సాక్షి ప్రతినిధి, నెల్లూరు/సూళ్లూరుపేట : ఇస్రో సాధించిన విజయాల్లో ఎంవైఎస్ ప్రసాద్ పాత్ర కీలకం. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో మైలురాళ్లు దాటుకుంటూ ముందుకు సాగుతున్నారు. అందుకే భారత ప్రభుత్వం ఆయన్ను అత్యున్నత పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. తాజాగా విక్రమ్‌సారాభాయ్ స్మారక అవార్డు అందుకోబోతున్న ఎంవైఎస్ ప్రసాద్ గురించి ‘సాక్షి’ పాఠకులకు ప్రత్యేక కథనం.
సాధారణ రైతు కుటుంబం నుంచి...
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)లో ఉన్న అతికొద్ది మంది శాస్త్రవేత్తల్లో తెలుగుతేజం పద్మశ్రీ డాక్టర్ ఎంవైఎస్ ప్రసాద్ ఒకరుగా చెప్పుకోవచ్చు. పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరుకు చెందిన ఎం.రామసూర్యనారాయణమూర్తి, భాస్కరం దంపతుల ఐదో సంతానం ప్రసాద్. 1953 మే 4న ఆయన జన్మించారు. మొగల్తూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎస్‌ఎస్‌ఎల్‌సీ పూర్తి చేశారు.
ఏలూరు సీఆర్‌రెడ్డి కళాశాలలో పీయూసీ, కాకినాడ ఇంజినీరింగ్ కళాశాలలో ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్‌లో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. కిరోసిన్ బుడ్డీ వెలుగుల్లో చదువుకున్న అతి సామాన్యుడు అంతరిక్ష పరిశోధనల్లో ఖ్యాతిని పొందారు. తెలుగు మీడియంలో చదివి అంతరిక్ష ప్రయోగాలు చేసే స్థాయికి ఎదగవచ్చని రుజువు చేశారు. విదేశీ అవకాశాలను వదులుకుని దేశానికి సేవ చేయాలనే తపనతో 1975 మేలో ఇస్రో చేరిన ఎంవైఎస్ ప్రసాద్ కేరళ, ఫ్రాన్స్ దేశంలో ఇండియన్ ఎంబసీ స్పేస్ కౌన్సిలర్‌గా, పీఎస్‌ఎల్‌వీ ప్రాజెక్ట్ డిప్యూటీ డెరైక్టర్‌గా, కర్ణాటకలోని హసన్‌లో ఉన్న మిషన్ కంట్రోల్ ఫెసిలిటీ సెంటర్ అసోసియేట్ డెరైక్టర్‌గా ఉన్నారు. అదే సెంటర్‌కు డెరైక్టర్‌గా కూడా పనిచేశారు. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌లోని డెక్కు అనే సెంటర్‌కు డెరైక్టర్‌గా, స్పేస్ అప్లికేషన్ సెంటర్ డెరైక్టర్‌గా కొనసాగారు. ప్రస్తుతం షార్ డెరైక్టర్‌గా కొనసాగుతున్నారు. భారత అంతరిక్ష సంస్థలో 39 ఏళ్లుగా సుదీర్ఘమైన తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తున్నారు. షార్ చరిత్రలో ఒక తెలుగు వ్యక్తి డెరైక్టర్‌గా పనిచేసిన ఘనత డాక్టర్ ఎంవైఎస్ ప్రసాద్‌కే దక్కుతుంది. షార్‌లో ఎస్‌ఎల్‌వీ డీ3 ప్రయోగ సమయంలో అంతరిక్ష పితామహుడు, భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్‌కలాం వద్ద పనిచేసిన ఘనత కూడా ఆయనకే దక్కింది. ఇస్రోలో అన్ని విభాగాల్లో పనిచేస్తూ సాంకేతిక పరంగా ప్రతిభ చూపుతూ.. అంచెలంచెలుగా ఎదుగుతున్నా ఒదిగి పనిచేస్తూ తెలుగుజాతికి వన్నెతెస్తున్నారు.
