దేశం తీరు ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదం
♦ ప్రస్తుత ఎన్నికల్లో దిగజారి వ్యవహరించిన టీడీపీ
♦ కోట్లు కుమ్మరించి అధికార దుర్వినియోగం
♦ వైఎస్సార్ సీపీ నేతలు కన్నబాబు, బోస్
కాకినాడ : నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో రూ.కోట్లు ఖర్చు చేసి అడుగడుగునా అధికార దుర్వినియోగానికి పాల్పడిన అధికార టీడీపీ వ్యవహారశైలి చూస్తే ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదంగా కనిపిస్తోందని ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు పేర్కొన్నారు. మంగళవారం రాత్రి వీరు విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. పోలీసుశాఖను అడ్డుపెట్టుకుని విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణీతోపాటు అడ్డుపడిన వైఎస్సార్‌సీపీ నేతలపై ఎదురుదాడికి దిగి తప్పుడు కేసులు బనాయించిన తీరుచూస్తే ఈ ఎన్నికల్లో టీడీపీ ఎంత పతనావస్థకు చేరిందో అర్థమవుతోందన్నారు.
ఎన్ని అడ్డదారులు తొక్కైనా గెలవడమే ప్రధానమన్న ధోరణిలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన మంత్రివర్గ సహచరులు వ్యవహరించారన్నారు. అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలతోపాటు ఇంటిలిజన్స్ అధికారులు కూడా ఇక్కడే తిష్టవేసి ప్రతికూలంగా ఉన్న ప్రాంతాలపై ఇచ్చిన నివేదికలు ఆధారంగా ప్రలోభాలకు తెరతీశారని విమర్శించారు. గతంలో ఏ పార్టీ కూడా ఇంతగా దిగజారిన పరిస్థితిని చూడలేదని కన్నబాబు, పిల్లి సుభాష్‌చంద్రబోస్ పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో ఓటమి చెందితే బీజేపీతో ఉన్న అనుబంధం తెగిపోతుందన్న భయంతో ఇలాంటి అకృత్యాలకు పాల్పడ్డారంటూ మండిపడ్డారు. మేథావులు సైతం టీడీపీ తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, ఇందుకు కాకినాడ ఎన్నికల్లో నమోదైన ఓట్ల శాతమే నిదర్శనమన్నారు.
నంద్యాలలో ముఖ్యమంత్రిపై జగన్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టిన అధికార పార్టీ నేతలు ప్రస్తుతం వ్యవహరిస్తున్న తీరు అంతకన్నా ప్రమాదకరంగా ఉందన్నారు. నైతిక విలువలకు తిలోదకాలిచ్చి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే ఇలాంటి విధానాలకు ఇకనైనా స్వస్తిపలకాలని హితవు పలికారు. లేని పక్షంలో సామాన్యుడు రాజకీయాల్లో మనుగడసాధించలేని పరిస్థితి ఎదురవుతుందన్నారు.
అడుగడుగునా ప్రలోభాలు
కార్పొరేషన్ ఎన్నికలు సందర్భంగా అడుగడుగునా ప్రలోభాల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేశారని ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్, జిల్లా అధ్యక్షుడు కన్నబాబు ఆరోపించారు. కొంత మంది పోలీసు సిబ్బంది దగ్గరుండి మరీ టీడీపీకి అనుకూలంగా ఓట్లు వేయించిన సంఘటనలు ఎదురయ్యాయన్నారు. అనేక ప్రాంతాల్లో తమ పార్టీ ఏజెంట్లను కూడా తీవ్ర ఇబ్బందులు పెట్టారన్నారు. టీడీపీకి చెందిన రౌడీషీటర్లు విచ్చలవిడిగా రోడ్లపై తిరుగుతున్నా పోలీసులు పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. ఎన్ని కుయుక్తులు పన్నినా తమ పార్టీ కార్పొరేషన్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించగలదన్న ధీమాను వ్యక్తం చేశారు. విలేకర్ల సమావేశంలో మండపేట, రాజమహేంద్రవరం, ముమ్మిడివరం, కో ఆర్డినేటర్లు వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి, గిరిజాల బాబు, పితాని బాలకృష్ణ, రాష్ట్ర కార్యదర్శులు కర్రి పాపారాయుడు. మిండకుదిటి మోహన్, తాడి విజయభాస్కరరెడ్డి, పార్టీనేతలు కుప్పాల వాసుబాబు, పేర్ని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.