కీచక టీచర్
Published Fri, Jan 24 2014 1:18 AM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM
= సంతగుడిపాడులో విద్యార్థినిపై లైంగిక దాడి
= పాఠశాల మాన్పించినా వదలని వైనం
= గ్రామస్తుల ఫిర్యాదుతో పరారైన ఉపాధ్యాయుడు
= నివేదిక అందగానే చర్యలు: డీప్యూటీ డీఈఓ
రొంపిచర్ల, న్యూస్‌లైన్: రొంపిచర్ల మండలం సంతగుడిపాడులో ఓ కీచక టీచర్ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన సంఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాల ఉపాధ్యాయుడు ఒకరుబాలికపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. మూడు నెలల క్రితం విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు పరువుపోతుందనే భయంతో గుట్టుచప్పుడు కాకుండా బాలికను పాఠశాల మాన్పించి ఇంటి వద్దే వుంచుతున్నారు. అప్పటికీ బుద్ధి మార్చుకోని ఆ ఉపాధ్యాయుడు బాలిక తల్లిదండ్రులు పొలం వెళ్లిన సమయంలో ఇంటికి వెళ్లి విద్యార్థినిని వేధిస్తున్నట్లు గ్రామస్తులు గుర్తించారు.
ఈ విషయాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి ఫిర్యాదు చేయడంతో ఆ ఉపాధ్యాయుడు పలాయనం చిత్తగించాడు. విషయం తెలుసుకున్న డిప్యూటీ డీఈఓ కిరణ్‌కుమార్ పాఠశాలకు చేరుకొని విచారణ నిర్వహించారు. దీనిపై సమగ్ర నివేదిక అందించాలని ప్రధానోపాధ్యాయుడిని ఆదేశించారు. దీనిపై డిప్యూటీ డీఈఓ కిరణ్‌కుమార్‌ను ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా రెండు నెలల క్రితం ఆ ఉపాధ్యాయుడి ప్రవర్తనపై తనకు ఫిర్యాదులు అందడంతో మెమో ఇచ్చినట్టు తెలిపారు. ప్రస్తుత సంఘటనపై ప్రధానోపాధ్యాయుడి నివేదిక అందిన తరువాత చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇదిలావుండగా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని రొంపిచర్ల ఎస్‌ఐ సురేష్‌బాబు తెలిపారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని చెప్పారు.
Advertisement
Advertisement