లీకేజీని గుర్తించకపోతే పెను ప్రమాదమే
ప్రయోగవేదిక చుట్టూ వివిధ రకాల కోణా ల్లో 25 కెమెరాలు పనిచేస్తుంటాయి. మిషన్‌కంట్రోల్‌రూంలో కూర్చుని ప్రయోగాన్ని చేసేందు కు శాస్త్రవేత్తలంతా సిద్ధంగా ఉన్నారు. కౌంట్‌డౌన్ ముగిసేందుకు రెండు గంటల ముందు కెమెరాల్లో లీకేజీని ప్రసాద్ గుర్తించి ఇతర శాస్త్రవేత్తలకు వివరించారు. రెండో దశలో ద్రవ ఇంధనం తో పాటు నీళ్లు కూడా ఉం టాయి. లీకైంది నీళ్లా..! లేక ద్రవ ఇంధనమా..? అనేదాన్ని గుర్తించగలిగారు.
చివరకు ద్రవ ఇంధనమే అని నిర్థారించుకుని ఇస్రో చైర్మన్‌కు చెప్పి ప్రయోగాన్ని ఆపేశారు. ఆ సమయంలో లీకేజీని గుర్తించకపోతే పెను ప్రమాదం జరగడమే కాకుండా శ్రీహరికోట రాకెట్ కేంద్రానికి ఊహించని ప్రమాదం వాటిల్లేది. వెంటనే సేప్టీ టీంకు సమాచారం అందించి ప్రయోగవేదిక వద్ద ఇంధనం వేడిని తగ్గించడానికి అక్కడే ఉన్న నీళ్లట్యాంకర్ సాయంతో కొన్ని వేల గ్యాలన్లు పంపింగ్ చేసి ప్రయోగవేదికను, లాంచ్ వెహికల్‌ను, ఉపగ్రహాన్ని కాపాడగలిగారు. లేదంటే ఊహించనటువంటి ప్రమాదం జరిగి ఇస్రోకు సుమారు వందలాది కోట్ల రూపాయల నష్టం వాటిల్లడమే కాకుండా మరో అయిదారేళ్లు ప్రయోగాలే లేకుండా ఆగిపోయేవి.
రూ.200 కోట్లు విలువ చేసే జీఎస్‌ఎల్‌వీ రాకెట్ రూ. 400 కోట్లు విలువ చేసే య్రోగవేదికను కాపాడటంతో పాటు క్రయోజనిక్ దశను కూడా అత్యంత జాగ్రత్తగా కాపాడిన వ్యక్తి ఎంవైఎస్ ప్రసాద్. ఇందులో ఆయన టీం ప్రత్యేక పాత్ర పోషించారు. రాకెట్‌లో అప్పటికే 199.5 టన్నుల ద్రవ ఇంధనం, 138.5 టన్నుల ఘన ఇంధనం, 12.5 టన్నుల క్రయోజనిక్ ఇంధనం ఉంది. ఘన ఇంధనం కలిగిన మొదటి దశను, మూడో దశలోని క్రయోజనిక్ దశను జాగ్రత్తగా విప్పదీసి స్టోర్ చేశా రు. మొదటి దశలోని నాలుగు స్ట్రాపాన్ బూస్టర్లల్లో నింపిన 160 టన్నుల ద్రవ ఇంధనం, రెండోదశలో 39.5 టన్నుల ద్రవ ఇంధనాన్ని మళ్లీ వెనక్కి తీసి సేకరించేందుకు 500 మంది టెక్నికల్ టీం సుమారు 24 గంటలు కష్టపడి ప్రమాదాన్ని తప్పించి పెద్ద మొత్తంలో ఆదా చేశారు. ఈ ఇంధనం ఏ మాత్రం కొద్దిగా కిందపడినా పెద్ద ప్రమాదం సంభవించేది.
వీటిన్నింటిని అత్యంత జాగ్రత్తగా బయటకు తీసి మళ్లీ 2014 జనవరి 5న ప్రయోగించి విజయాన్ని సాధించడంలో ప్రసాద్, ఆయన టీం కృషి ఉందని పలువురు శాస్త్రవేత్తలు ప్రశంసించటం విశేషం. ఇది ఇస్రోకే కాకుండా తన ఇన్నేళ్లు అంతరిక్ష ప్రయాణంలో ఛాలెంజ్‌గా నిలిచిందని.. తన జీవితంలో మరిచిపోలేని సంఘటనగా ఆయన చెప్పుకుంటుం టారు. చంద్రయాన్-1 ప్రయోగంలో చిన్నపాటి లీకేజీ వచ్చినపుడు కూడా భయపడినా... వెంటనే దాన్ని అరెస్ట్ చేసి నిర్ణీత సమయానికే ప్రయోగించి మంగళ్‌యాన్, క్రయోజనిక్ దశ సక్సెస్‌లు తన జీవితంలో మరువలేనివని గర్వంగా చెబుతుంటారు.
