కడప అర్బన్ : కడప కేంద్ర కారాగారంలో జీవిత ఖైదు అనుభవిస్తున్న జూటూరు కృష్ణమూర్తి(40) ఆదివారం సాయంత్రం 5.30 గంటల సమయంలో కారాగారం లోపలి ఆవరణంలో మామిడి చెట్టుకు టవల్‌తో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేంద్ర కారాగార డిప్యూటీ సూపరింటెండెంట్ వెంకట్రాజు, సిబ్బంది తెలిపిన కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.
కడప నగరంలోని అల్లూరి సీతారామరాజునగర్‌లో నివసిస్తున్న జూటూరు కృష్ణమూర్తి గత ఏడాది జూన్ 23వ తేదీన తన భార్య జూటూరు ఆదిలక్ష్మిపై కిరోసిన్ పోసి నిప్పటించి హత్య చేశాడు. ఆ కేసుకు సంబంధించి ఈ ఏడాది మార్చి 14న జీవిత ఖైదు విధించారు. అప్పటి నుంచి కడప కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్నాడు. ప్రతిరోజు మిగతా ఖైదీలతోపాటు తన కార్యక్రమాలలో పాల్గొంటూ కాలం గడిపే కృష్ణమూర్తి ఆదివారం సాయంత్రం ఉన్నట్లుండి తన దగ్గరున్న టవల్‌తో కారాగార ఆవరణంలోని మామిడి చెట్టు కొమ్మకు ఉరి వేసుకున్నాడు. ఈ సంఘటన గమనించిన సహచర ఖైదీలు, జైలు సిబ్బంది వెంటనే అతన్ని ఉరి నుంచి తప్పించి రిమ్స్‌కు హుటాహుటిన తరలించారు.
రిమ్స్ క్యాజువాలిటీకి తీసుకు రాగానే మృతి చెందాడు. ఈ విషయంపై కేంద్ర కారాగార డిప్యూటీ సూపరింటెండెంట్ వెంకట్రాజు మాట్లాడుతూ తమ సూపరింటెండెంట్ క్యాంపుపై వెళ్లారన్నారు. కృష్ణమూర్తి మామిడిచెట్టు కొమ్మకు టవల్‌తో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిసిందని, వెంటనే రిమ్స్‌కు తరలించామని పేర్కొన్నారు. క్యాజువాలిటీ నుంచి మృతదేహాన్ని రిమ్స్ మార్చురీకి తరలించారు. రిమ్స్ పోలీసులు కేంద్ర కారాగార అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నారు.
కేంద్ర కారాగారంలో జీవిత ఖైదీ ఆత్మహత్య
Published Mon, Apr 20 2015 4:01 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement