీకరణ వల్ల రైతులకు నష్టం జరగదని, దీనిపై ప్రభుత్వం చర్చలు జరుపుతుందని పురందేశ్వరి చెప్పారు. సమ్మేళనంలో పాల్గొన్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ యూపీఏ ప్రభుత్వంలో వచ్చిన భూసేకరణ చట్టం వల్ల పరిశ్రమలకు ఇబ్బందులున్నాయని, దాన్ని మార్చడానికి ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని తెలిపారు.
మీ పిల్లలను కిస్ ఆఫ్ లవ్‌కు పంపుతారా?
ఏబీవీపీ జాతీయ అధ్యక్షుడు మురళీమనోహర్ మాట్లాడుతూ.. మార్క్సిస్టు సిద్ధాంతాన్ని అనుసరించే సీపీఐ, సీపీఎం పార్టీలే కిస్ ఆఫ్ లవ్‌లను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ఆయా పార్టీల వారు తమ పిల్లలను ఇలాంటి వాటికి పుంపుతున్నారా? అని ప్రశ్నించారు. పిల్లల పెంపకంలో తల్లుల మైండ్‌సెట్ మారాలని సూచించారు. కాగా, రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన విద్యార్థినులకు వివిధ అంశాలపై బృంద చర్చలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు. సమ్మేళనంలో పాల్గొన్న వారికి తులసి మొక్కలు అందించారు.