కాకినాడ సిటీ : సాగునీటి వినియోగ సంఘాలు, డిస్ట్రిబ్యూటరీ, ప్రాజెక్ట్ కమిటీలకు సర్వసభ్య అంగీకారాలతో యాజమాన్య కమిటీల ఏర్పాటుకు షెడ్యూల్ ప్రకారం చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ తెలిపారు. రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు హైదరాబాద్ నుంచి కలెక్టర్లు, ఇరిగేషన్ ఎస్‌ఈలతో శుక్రవారం రాత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ నెల 7 నుంచి 25 లోగా ఆయా కమిటీల సర్వసభ్య సమావేశాలు నిర్వహించి, సభ్యుల అంగీకారంతో చైర్మన్, వైస్ చైర్మన్, నలుగురు సభ్యులతో కూడిన యాజమాన్య కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఇరిగేషన్ ఏఈల ఆధ్వర్యాన తహశీల్దార్ల పర్యవేక్షణలో నీటి వినియోగదార్ల సంఘాలకు, డీఈల ఆధ్వర్యాన ఆర్‌డీఓల పర్యవేక్షణలో డిస్ట్రిబ్యూటరీ కమిటీలకు, ఈఈ ఆధ్వర్యాన జాయింట్ కలెక్టర్ పర్యవేక్షణలో ప్రాజెక్ట్ కమిటీలకు యాజమాన్య కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆయా సంఘాలు, కమిటీల సర్వసభ్య సమావేశాలకు ఏడు, ఐదు రోజుల ముందస్తు నోటీసులు జారీ చేసి, ఆయా కమిటీల ప్రధాన కేంద్రాల్లోనే నిర్వహించాలన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 401 నీటి వినియోగదారుల సంఘాలు, 30 డిస్ట్రిబ్యూటరీ కమిటీలు, 5 ప్రాజెక్ట్ కమిటీల సర్వసభ్య సమావేశాల నిర్వహణకు నోటీసులు జారీ చేశామని, ఈ ప్రక్రియ నిర్వహణకు జాయింట్ కలెక్టర్-2ను కాంపిటెంట్ అథారిటీగా నియమించామని తెలిపారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్-2 డి.మార్కండేయులు, ఇరిగేషన్ ఎస్‌ఈ సుగుణాకరరావు, ఈఈలు పాల్గొన్నారు.
షెడ్యూల్ ప్రకారం నీటిసంఘాల ఎన్నికలు
Published Sat, Sep 5 2015 12:41 AM | Last Updated on Sun, Sep 3 2017 8:44 AM
Advertisement
Advertisement