ఎన్నికల వేళ...కోడ్ ఉల్లంఘించి..
కాకినాడ : ప్రశాంతంగా పోలింగ్ జరుగుతున్న 32, 33 డివిజన్‌ల్లో సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అధికార గర్వానికి మంగళవారం సాయంత్రం రామకృష్ణారావుపేటలో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. తొలుత 33వ డివిజన్‌లో టీడీపీ అభ్యర్థి వర్గీయులు, వైఎస్సార్ సీపీ అభ్యర్థుల మధ్య చోటు చేసుకున్న పోలింగ్ బూత్ ఏజెంట్ల విషయంపై ఎమ్మెల్యే కొండబాబు అక్కడికి చేరుకుని వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై బెదిరించే ధోరణిలో మాట్లాడే లోపు సిటీ కో–ఆర్డినేటర్ ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అక్కడికి చేరుకుని ఇరువర్గీయులను సముదాయిస్తుండగా ఎమ్మెల్యే కొండబాబు 33వ పోలింగ్ బూత్‌లోకి వెళ్లారు.
ఆయనతో పాటు ద్వారంపూడి కూడా బూత్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నిçస్తుండగా పోలీసులు లోపలికి వెళ్లేది కుదరదంటూ ద్వారంపూడిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు ఎమ్మెల్యే కోడ్ ఉల్లంఘించి లోపలకి వెళ్లొచ్చా? అంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేయగా అక్కడి పోలీసులు ఎమ్మెల్యే కొండబాబును వెనక్కి రప్పించారు. దీంతో వెనుదిరిగినా ఆయన అక్కసుతో 32వ డివిజన్‌లోని పోలింగ్ బూత్‌కు వెళ్లారు. ద్వారంపూడి ఇక్కడ కార్యకర్తలతో మాట్లాడుతుండగానే ఎమ్మెల్యే కొండబాబు పోలీసుల సమక్షంలోనే బూత్ లోపలి నుంచి బయటకు వస్తున్న వైఎస్సార్ సీపీ కార్యకర్త సైదులను కొట్టడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.
విషయం తెలుసుకున్న ద్వారంపూడి మళ్లీ అక్కడకు వచ్చేలోపు ఎమ్మెల్యే కొండబాబు జారుకున్నారు. దీంతో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు తీవ్ర ఆందోళనకు దిగడంతో డీఐజీ రామకృష్ణ, ఎస్పీ విశాల్ గున్నీ, డీఎస్పీలు సముదాయించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా సిటీ కో–ఆర్డినేటర్ ద్వారంపూడి స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ కోడ్ ఉల్లంఘించి ఎమ్మెల్యే చేసిన ఘాతుకంపై పోలీస్ ఉన్నతాధికారులు, ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తానని తెలిపారు.