న్యాయం చేయాలని వినతి
ఎమ్మెల్యే చెవిరెడ్డిని కోరిన ఏరియా ఆస్పత్రి సిబ్బంది
తిరుపతి రూరల్ : ‘ఆస్పత్రిలో ఏళ్లతరబడి పనిచేస్తున్నాం.. ఇప్పుడు ఉద్యోగులను తీసేసి ఆస్పత్రిని స్వాధీనం చేసుకోవాలని మెడికల్ కళాశాల అధికారులు ప్రయత్నిస్తున్నారు. మేమంతా రోడ్డున పడతాం.. మీరైనా న్యాయం చేయండి’ అంటూ చంద్రగిరి ఏరియా ఆస్పత్రి సిబ్బంది వేడుకున్నారు. శనివారం తుమ్మలగుంటలో ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు.
ఆస్పత్రి సిబ్బంది మాట్లాడుతూ 50మందికిపైగా సిబ్బందిని తొలగించాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భవనాలతోపాటు సిబ్బంది కూడా ఉండేవిధంగా చూడాలని కోరారు. ఎమ్మెల్యే స్పందిస్తూ వైద్యవిధాన పరిషత్ కనకదుర్గం మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీధర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఉద్యోగులకు న్యాయం చేయకుంటే కళాశాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఆయన వెంట వైఎస్‌ఆర్ సీపీ జిల్లా కార్యదర్శి హేమేంద్ర కుమార్‌రెడ్డి, హాస్పిటల్ కమిటీ సభ్యులు యుగంధర్‌రెడ్డి, మిట్టపాళెం ఎంపీటీసీ నాగరాజు, ఆనంద్ భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.