సాక్షి ప్రతినిధి, విజయనగరం : సొంత జిల్లాలో పనిచేస్తున్నారా? మూడేళ్లుగా జిల్లాలోనే ఉన్నారా?...అయితే బదిలీ తప్పదు. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జిల్లాలో భారీ స్థాయిలో అధికారుల బదిలీలు జరగనున్నాయి. రెవెన్యూ, పోలీస్ అధికారులపైనే కాకుండా ఈసారి ఎంపీడీఓలను కూడా బదిలీ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించిం ది. ఈ మేరకు స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. ఫిబ్రవరి 15లోగా బదిలీల ప్రక్రియ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని కూడా ఆదేశించింది. దీంతో పలువురు అధికారులు ఆందోళన చెందుతున్నారు.
ఎంపీడీఓలకూ...
ఎన్నికల వేళ అధికారులు సొంత జిల్లాలో పనిచేస్తే పక్షపాతంగా వ్యవహరించడానికి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో ప్రతిసారీ రెవెన్యూ, పోలీస్ అధికారుల్ని కేంద్రం ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రభుత్వం బదిలీ చేస్తుంది. ఈసారి కూడా అందుకు తగ్గట్టుగానే రంగం సిద్ధమవుతోంది. త్వరలో సాధారణ ఎన్నికలు జరగనుండడంతో ప్రక్రియ ఊపందుకుంది. ఈసారి బదిలీ జాబితాలోకి ఎంపీడీఓలు కూడా చేరారు. ఎన్నికల వ్యయ పర్యవేక్షణ, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి హోదాలో పనిచేస్తున్నందున ఎంపీడీఓలను కూడా బదిలీ చేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.
మూడేళ్లు పూర్తయితే....
ఈ క్రమంలో 2014 మే 31 నాటికి జిల్లాలో మూడేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న వారితో పాటు సొంత జిల్లాలో పనిచేస్తున్న రెవెన్యూ, పోలీస్, ఎంపీడీఓలందరికీ బదిలీ తప్పదు. ఈ మేరకు జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. బదిలీ కావల్సిన వారి జాబితాను సిద్ధం చేసే పనిలో పడింది. ఇప్పటివరకు ఉన్న సమాచారం మేరకు జిల్లా వ్యాప్తంగా 42 మంది తహశీల్దార్లకు స్థానచలం అయ్యే అవకాాశం ఉంది. అలాగే డిప్యూటీ కలెక్టర్లు, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, ఎన్నికలతో సంబంధం ఉన్న మిగతా రెవెన్యూ అధికారులందరికీ బదిలీ కానుంది. ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో 28 ఎంపీడీఓలకు బదిలీ జరగనుంది. ఇదే తరహాలో సీఐ, ఎస్‌ఐ హోదాలో పనిచేస్తున్న 15మందికి బదిలీ కావొచ్చు.
రెవెన్యూ అధికారులు, ఎంపీడీఓలకైతే జిల్లా దాటి బదిలీ చేయనున్నారు. పోలీస్ అధికారులకూ స్థాన చలనం కలగనుంది. ఇదిలా ఉండగా 2014మే 31నాటికి ఆరు నెలల్లోపు రిటైరైన వాళ్లు ఉంటే వారికి ఎన్నికల సంఘం బదిలీ నుంచి మినహాయింపు ఇచ్చింది. అలాంటి వారందర్నీ ఎన్నికలకు దూరంగా ఉంచాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. తమ మార్గదర్శకాలు, ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాల్సిందేనని, సొంత నిర్ణయాలు తీసుకోవద్దని హెచ్చరికలు జారీ చేసింది.
జిల్లా పరిషత్ సీఈఓకూ స్థానచలనం ?
జిల్లా పరిషత్ సీఈఓ సీ.మోహనరావుకి బదిలీ అయ్యే అవకాశం ఉంది. విశాఖ జెడ్పీ సీఈఓగా పనిచేస్తున్న వెంకటరెడ్డి ఆ జిల్లాలో మూడేళ్లు పూర్తి చేసుకోవడంతో ఎన్నికల సంఘం నిబంధనల మేరకు బదిలీ కావల్సి ఉంటుంది. ఈ క్రమంలో వెంకటరెడ్డి పక్క జిల్లాలపై దృష్టి సారించారు. ఇక్కడ పనిచేస్తున్న మోహనరావు కూడా బదిలీపై వెళ్లిపోవాలన్న ఆసక్తితో ఉన్నారని తెలుసుకున్నట్టు సమాచారం. జిల్లాలో మూడేళ్లు పూర్తి కాకపోయినప్పటికీ స్థానికంగా ఎదురవుతున్న ఇబ్బందులు దృష్ట్యా మోహనరావు వీలైనంత తొందరగా బదిలీ చేయించుకోవలన్న యోచనలో ఉన్నారని తెలుసుకున్న విశాఖ సీఈఓ వెంకటరెడ్డి ఆయనతో సంప్రదింపులు చేసినట్టు తెలిసింది. వీరిద్దరూ లోపాయికారీ ఒప్పందంతో పంచాయతీరాజ్ ఉన్నతాధికారులకు రిక్వెస్ట్ కూడా పెట్టుకున్నట్టు సమాచారం. ఈ పరిణామాల దృష్ట్యా వెంకటరెడ్డి ఇక్కడికి, మోహనరావు వైజాగ్‌కి వెళ్లే అవకాశం ఉందని అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది.
బదిలీల గోల
Published Sat, Jan 18 2014 4:26 AM | Last Updated on Sat, Sep 2 2017 2:43 AM
Advertisement
Advertisement