90 పోస్టులు.. 270 మంది అభ్యర్థులు
Published Tue, Feb 25 2014 2:23 AM | Last Updated on Sat, Sep 2 2017 4:03 AM
విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లాలో వీఆర్వో పోస్టుల భర్తీ ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. ఇప్పటికే మెరిట్ అభ్యర్థులను గుర్తించారు. వారి జాబితాను కలెక్టరేట్ ఆడిటోరియంతోపాటు, వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ధ్రువపత్రాల పరిశీలన నిమిత్తం అర్హులైన అభ్యర్థులకు నేరుగా ఫోన్ చేయడంతోపాటు, సంక్షిప్త సందేశాలను (ఎస్‌ఎంఎస్) పంపుతున్నారు. ఈ నెల 27వ తేదీలోగా ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేయాలని సీసీఎల్‌ఏ నుంచి ఆదేశాలు రావడంతో మంగళవారం నుంచే ఈ ప్రక్రియను ప్రారంభించనున్నారు. సమాచారం అందుకున్న అభ్యర్థులు మధ్యాహ్నం 2 గంటలకు కలెక్టరేట్‌కు చేరుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు గెజిటెడ్ అధికారి సంతకంతో కూడిన మూడు సెట్ల సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలతోపాటు, మూడు ఫొటోలు, ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకురావాల్సి ఉంటుంది. మొత్తం 90 పోస్టులకు గానూ 270 మందిని ధ్రువపత్రాల పరిశీలనకు ఆహ్వానించారు. ఓపెన్ కేటగిరీలో 95 మార్కులను కటాఫ్‌గా నిర్ణయించారు. జాబితా సిద్ధం చేయడానికి కలెక్టరేట్ ఆధికారులు తీవ్ర కసరత్తు చేశారు. అయితే మార్కులు సమానంగా వస్తే వయస్సు ఎక్కువ ఉన్న వారికే ప్రాధాన్యం ఇస్తారు.
సామాజిక వర్గాలవారీగా కటాఫ్ మార్కులు ఇలా...
సామాజిక వర్గాల వారీగా 1:3 నిష్పత్తి ప్రకారం కటాఫ్ మార్కులను నిర్ణయించారు. దాని ఆధారంగా అభ్యర్థులను ధ్రువపత్రాల పరిశీలనకు పిలిచారు. ఓసీ, బీసీ-డి కేటగిరీలో 95, బీసీ మహిళ 91, ఎస్సీ మహిళ 74, వికలాంగులు 57, బీసీ-సి(జనరల్) 62, బీసీ-ఎ 89, బీసీ-ఎ మహిళ 74, ఎస్టీ జనరల్ 72, బీసీ-బి జనరల్ 91, బీసీ-బి మహిళ 78, బీసీ-ఈ జనరల్ 72, ఎక్స్‌సర్వీస్‌మెన్ 74, ఎస్సీ జనరల్ 83, ఎస్టీ మహిళ 58, వికలాంగులు(హెచ్‌హెచ్) 80 మార్కుల చొప్పున వచ్చిన వారిని ధ్రువపత్రాల పరిశీలనకు పిలిచారు. అయితే వీరిలో 90 మందికి మాత్రమే పోస్టులు దక్కుతాయి.
Advertisement
Advertisement