ఇస్రో విజయాల్లో
ప్రసాద్‌ది కీలక పాత్ర
ఇస్రో సాధించిన విజయాల్లో ఎంవైఎస్ ప్రసాద్ కీలకపాత్ర పోషించారు. 2008లో షార్ అసోసియేట్ డెరైక్టర్‌గా ప్రవేశించిన తర్వాత17 పీఎస్‌ఎల్‌వీ రాకెట్లు, మూడు జీఎస్‌ఎల్‌వీ రాకెట్లు విజయం సాధించేందుకు ఆయన పాత్ర ప్రత్యేకం. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఏర్పడిన తర్వాత శ్రీహరికోట రాకెట్ కేంద్రం నుంచి 45 ప్రయోగాలు చేయగా ఎనిమిది మాత్రమే అపజయం పాలయ్యాయి. మిగిలిన 37 ప్రయోగాలను విజయవంతం కాగా ఇందులో ఎంవైఎస్ ప్రసాద్ షార్ అసోసియేట్ డెరైక్టర్, డెరైక్టర్‌గా 20 ప్రయోగాలు నిర్వహించారు.
ఆగస్టు 19, 2013 ప్రయోగించాల్సిన జీఎస్‌ఎల్‌వీ డీ5 రాకెట్ ప్రయోగానికి గంటముందు రెండోదశలో లీకేజీని గుర్తించి ప్రయోగం వాయిదా వేశారు. రాకెట్‌లోని ఇంధనాన్ని, ఉపగ్రహాన్ని రికవరీ చేసే విషయంలో ప్రసాద్ ప్రత్యేకమైన పాత్ర పోషించి సుమారు రూ.800 కోట్లు ఇస్రోకు ఆదా చేసిన ఘనత ప్రసాద్‌కే దక్కింది. అనతికాలంలోనే జనవరి 5న ఈ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించడంలో ఆయన కృషి కీలకం. ఈ ప్రయోగంలో మొట్టమొదటిసారిగా పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించి క్రయోజనిక్ దశతో విజయాన్ని షార్ సొంతం చేసినందుకు షార్ డెరైక్టర్ ప్రసాద్ ఎనలేని ప్రశంసలు అందుకున్నారు.
ప్రసాద్‌ను వరించిన అవార్డులు
2001లో కన్నడ రాజ్యోత్సవ అవార్డు, 2007, 2009లో మూడు ఇస్రో ఎక్స్‌లెంట్ అవార్డులు అందుకున్నారు. 2011లో టీం ఎక్స్‌లెంట్ అవార్డు, 2013లో తమిళనాడు అరుణై ఇంజినీరింగ్ కళాశాల వారు లైఫ్‌టైం అచీవ్‌మెంట్ అవార్డుతో సత్కరించారు. ఎంవైఎస్ ప్రసాద్ షార్ డెరైక్టర్‌గా బాధ్యతలు చేపట్టాక నెల్లూరులో ప్రొఫెసర్ నాయుడమ్మ అవార్డును అందుకున్నారు. 2013లో తాను చదువుకున్న ఇంజినీరింగ్ కళాశాల యాజమాన్యం, అధ్యాపకుల నుంచి సన్మానాన్ని అందుకున్నారు.
2014లో జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ నుంచి పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. తాజాగా విక్రమ్‌సారాభాయ్ స్మారక అవార్డును అందుకోబోతున్న వ్యక్తి ఎంవైఎస్ ప్రసాద్. ప్రస్తుతం ఆయన మానవ సహిత ప్రయోగాల వైపు దృష్టి సారించారు. అందులోనూ విజయం సాధించాలని పలువురు శాస్త్రవేత్తలు, భారతీయులు కోరుతున్నారు.
అంతరిక్ష ప్రయోగాల్లో అసామాన్యుడు
Published Thu, Mar 5 2015 3:08 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
Advertisement
Advertisement