'బొత్స భారీగా అక్రమాలకు పాల్పడ్డారు'
హైదరాబాద్ : మాజీ మంత్రి, మాజీ పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ విజయనగరం జిల్లాలో భారీగా అక్రమాలకు పాల్పడ్డారని గజపతి నగరం టీడీపీ ఎమ్మెల్యే కే అప్పలనాయుడు ఆరోపించారు. శనివారం ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో సహకార రుణాల్లో అక్రమాల అంశంపై చర్చించారు. ఈ సందర్బంగా కే.అప్పలనాయుడు మాట్లాడుతూ... బొత్స ఆయన అనుచరులు బనామీ పేర్లతో పెద్ద ఎత్తున రుణాలు పొందారని విమర్శించారు. జిల్లాలోని 94 సహాకార సంఘాలలో మంజూరైన రుణాలపై సీబీసీఐడీతో విచారణ జరిపించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
జిల్లాలోని ఒక్క రావివలస సహాకార బ్యాంక్ నుంచే రూ. 9 కోట్ల బినామి రుణాలు పొందారని చెప్పారు. అందుకు ఏపీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సమాధానమిస్తూ... కొన్ని సొసైటీల్లో చాలా అవకతవకలు జరిగిన మాట వాస్తవమేనని తెలిపారు. గత పదేళ్ల కాలంలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపిస్తామని తెలిపారు. రుణాల్లో అక్రమాలకు పాల్పడినట్లు తెలిస్తే ఎంతటి వారిపైన అయిన కఠిన చర్యలు తప్పవని బొజ్జల గోపాల కృష్ణారెడ్డి హెచ్చరించారు.