లోకహితానికే తెలంగాణబోనాలు
సాక్షి, హైదరాబాద్: కుటుంబం లేదా తాను బాగుండాలని తిరుపతికి వెళ్లి మొక్కుకుంటారని, ఊరంతా బాగుండాలని తెలంగాణలో బోనం ఎత్తుకుంటారని తెలంగాణ జేఏసీ చైర్మన్ ఎం.కోదండరాం అన్నారు. ఇందిరాపార్కులో జేఏసీ నిర్వహిస్తున్న శాంతిదీక్షలో ఆయన మాట్లాడారు. తెలంగాణకు, సీమాంధ్రకు ఇలాంటి చాలా వ్యత్యాసాలు ఉన్నాయన్నారు. తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టడం ద్వారా విభజన నిర్ణయాన్ని ఆపాలని సీమాంధ్ర సంపన్నులు, రాజకీయ నేతలు కుట్రలకు దిగుతున్నారని ఆరోపించారు. న్యాయ బద్ధమైన తెలంగాణ కోసం 60 ఏళ్ల్లు పోరాడామని, మరో ఆరురోజులు ఓపికతో కొట్లాడలేమా అని ప్రశ్నించారు.
హైదరాబాద్ అభివృద్ధి సమైక్య రాష్ట్రంలో జరిగింది కాదన్నారు. 1918లోనే హైదరాబాద్‌లో సిటీ ఇంప్రూవ్‌మెంట్ బోర్డు (నగరాభివృద్ధి మండలి)ని నిజాం ఏర్పాటుచేశారని వెల్లడించారు. 1998-2004 మధ్యకాలంలో వందలాది ప్రభుత్వ రంగ సంస్థలు మూతపడ్డాయని వెల్లడించారు. దీని వల్ల తెలంగాణలోనే 25 వేలమంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారని చెప్పారు. ఉపాధి కల్పించే పరిశ్రమలను మూయించి, ఆ భూములను రియల్‌ఎస్టేట్ వ్యాపార సంస్థలకు ప్రభుత్వం అప్పగించిందని విమర్శించారు. హైదరాబాద్‌లోని చెరువులను కబ్జా చేసి సినిమా థియేటర్లు కట్టించిన చరిత్ర సమైక్య రాష్ట్రానికి ఉందన్నారు. ఎంపీ జి.వివేక్ మాట్లాడుతూ సీఎం కిరణ్ సీమాంధ్రకే ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. దీక్షలో ఎమ్మెల్సీ మహమూద్ అలీ, ఎంబీటీ, జేఏసీ అగ్రనేతలు పాల్గొన్నారు.