‘మరుగు’ పడుతోంది
అరకులోయ,న్యూస్‌లైన్: ఏజెన్సీలోని గిరిజన సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులు మరుగు సమస్యను ఎదుర్కొంటున్నారు. రన్నింగ్ వాటర్ సదుపాయం లేక ఉన్న మరుగుదొడ్లు నిరుపయోగంగా ఉంటున్నాయి. అరకులోయ నియోజకవర్గం పరిధిలోని ఆరు మండలాల్లో గిరిజన గురుకుల పాఠశాలలుకాక 55 గిరిజన సంక్షేమ వసతి గృహాలు ఉన్నాయి. వీటిల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా రూ. లక్షలు వెచ్చించి పదుల సంఖ్యలో ప్రభుత్వం మరుగుదొడ్లు నిర్మించింది. అయితే ఇందులో ఏ వసతి గృహంలోనూ రన్నింగ్ వాటర్ సదుపాయం లేదు. దీంతో వర్షాకాలం, చలికాలంలో విద్యార్థులు కాలకృత్యాలకు బయటకు వెళ్లడానికి తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం చలి కాలం కావడంతో గజగజ వణుకుతూ బహిర్భూమికి బయటకు వెళుతున్నారు.
బాలికలు అప్పుడప్పుడు ఆకతాయిల వేధింపులకు గురవుతున్నారు. రూ. లక్షలతో నిర్మించిన మరుగుదొడ్లు కాంట్రాక్టర్లకు వరంగా మారాయి తప్ప,విద్యార్థులకు ఉపయోగపడటం లేదు. అరకులోయ మండలం కంఠబౌంసుగుడ పాఠశాలలో 28 మరుగుదోడ్లలో ఒక్కదానికీ నీటి సదుపాయం లేదు. రవ్వలగుడ పాఠశాలలో 30,అరకులోయ బాలికల పాఠశాలలో 40 మరుగుదోడ్లదీ ఇదే దుస్థితి. లోతేరు, కొత్తభల్లుగుడ, అనంతగిరి మండలం గిరిజన సంక్షేమ బాలికల పాఠశాల, టీడబ్ల్యూ బాలికల పాఠశా ల, బాలుర పాఠశాల, బొర్రా, టోకూరు, పెదబిడ్డ,లంగుపర్తి, చిలకలగెడ్డ, జీనబాడు,పినకోట,భీంపోలుల్లోనూ ఇదే పరిస్థితి.
డుంబ్రిగుడ,ముంచంగిపుట్టు, పెదబయలు మండలాల్లో నూ పరిస్థితి ఇందుకు భిన్నంగా లేదు. వీటిలో సగం కూడా వినియోగంలోలేవు. హుకుంపేట మండలం పెదగరువు బాలికల పాఠశాల మినహా మరేదానిలోనూ మరుగుదొడ్లు పనిచేయడంలేదు. ఎండకాలంలో పరిస్థితి ఏలా ఉన్నా, వర్షాకాలం, చలి కాలంలో విద్యార్థుల ఇక్కట్లు వర్ణనాతీతం. ఆరుబయటకు వెళ్లి రో గాలతోపాటు ప్రమాదాలకు గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.