= విద్యార్థులకు ఉపకార వేతనాల ఇక్కట్లు
= సెల్ నంబర్, ఆధార్ లింక్‌తో అవస్థలు
= 30 వేల మంది విద్యార్థులకు 8 వేల మందే నమోదు
మార్కాపురం, న్యూస్‌లైన్: ఉపకార వేతనాల కోసం విద్యార్థులు నానా అగచాట్లు పడుతున్నారు. ప్రభుత్వం ఉపకార వేతనాలను ఆధార్ కార్డు, సెల్‌ఫోన్ నంబరుకు లింకు పెట్టడంతో అసలుకే మోసం వచ్చేలా ఉంది. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా జిల్లాలో దాదాపు 30 వేల మంది విద్యార్థులు ఉపకార వేతనాలకు అర్హులు కాగా, ఇప్పటి వరకు 8 వేల మంది మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
ఈ ఏడాది నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి పథకానికీ ఆధార్ కార్డును అనుసంధానం చేశాయి. ఇందులో భాగంగా ఇంటర్మీడియెట్ నుంచి పీజీ వరకు, ఇంజినీరింగ్, ఫార్మసీ, బీఈడీ, టీటీసీ, డీఈడీ, ఇతరత్రా వృత్తివిద్యా కోర్సులను అభ్యసించే వారంతా ఆన్‌లైన్‌లో ఉపకార వేతనం కోసం దరఖాస్తు చేసుకోవాలంటే ఆధార్‌కార్డు, సెల్‌ఫోన్ నంబరును నమోదు చేయాల్సి వస్తోంది. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు చెందిన 123 జూనియర్ కాలేజీలు, 77 డిగ్రీ కాలేజీలు, 22 ఇంజినీరింగ్ కాలేజీలు, 9 ఫార్మసీ కాలేజీలు, 50 బీఈడీ కాలేజీలు, 67 టీటీసీ కాలేజీలుండగా వీటిలో దాదాపు 30 వేల మంది విద్యార్థులు ఉపకార వేతనాలకు అర్హులు.
గత ఏడాది నేరుగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండగా.. ఈ ఏడాది దరఖాస్తు చేసుకోవాలంటే ఆధార్‌కార్డు నంబర్‌ను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. దీంతో పాటు సెల్‌ఫోన్ నంబరును కూడా దరఖాస్తులో నమోదు చేస్తే పాస్‌వర్డ్ వస్తుంది. ఆ పాస్‌వర్డ్‌ను దరఖాస్తులో నమోదు చేస్తేనే అప్‌లోడ్ అవుతోంది. ఒక సెల్ నంబరుకు ఒక పాస్‌వర్డ్ మాత్రమే వస్తోంది. ఒకే ఇంట్లో ముగ్గురు విద్యార్థులు చదువుతుంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం మూడు సెల్‌ఫోన్లు వాడాల్సిందే. ఈ నిబంధన గ్రామీణ ప్రాంత విద్యార్థులకు శాపంగా మారింది. ప్రభుత్వం మాత్రం మీసేవా కేంద్రాల్లో నమోదు చేసుకుంటే సరిపోతుందని చెప్పి చేతులు దులుపుకుంది.
మూడు నెలల కిందట ఆధార్ కార్డుల కోసం ఫొటోలు తీయించుకున్నప్పటికీ ఇంత వరకు కార్డులు రాకపోవడంతో ఆన్‌లైన్‌లో విద్యార్థులు ఉపకార వేతనాల కోసం దరఖాస్తులు చేసుకోలేకపోతున్నారు. గత ఏడాది నవంబర్ నాటికి ఈ ప్రక్రియ పూర్తయి, ఉన్నతాధికారుల బృందం తనిఖీలు కూడా చేపట్టగా, ఈ ఏడాది ఇంత వరకు నమోదు ప్రక్రియే పూర్తి స్థాయిలో ప్రారంభం కాలేదు. ఉపకార వేతనంలో 60 శాతం కేంద్రం, 40 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు వివిధ కోర్సుల ప్రకారం అందిస్తోంది. విద్యార్థుల బ్యాంక్ ఖాతాలకు నేరుగా జమ చేస్తోంది. కొన్ని బ్యాంకులు జీరో బ్యాలెన్స్‌తో బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేస్తుండగా, కొన్ని బ్యాంకులు రూ.100, రూ. 500 డిపాజిట్ ఉండాలంటూ నిబంధనలు పెడుతున్నాయి.
