హామీలను విస్మరించిన టీడీపీ ప్రభుత్వం
యర్రగొండపాలెం టౌన్ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలను ఆ పార్టీ అధికారంలో కొచ్చిన తరువాత పూర్తిగా విస్మరించారని యర్రగొండపాలెం ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్‌రాజు విమర్శించారు. తన నివాస గృహంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అధికారంలోకి వస్తే రైతులు, డ్వాక్రా మహిళల రుణాలు పూర్తిగా మాఫీ చేస్తానని ఎన్నికల్లో వాగ్దానం చేసిన చంద్రబాబు ఆ తరువాత వారిని మోసగించారని..పేదల పింఛన్ల విషయంలోనూ అర్హులను తొలగించి ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు.
మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేసిన పథకాలను నిర్వీర్యం చేస్తున్నారన్నారు. ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. మెట్ట ప్రాంత అభివృద్ధికి అవసరమైన వెలిగొండ ప్రాజెక్టు ప్రాధాన్యతను పూర్తిగా టీడీపీ ప్రభుత్వం విస్మరించిందన్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 24, 25 తేదీల్లో ఒంగోలు రైల్వేస్టేషన్ సమీపంలోనే బచ్చల బాలయ్య కల్యాణ మండపంలో నిర్వహించనున్న వైఎస్సార్ సీపీ సమీక్ష సమావేశాల్లో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తామన్నారు. 25వ తేదీ ఉదయం పది గంటలకు యర్రగొండపాలెం నియోజకవర్గ సమీక్ష జరుగుతుందని తెలిపారు.
సమీక్ష సమావేశానికి వైఎస్సార్ సీపీ మండల పార్టీ అధ్యక్షులు, పార్టీ విభాగాల అధ్యక్షులు, స్టీరింగ్ కమిటీ సభ్యులు, ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు, సహకార సంఘాల అధ్యక్షులు, కోఆప్షన్ సభ్యులు, పార్టీ ముఖ్య నాయకులు తప్పక పాల్గొనాలని ఎమ్మెల్యే కోరారు. కార్యక్రమంలో వైపాలెం ఎంపీపీ చేదూరి విజయభాస్కర్, పుల్లలచెరువు మండల పార్టీ అధ్యక్షుడు ఉడుముల శ్రీనివాసరెడ్డి, వైపాలెం మండల కోఆప్షన్ సభ్యుడు షేక్ మౌలాలీ, వైఎస్సార్ సీపీ యువజన విభాగం పట్టణ అధ్యక్షుడు వనిపెంట రామిరెడ్డి, మాజీ సొసైటీ అధ్యక్షుడు కే ఓబుల్‌రెడ్డి పాల్గొన్నారు.