వామ్మో ఎండ!
సాక్షి, నెల్లూరు : ఏప్రిల్ ప్రారంభంలోనే ఎండలు భగభగమంటున్నాయి. వారం రోజులుగా పరిశీలిస్తే రోజు రోజుకూ ఉష్ణోగ్రత తీవ్రమవుతోంది. మార్చి ప్రారంభం నుంచే ఎండల తీవ్రత పెరుగుతూ రాగా, గత రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరిగాయి. మే నెలలో పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఊహించుకుంటూ జనం జడుసుకుంటున్నారు. ఇప్పుడే ఉదయం 11 గంటల దాటితే రోడ్లు ఎడారులను తలపిస్తున్నాయి.
మహిళలు చంటి పిల్లలతో బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. భానుడి ప్రచండ ప్రతాపంతో ఎక్కువగా ప్రజలు ఇళ్లకే పరితమవుతున్నారు. జిల్లాలో వాతావరణ పరిస్థితిలో ఒక్కసారిగా మార్పులొచ్చాయి. పగలు వేడిగా, రాత్రి చలి అధికంగా ఉంది. నాలుగు రోజులు వరకు రాత్రి పూట మంచు తీవ్రంగా ఉండగా, రెండు రోజులుగా మంచు కూడా తగ్గుముఖం పట్టింది. ఒకేసారి రెండు రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకోలేక చంటి పిల్లలు, వృద్ధులు ఇబ్బందులకు గురవుతున్నారు.
ఈ వారం రోజుల్లోనే వడ దెబ్బకు జిల్లా వ్యాప్తంగా నలుగురు మృత్యువాత పడ్డారు. దీనికి తోడు విద్యుత్ కోతలు అధికమవడంతో ఒక వైపు ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతుండగా రాత్రి వేళల్లో దోమల బెడద మరింత ఇబ్బందులకు గురి చేస్తోంది. ఏప్రిల్ నుంచి ఎండలు అధికమయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతుండడంతో ఈ రెండు నెలలు ఎండలను తట్టకునేదెలా అనే ఆందోళనలో ప్రజలు ఉన్నారు.
జిల్లాలో పరీక్షలు, ఎన్నికలు ఉండటంతో ఎండ వేడిమి సెగలు తట్టుకునేందుకు ప్రజలు అల్లాడుతున్నారు. అప్పుడే వేసవి తాపాన్ని తట్టుకునేందుకు కూల్‌డ్రింక్ షాపులు, ఐస్‌క్రీమ్ షాపులు కిటకిటలాడుతున్నాయి. నగరంలో పలు చోట్ల చెరకు రసం, పుచ్చకాయలు, కిరిణీ కాయలు విక్రయాలు కూడా అనూహ్యంగా పెరిగాయి.
ఎండలను తట్టుకోలేక పలువురు తమ ఇళ్లల్లో ఉండలేక ఏసీ సినిమా థియేటర్లకు పరుగులు తీస్తున్రాను. సినిమా ఎలా ఉన్నా సరే.. ఆ మూడు గంటల పాటు సేద తీరుదాం అనే భావన జనాల్లో కనిపిస్తోంది.