దీంతో విద్యార్థులు బ్యాంక్ అకౌంట్ తెరవాలంటే మేనేజర్లను ప్రాధేయపడాల్సి వస్తోంది. పశ్చిమ ప్రకాశంలోని దోర్నాల, పుల్లలచెరువు, అర్ధవీడు, రాచర్ల, కొమరోలు, తదితర ప్రాంతాల్లోని విద్యార్థులు మీ సేవా కేంద్రాలకు రోజుల తరబడి వెళ్లినా... ప్రక్రియ పూర్తి కాకపోగా, డబ్బు, సమయం వృథా అవుతోంది. ఆధార్‌కార్డు లేని వారి పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉంది. ఉపకార వేతనాలతో కళాశాలల్లో చదువుకునే విద్యార్థులు అవి అందుతాయో లేదోనని ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఆధార్ కార్డు నమోదు కేంద్రాలు అక్కడక్కడ ఉన్నా, కార్డు ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఈ వ్యవహారం విద్యార్థులకు, కళాశాలల ప్రిన్సిపాళ్లకు తలనొప్పిగా మారింది.
డివిజన్‌కు ఒక ఆధార్, మీసేవ కేంద్రం ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నాం
సరస్వతి, డిప్యూటీ డెరైక్టర్, సోషల్ వెల్ఫేర్
ఉపకారవేతనాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు కోసం ఆధార్‌కార్డు నంబర్ తప్పనిసరి. జిల్లాలో ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకున్నాం. మూడు డివిజన్లలో హాస్టల్ వార్డెన్లు, ప్రిన్సిపల్స్ సమావేశాలు పూర్తి కాగానే ఈ సమస్యను జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి డివిజన్‌కు ఒక ఆధార్, మీ సేవ కేంద్రాన్ని ఏర్పాటు చేయించాలని నిర్ణయించాం. కొన్ని ప్రాంతాల్లో గతంలో ఆధార్ ఫొటో తీయించుకున్నా, ఇంకా కార్డు రానివారు ప్రస్తుతం తీయించుకుంటేనే మంచిది. గత సంవత్సరం స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తు చేసుకున్న వారు కూడా ఈ సంవత్సరం ఆధార్ కార్డుతో మళ్లీ నమోదు చేసుకోవాల్సిందే.
నాలుగు నెలల కింద ఫొటో తీసినా..ఆధార్ కార్డు రాలేదు
రాజారపు నరసింహారావు, మీర్జపేట
మాది తర్లుపాడు మండలం మీర్జపేట. మార్కాపురంలోని ఓ ప్రైవేటు కళాశాలలో బీకాం చివరి సంవత్సరం చదువుతున్నాను. ఆధార్‌కార్డు కోసం 4 నెలల కిందట ఫోటో తీశారు. కార్డు రాలేదు. ఇంటర్‌నెట్ కేంద్రానికి వెళ్లి ఆధార్‌కార్డు వెబ్‌సైట్ చూస్తే నా దరఖాస్తు తిరస్కరించినట్లు చూపుతోంది. ఆధార్‌కార్డు లేకపోవడంతో ఉపకార వేతనం దరఖాస్తును పూర్తి చేయలేకపోయాను. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు?
ఆధార్ కార్డు లేక అవస్థలు..
ఉన్నం రామ్‌భూపాల్, శీతానాగులవరం, బీఎస్సీ ప్రథమ సంవత్సరం
ఆరునెలల కిందట మా ఊళ్లో ఆధార్‌కార్డు కోసం ఫొటోలు తీశారు. ఇంత వరకు కార్డు రాలేదు. ఆన్‌లైన్‌లో ఉపకార వేతనం కోసం దరఖాస్తు చేద్దామనుకుంటే ఆధార్ కార్డు నంబర్ అడుగుతోంది. కార్డు రాకపోవడంతో ఈ సంవత్సరం నేను ఉపకార వేతనానికి అర్హుడవుతానో లేదోననే ఆందోళన ఏర్పడింది.
‘ఉపకారానికి’ అడ్డంకి
Published Sat, Nov 23 2013 6:21 AM | Last Updated on Sat, Sep 15 2018 4:12 PM
Advertisement
Advertisement