స్వామీ ఇదేం ధర ! | Swami watch price! | Sakshi
Sakshi News home page

స్వామీ ఇదేం ధర !

Published Mon, Nov 3 2014 3:03 AM | Last Updated on Sat, Sep 15 2018 3:51 PM

స్వామీ ఇదేం ధర ! - Sakshi

స్వామీ ఇదేం ధర !

  •  కాణిపాకంలో కాంట్రాక్టర్ల శఠగోపం  
  •  భక్తుల జేబులకు భారీగా చిల్లులు  
  •  పూజాసామగ్రి అమ్మకాల్లో మోసాలు
  • కాణిపాకం వినాయక స్వామి భక్తులకు కాంట్రాక్టర్లు టెండర్ పెట్టేశారు. పూజాసామగ్రి కోసం దుకాణాల వద్దకెళితే చాలు.. భక్తుల జేబులు ఖాళీ కావాల్సిందే. నిమ్మకాయ ఎనిమిది, టెంకాయ 30 రూపాయలకు పైగా విక్రయిస్తున్నారు. టెండర్లిచ్చిన ఆలయాధికారులు ఆయా షాపుల వద్ద ధరల పట్టికలను ఏర్పాటు చేయలేదు. ఇదే అదునుగా కాంట్రాక్టర్లు రెచ్చిపోతున్నారు. అందినకాడికి దోచుకుని భక్తులకు కుచ్చుటోపీ పెట్టేస్తున్నారు. పూజా సామగ్రిపైనే ఒక రోజుకు భక్తుల నుంచి 88 వేల రూపాయలకు పైగా అదనంగా వసూలు చేస్తున్నారంటే ఇక్కడ దోపిడీ ఏ స్థాయిలో సాగుతోందో అర్థం చేసుకోవచ్చు. ఇంత జరుగుతున్నా ఏ ఒక్క అధికారీ ఆ దుకాణాల వైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం.
     
    ఐరాల: కాణిపాకం వరసిద్ధి వినాయకుడిని కనులారా చూసి తరించాలని భక్తులు ఆశపడుతుం టారు. అందుకే నిత్యం రాష్ట్రం నుంచేగాక ఇతర రాష్ట్రాల నుంచీ పెద్దఎత్తున తరలివస్తుంటారు. వీరు స్వామిని దర్శించుకునే ముందు ఆలయం వద్ద ఏర్పాటు చేసిన దుకాణాల్లో పూజా సామ గ్రి కొనుగోలు చేస్తుంటారు. ఇక్కడ అధిక ధరలకు విక్రయిస్తూ భక్తుల జేబులు ఖాళీ చేయడం దుకాణదారులకు రివాజుగా మారింది.
     
    ఎలా దోచేస్తున్నారంటే..

    ఆలయానికి వివిధ ప్రాంతాల నుంచి రోజుకు పదివేల నుంచి 12వేల మంది భక్తులు వస్తుం టారు. పూజాసామగ్రి విక్రయించేందుకు ఆలయం వద్ద రెండు షాపులున్నాయి. వీటిని కాంట్రాక్లర్లు రూ.25 లక్షలకు వేలంపాటలో దక్కించుకున్నారు. ఆలయం తరపున పూజా సామగ్రి ఇవ్వకపోవడంతో భక్తులందరూ ఇక్క డే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇదే అదనుగా స్థానిక కాంట్రాక్టర్లు ధరలను విపరీతంగా పెంచేశారు. కొబ్బరికాయ బయట మార్కెట్‌లో రూ.7 నుంచి రూ.15 వరకు ఉంటోంది.

    రోజుకు ఐదు వేల మంది భక్తులు కొబ్బరికాయలు కొనుగోలు చేస్తుంటారు. బయట మార్కెట్‌లో సైజును బట్టి ఒక్కో కొబ్బరికాయ ధర రూ.7 నుంచి రూ.15 ఉండగా ఇక్కడ మాత్రం ఏకంగా రూ.25 నుంచి రూ.30 వసూలు చేస్తున్నారు. ఈ లెక్కన ఒక్కో కొబ్బరికాయ రూ.30 లెక్కన వేసుకున్నా భక్తులు రూ.1,50,000 వెచ్చించాల్సి వస్తోంది. ఇందులో రోజుకు అదనంగా రూ.75,000 దుకాణదారులకు సమర్పించుకోవాల్సి వస్తోంది.

    ఇక కొత్త వాహనాలు కొనుగోలు చేసేవారు ఇక్కడే పూజలు చేస్తుం టారు. వినాయకుని వద్ద పూజ చేస్తే శుభం కలుగుతుందని భక్తుల నమ్మకం. అందుకే ఇతర రాష్ట్రాల నుంచి సైతం ఇక్కడికి పెద్ద ఎత్తున వస్తుంటారు. ఇలా రోజుకు కనీసం 600 నుంచి వెయ్యి మంది వస్తుంటారు. వీరంతా తమ వాహనాల కోసం నిమ్మకాయలు, గుమ్మడికాయలు కొనుగోలు చేస్తుంటారు. ఇదే అదనుగా ఇక్కడ ఒక్కో నిమ్మకాయ రూ.8, గుమ్మడికాయ కిలో రూ.10 లెక్కన విక్రరుుస్తున్నారు.

    బయట మార్కెట్‌లో ఒక్కో నిమ్మకాయ రూ.2, గుమ్మడికాయ కిలో రూ.5 లెక్కన లభిస్తుంది. కానీ ఇక్కడి ధరల వల్ల భక్తులు నిమ్మకాయల కోసం రూ.4,800 నుంచి రూ.8000 వరకు వెచ్చిస్తున్నారు. ఈ లెక్కన బయట మార్కెట్‌కన్నా అదనంగా రూ.3,600 నుంచి రూ.6000 వరకు అదనంగా చెల్లించాల్సి వస్తోంది. ఇక గుమ్మడికాయలకు అదనంగా రూ.5000 వెచ్చిస్తున్నారు. ఇలా రోజుకు భక్తులు అదనంగా రోజుకు రూ.8,8000 వరకు ధారబోసుకోవాల్సి వస్తోంది.
     
    ఈ విధానాన్ని ఎందుకు ఎత్తేశారో..

    గత ఏడాది అక్టోబర్ నుంచి పూజా సామగ్రిని ఆలయం తరపునే విక్రయించేవారు. ఇందులో ఒక టెంకాయ, పూలదండ, 8 నిమ్మకాయలు కలిపి రూ.200కు విక్రయించేవారు. ఈ ఏడాది నవంబర్ నుంచి దానికి స్వస్తి చెప్పి కాంట్రాక్టర్లకు అప్పగించారు. వీరు ఇదే సెట్‌ను రూ.500 నుంచి రూ.600 వరకు ముక్కు పిండి వసూలు చేస్తున్నారు.
     
    ధరల బోర్డులు ఏర్పాటు చేయిస్తాం

    కాణిపాకం ఆలయం వద్ద టెండర్లు దక్కించుకున్న వారు తప్పనిసరిగా నియమనిబంధనలు పాటించాలి. అలా పాటించని వారిపై భక్తులు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. ప్రతిచోటా ధరలు సూచించే బోర్డులు ఏర్పాటు చేయిస్తాం.
     -పూర్ణచంద్రరావు, ఈవో, కాణిపాకం
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement